iDreamPost

సిగ్గెవరు పడాలి… చినబాబు..?

సిగ్గెవరు పడాలి… చినబాబు..?

గతం ప్రభావం అందరిపై ఉంటుంది. కానీ, కొంత మంది గతం…వారి వర్తమానాన్ని విపరీతంగా ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు సదరు వ్యక్తులు, సంస్థలు వర్తమానంలో క్రమంగా నైతికతను కోల్పోతాయి. పరిస్థితులను చూస్తుంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన పుత్రరత్నం లోకేశ్ లతోపాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలోని ఒక వర్గం ఇప్పుడీ దశకు చేరాయా…! అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

విషయంలోకి వెళ్తే నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన పత్రికా ప్రకటనపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. సిగ్గుందా అంటూ విమర్శలు చేయటం, తమ గత పాలన ఆసరాగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై సెటైర్లు వేసేందుకు ప్రయత్నించటంతో వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు లోకేశ్ పై విరుచుకుపడుతున్నారు.దీంతో ఒక్కసారిగా లోకేశ్ ను గతం తాలూకూ గ్రహణం ఆవరించినట్లైయింది.

ఏపీ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ప్రకటనలో రూ.1000 పెన్షన్ ను రూ.2250కు పెంచినట్లు పేర్కొంది. దీంతో లోకేశ్ కు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది. 2019 జనవరి నుంచి రూ.2000 ఇస్తుంటే దాన్ని మరచి అసత్య ప్రచారం చేస్తారా..? అంటూ అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. అక్కడితో ఆగకుండా వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.200 పెన్షన్ ఇస్తే..దాన్ని మా నాన్న చంద్రబాబునాయుడు రూ.1000 కు పెంచారని గుర్తుచేశారు. ఐతే ఏకంగా సిగ్గుందా అనటం, వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబునాయుడులను పోల్చి విమర్శలు చేయటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు గతాన్ని తవ్వుతున్నారు.

లోకేశ్ తన విమర్శల్లో 2014 వరకు వెళ్లి ఆగితే..వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఏకంగా 2004 వరకు వెళ్లిపోతున్నారు. అప్పట్లో(2004 వరకు) చంద్రబాబు నెలకు రూ.75 పెన్షన్ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.పైగా జన్మభూమి తదితర కార్యక్రమాల్లో పెన్షన్ కోసం వృద్దలు ఎవరైనా మొరపెట్టుకుంటే.. ఊరిలో పెన్షన్ పొందుతున్న వారిలో ఎవరైనా మరణిస్తే చూద్దాంలే అని సమాధానం చెప్పిన అప్పటి బాబు గారి కేబినెట్ లోని మంత్రుల వ్యాఖ్యలను గుర్తుచేస్తున్నారు. దీనికి మీ తండ్రైన చంద్రబాబు నాయుడు ఎంతలా సిగ్గు పడాలి అని ప్రశ్నిస్తున్నారు.

అప్పట్లో రూ.75 పెన్షన్ కూడా క్రమంగా ఇచ్చేవారు కాదు. ఐతే 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ పెన్షన్ లను నాలుగు రెట్లు పెంచటమే కాకుండా నెల నెలా అందేలా చేశారు. పెన్షన్ల విషయంలో వైఎస్సార్ గతం అలా ఉంటే… చంద్రబాబునాయుడి గతం ఏమంత గొప్పగా లేదని చెప్పాలి. కేవలం ఎన్నికల్లో లబ్ది పొందాలనే ఉద్దేశంతో 2019 జనవరిలో పెన్షన్లను పెంచారు. పెన్షన్లు పెంచకుంటే ఎన్నికల్లో ఓడిపోతామని చెప్పి చంద్రబాబును ఒప్పించినట్టు అప్పటి రాష్ట్ర మంత్రి ఆదినారాయణ రెడ్డి భహిరంగానే ప్రకటించారు. దీన్ని భట్టి పెన్షన్ల విషయంలో ఎవరి నైతికత ఏంటో అర్ధమవుతోంది.

షార్ట్ కట్ లో అధికారాన్ని అనుభవించి గత ఐదేళ్ళలో చెప్పుకొదగ్గ పని ఒకటి చెయ్యని లోకేష్ పెన్షన్ ల విషయంలో సెలెక్టివ్ గా మాట్లాడుతూ ఇతరులను సిగ్గుందా అని విమర్శించటం హాస్యాస్పదంగాఉంది. ఏదేమైనా గతంలో అనుసరించిన విధానాలు ప్రస్తుతం చంద్రబాబు, లోకేశ్ ల నైతికతకు అవరోధాలుగా మారాయని చెప్పకతప్పదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి