iDreamPost

నిరసనకు సీఎం సతీమణి పేరు..! ఎమ్మెల్యే నిమ్మల హద్దు దాటారా..?

నిరసనకు సీఎం సతీమణి పేరు..! ఎమ్మెల్యే నిమ్మల హద్దు దాటారా..?

ప్రజా స్వామ్యంలో నిరసన తెలపడం ప్రతి ఒక్కరికీ ఉన్న హక్కు. ప్రతిపక్షాలపై ఆ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ప్రతిపక్షం ప్రధాన విధి. ఈ క్రమంలో ధర్నాలు, నిరసనలు చేపడుతూ ప్రజల తరఫున ప్రతిపక్షాలు పని చేయాలి. అయితే ప్రతిపక్షాలు చేసే నిరసన కార్యక్రమాలు హుందాతనంగా ఉండాలి కానీ పాలకులను కించపరిచేలా ఉండకూడదు అనేది ఎవరిని అడిగినా చెప్పే మాట. ముఖ్యమంత్రి, మంత్రులను కించపరచడం సరికాదంటే.. పాలనతో ఏ సంబంధం లేని వారి ఇంటి మహిళలను కించపరిచేలా నిరసన కార్యక్రమాలు చేపట్టడం దిగజారుడుతనానికి నిదర్శనం.

పాలకొల్లు ఎమ్మెల్యే, టీడీపీ ఉప సభాపక్ష నేత నిమ్మల రామానాయుడు ప్రస్తుతం ఇలా దిగజారి వ్యవరిస్తున్నారే విమర్శలు అన్నివైపుల నుంచి ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో ఇసుక కొరత ఉందంటూ నిమ్మల ఓ నిరసన కార్యక్రమం చేపట్టారు. అయితే ఆయన నిరసన వ్యక్తం చేసిన తీరు చూస్తే బాధ్యతగలిగిన ఓ ఎమ్మెల్యే ఇలా చేస్తారా..? అని సందేహం కలగకమానదు. ఇసుకను ప్యాకింగ్‌ చేసి.. దానిపై ‘భారతి ఇసుక’ జే ట్యాక్స్‌ అధనం.. అంటూ రాసి తోపుడు బండిపై పాలకొల్లు వీధుల్లో తోసుకుంటూ అమ్మారు. కొంత మంది మహిళలు వచ్చి వారి బంగారం ఇచ్చి ఇసుక కొనుగోలు చేశారు.

ఇసుక సమస్య ఉందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు భావిస్తే.. నిరసన తెలియజేయవచ్చు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సతీమణి పేరును ఉపయోగించడం గర్హనీయం. ప్రభుత్వంతో, పాలనతో ఎలాంటి సంబంధం లేని ఆమె పేరును తన ప్రచార ఆర్భాటం కోసం ఉపయోగించడం సరైన విధానం కాదని అందరూ చెబుతున్న మాట.

అసెంబ్లీలో మద్యం బ్రాండ్లపై టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మాట్లాడిన సమయంలో నవ్వారని, ఆ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి కించపరిచారని.. వారిపై దిశ చట్టం ప్రకారం కేసు పెట్టాని ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు.. అసలు ఏ సంబంధం లేని ముఖ్యమంత్రి సతీమణి పేరును ఇలా కించపరిచేలా ఉపయోగించిన ఎమ్మెల్యేపై ఏ చట్టం కింద కేసు పెట్టాలి..? అని వైసీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ నేతలు.. సద్విమర్శలు చేస్తూ.. ప్రజా సమస్యలపై హుందాగా నిరసన తెలియజేసినప్పుడే అందరి మన్ననలు పొందగలరనే విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి