iDreamPost

అశ్రునయనాల మధ్య దివంగత గౌతమ్‌ రెడ్డి అంత్యక్రియలు పూర్తి..

అశ్రునయనాల మధ్య దివంగత గౌతమ్‌ రెడ్డి అంత్యక్రియలు పూర్తి..

ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి సుదీర్ఘ అంతిమ యాత్ర ముగిసింది. నెల్లూరులోని మేకపాటి నివాసం నుంచి ఉదయం 6 గంటలకు అంతిమ యాత్ర మొదలైంది. అంతిమయాత్రలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ ప్రముఖులు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. జొన్నవాడ మీదుగా బుచ్చి, సంగం, నెల్లూరుపాళెం, మర్రిపాడు, బద్వేలు సరిహద్దు జాతీయ రహదారి నుంచి బ్రాహ్మణపల్లి, కృష్ణాపురం, నందిపాడు మీదుగా ఉదయగిరికి చేరుకుంది. దారిపొడవునా ఆయన పార్ధివ దేహానికి నివాళులు అర్పించారు అభిమానులు.

ఆ అనంతరం ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీ (మెరిట్స్‌) ఆవరణలో అసంఖ్యాక అభిమానులు, రాజకీయ సహచరుల అశ్రునయనాల మధ్య ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా దాదాపు కేబినెట్ మంత్రులు అందరూ పాల్గొన్నారు. అలాగే వైసీపీ కీలక నేతలు కూడా ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి భారతి కన్నీరు పెట్టుకుంటున్న గౌతమ్ రెడ్డి తల్లి, భార్యను ఓదారుస్తూ కనిపించారు. గౌతమ్ కుమార్తె అనన్య కూడా అంత్యక్రియల వద్దనే ఉన్నారు. గౌతమ్ కుమారుడు కృష్ణార్జున రెడ్డి గౌతమ్ చితికి నిప్పంటించారు. ఈ అంత్యక్రియలు జరిపిన మెరిట్స్‌ ప్రాంగణం అంతా జోహార్ గౌతమ్‌ రెడ్డి, గౌతమ్‌ రెడ్డి అమర్ రహే నినాదాలు మిన్నంటాయి. అలాగే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నింటా తానై వ్యవహరించారు.

ప్రత్యేక వాహనంలో గౌతమ్‌ రెడ్డి భౌతిక కాయాన్ని ఇంటి నుంచి ఉదయగిరి తరలించేందుకు ప్రత్యేక వాహనాన్ని చెన్నై నుంచి రప్పించారు. ఫేర్ వెల్ ఆన్ వీల్స్ పేరుతో ఈ వాహనాన్ని సంబోధిస్తారు. అంత్యక్రియల కోసమే బెంజ్ కంపెనీ ఈ వాహనాన్ని ప్రత్యేకంగా తయారు చేసింది. ఈ వాహనంలో ఏసీ, సీసీ కెమెరాలతో పాటు హైడ్రాలిక్ సిస్టం కూడా అందుబాటులో ఉంటుంది. భౌతికకాయంతో పాటుగా మరికొందరు లోపల కూర్చునేలా నిర్మాణం ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి