iDreamPost

స్టయిలిష్ లెక్చరర్ గా మెగాస్టార్ రచ్చ – Nostalgia

స్టయిలిష్ లెక్చరర్ గా మెగాస్టార్ రచ్చ – Nostalgia

కమర్షియల్ సినిమాల్లో స్టార్ హీరో పాత్రను డిజైన్ చేయడం కొంచెం కష్టంతో కూడుకున్న వ్యవహారం. పాఠాలు చెప్పే పంతుళ్లు పోరాటలు చేయడాన్ని నమ్మశక్యంగా చూపించాలంటే చాలా నేర్పు ఉండాలి. ఎన్టీఆర్ విశ్వరూపం, వెంకటేష్ సుందరకాండ లాంటి వాటిని మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరి మెగాస్టార్ ని ఆ క్యారెక్టర్ లో అందులోనూ క్లాస్ మాస్ మెచ్చేలా తీర్చిదిద్దడం అంటే మాములు విషయం కాదుగా. మాస్టర్ దాన్ని విజయవంతంగా ప్రూవ్ చేసింది. ఆ విశేషాలు చూద్దాం. 1996కు ముందు చిరంజీవిని వరస ఫెయిల్యూర్స్ పలకరించాయి. బిగ్ బాస్, ఎస్పి పరశురామ్, రిక్షావోడు వైఫల్యాలు ఆలోచించుకునేలా చేశాయి.

అప్పుడు ఎంచుకున్న మలయాళ రీమేక్ హిట్లర్ అద్భుత ఫలితాన్ని ఇచ్చింది. ఓవర్ మాస్ లేకుండా రెగ్యులర్ గా హీరోయిన్ తో అల్లరి చేసే పాత్రలు కాకుండా తనను హుందాగా చూపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనే క్లారిటీ చిరుకు వచ్చేసింది. అప్పుడు ఒప్పుకున్నదే మాస్టర్. భూపతిరాజా ఇచ్చిన కథతో గీత ఆర్ట్స్ సంస్థ దీన్ని నిర్మించింది. బాషాతో దేశవ్యాప్తంగా పేరు మారుమ్రోగిపోయిన సురేష్ కృష్ణ దర్శకత్వంలో సాక్షి శివానంద్, నగ్మా చెల్లెలు రోషిని హీరోయిన్లుగా సత్యానంద్ సంభాషణలతో స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకున్నారు. ఇళయరాజా ప్రభంజనాన్ని తట్టుకుని నిలబడిన దేవాను సంగీత దర్శకుడిగా ఎంచుకోవడం ఓ సెన్సేషన్.

సురేష్ కృష్ణ అప్పటికే వెంకటేష్ తో ప్రేమ, ధర్మచక్రంల రూపంలో మంచి హిట్లు దక్కించుకున్నారు. ఇంద్రుడుడు చంద్రుడు, అమ్మ కూడా సక్సెస్లే. మాస్టర్ లో బాషా ఫార్ములానే వాడినప్పటికీ చిరంజీవిని అప్పటిదాకా ఎవరూ చూపించినంత స్టైలిష్ గా పాత్రని తీర్చిదిద్దారు. ఫస్ట్ హాఫ్ లో గాడితప్పిన కాలేజీ విద్యార్థులను దారిలో పెట్టే లెక్చరర్ గా, సెకండ్ హాఫ్ లో ప్రియురాలిని పోగొట్టుకున్న ఆవేశం నిండిన యువకుడిగా రెండు షేడ్స్ లో అద్భుతంగా మెప్పించారు. మొదటిసారి గొంతు సవరించుకుని పాడిన తమ్ముడు అరె తమ్ముడు పెద్ద సంచలనం. టాలీవుడ్ లో ఫస్ట్ టైం డిటిఎస్ సౌండ్ రికార్డింగ్ లో వచ్చిన స్ట్రెయిట్ తెలుగు సినిమా కూడా ఇదే. 1997 అక్టోబర్ 3న విడుదలైన మాస్టర్ బ్లాక్ బస్టర్ కొట్టేసి చిరు నమ్మకాన్ని నిలబెట్టింది

Also Read: మెగాస్టార్ ఒక ఎమోషన్ – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి