iDreamPost

అల్లాడిపోతున్న అగ్రరాజ్యం .. న్యూయార్క్ లో సామూహిక ఖననాలు

అల్లాడిపోతున్న అగ్రరాజ్యం .. న్యూయార్క్ లో సామూహిక ఖననాలు

కరోనా వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా అల్లాడిపోతోంది. రికార్డు స్ధాయిలో వైరస్ దెబ్బకు 20042 మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా వైరస్ మహమ్మారి దెబ్బకు అత్యధికంగా బలైపోయిన ఇటలీ మృతుల సంఖ్యను అమెరికా దాటేయటం ఆందోళనగా ఉంది. బాధితులు, మృతుల సంఖ్య అమెరికాలో చాలా వేగంగా పెరిగిపోవటమంటే యావత్ ప్రపంచం ఆందోళనకర అంశంగానే పరిగణించాలి. ఏ విషయంలో అయినా మిగితా దేశాలకన్నా తామే గొప్పగా చెప్పుకునే అమెరికాలో ప్రస్తుతం వైరస్ దెబ్బ కూడా చాలా భయంకరంగా ఉందన్నది వాస్తవం.

ప్రపంచం మొత్తం మీద 17.80 లక్షల మంది బాధితులు, 1.08 లక్షల మరణాలు రికార్డయ్యాయి. అయితే ఈ మొత్తం కేసుల్లో అమెరికాలో మాత్రమే 5.23 లక్షల కేసులు రికార్డవ్వగా 20042 మంది మరణించటం నిజంగా బాధాకరమనే చెప్పాలి. అగ్రరాజ్యం తరువాత బాధితులు, మరణాల్లో ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఇరాన్, చైనా తదితర దేశాలున్నాయి. రికార్డుస్ధాయిలో అమెరికాలో 24 గంటల్లో 35 వేల పాజిటివ్ కేసులు నమోదవ్వటంతోనే అగ్రరాజ్యం వణికిపోతోంది. ఈ మొత్తం కేసుల్లో ప్రవాసభారతీయుల వాటా 1500 ఉంది. వీరిలో కూడా 17 మంది మరణించటం గమనార్హం.

మొత్తం అమెరికాలో చూసుకుంటే న్యూయార్క్ లోనే కేసులు లక్షల్లో ఉన్నాయి. చనిపోయిన వారిసంఖ్య కూడా 12 వేలు దాటినట్లు సమాచారం. తర్వాత స్ధానం పొరుగున్న న్యూజెర్సీదే. ఈ నేపధ్యంలోనే కరోనా వైరస్ తో న్యూయార్క్ లో మరణించిన వారి విషయంలో అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. వైరస్ తో మరణించిన వారితో న్యూయార్క్ ఆసుపత్రులు కుప్పలు కుప్పలుగా నిండిపోతోంది. మృతుల తాలూకు కుటుంబసభ్యులు లేకపోతే బంధువులు కూడా మృతదేహాలను తీసుకోవటానికి ముందుకు రాకపోవటంతో వందలాది డెబ్ బాడీస్ ను ప్రభుత్వమే ఖననం చేసేసింది. అమెరికా సమీపంలోనే ఉన్న హార్ట్ ఐల్యాండ్ లో వందలాది మృతదేహాలను ఒకేసారి ఖననం చేసేసింది.

ఇదే విధమైన పరిస్దితి ఇటలీ, స్పెయిన్ లో కూడా ఉంది. ఈ దేశాల్లో కూడా ప్రతిరోజు వందలాది మంది బాధితులు చనిపోతున్నారు. దాంతో ఆ బాడీలను ఏమి చేయాలో ? ఎలా ఖననం చేయాలో కూడా అక్కడి ప్రభుత్వాలకు అర్ధం కావటం లేదు. అందుకనే అక్కడ కూడా సామూహిక ఖననాలు జరిగిపోతున్నాయి. నిజంగా కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఎంతగా దెబ్బ కొట్టిందో ? న్యూయార్క్ ఘటనలతోనే అర్ధమైపోతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి