iDreamPost

పెగాసస్ తో చంద్రబాబు లింకులు, బండారం బయటపెట్టిన మమతా బెనర్జీ

పెగాసస్ తో చంద్రబాబు లింకులు, బండారం బయటపెట్టిన మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సంచలన విషయాన్ని బయటపెట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు గుట్టురట్టు చేశారు. సైబర్ లీకుల సాఫ్ట్ వేర్ పెగాసస్ ని అధికారంలో ఉండగా చంద్రబాబు కొనుగోలు చేసినట్టు ఆమె బహిర్గతం చేశారు. ప్రత్యర్థులు లేదా తమకు కావాల్సిన వారి మీద నిఘా ఉంచేందుకు పెగాసస్ వినియోగం చంద్రబాబుతోనే మొదలయ్యిందని ఆమె వెల్లడించడం పెనుసంచలనంగా మారింది. గతంలో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాలంలో చంద్రబాబుని పెగాసస్ సాఫ్ట్ వేర్ ని రూ.25వేల కోట్లకు కొనుగోలు చేసినట్టు ఆమె స్పష్టం చేశారు. తనకు కూడా అలాంటి కొనుగోలు ఆఫర్ వచ్చినప్పటికీ నిరాకరించినట్టు ఆమె వెల్లడించారు.

అధికారంలో ఉన్న కాలంలో చంద్రబాబు అన్ని రకాలుగానూ అక్రమాలకు పాల్పడినట్టు ఇప్పటికే అందరికీ తెలిసింది. దానికి ప్రతిఫలంగానే ఆయన్ని పాలన నుంచి గద్దెదింపి చివరకు ఇప్పుడు అసెంబ్లీలో అడుగుపెట్టడానికి మొఖం చెల్లని స్థితికి తీసుకొచ్చారు. అయితే విపక్షాలు సహా పలువురి ఫోన్లు ట్యాప్ చేసి, ఇతరుల రహస్యాలను చేధించే అంశంలో నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారం ఇప్పటికే వివాదాస్పదమయ్యింది. అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు మెడకు ఈ వ్యవహారం చుట్టుకుంది. ఆయన ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన నిఘా పరికరాల్లో అవినీతి బట్టబయలయ్యింది.

ఆ తర్వాత పెగాసస్ జాతీయంగా పెనుదుమారం రేపింది. సుప్రీంకోర్టు కూడా సీరియస్ గా స్పందించింది. పౌరుల వ్యక్తిగత భద్రతను కొల్లగొడుతూ సాఫ్ట్ వేర్ సహాయంతో సమగ్ర సమాచారం అపహరిస్తున్న తీరు మీద కోర్టులో విచారణ కూడా జరిగింది. తొలుత కేంద్రం పెగాసస్ తమకు సంబంధంలేదని చెప్పింది. అయితే పెగాసస్ సాఫ్ట్ వేర్ ని తాము అమ్మినట్టు ఇజ్రాయెల్ సంస్థ వెల్లడించడంతో ఖంగుతినాల్సి వచ్చింది. అయితే దేశంలో అలాంటి సాఫ్ట్ వేర్ ని కొనుగోలు చేసిన ఘనత చంద్రబాబుదేననే విషయం ఇప్పుడు వెలుగులోకి రావడం విశేషంగా మారింది.

గత ఎన్నికల సమయంలో ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ జగన్ ప్రతీ రోజూ సాయంత్రం ప్రచారానికి గడువు ఉండగానే హైదరాబాద్ పయనమయ్యేవారు. సాయంత్రం 7గం.లకే తన ప్రచారసభలు ముగిసిపోయేవి. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ కేంద్రంగానే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే పని సాగించేవారు. దానికి కారణం ఏపీలో నిఘా వర్గాలు తమ నెట్ వర్క్ ని ట్యాప్ చేసినట్టు అనుమానించడమేనని అంతా భావించారు. ఇప్పుడు అది అనుమానం కాదు, వాస్తవమని భావించాల్సి ఉంటుంది. చంద్రబాబు కుట్రలను జగన్ చేధించినట్టు స్పష్టమవుతోంది. పెగాసస్ ద్వారా ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నందుకు చంద్రబాబు బాధ్యత వహించాల్సిన పరిస్థితి వస్తుందేమో చూడాలి. రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కిన విషయం గమనించాల్సి ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి