iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 11 – హ్యాకర్ అరాచకం

లాక్ డౌన్ రివ్యూ 11 – హ్యాకర్ అరాచకం

కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ పుణ్యమాని జనం డిజిటల్ యాప్స్ లో కొత్త సినిమాలతో పాటు థియేటర్ కు వచ్చే అవకాశం లేని వెబ్ మూవీస్ ని కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బాష ఏదైనా సబ్ టైటిల్స్ వెసులుబాటు ఉండటంతో మనదా కాదా అనే భేదం లేకుండా అన్నింటిమీదా లుక్ వేస్తున్నారు. ఆ కోవలో ఫిబ్రవరిలో థియేట్రికల్ రిలీజ్ కు నోచుకున్న చిత్రం హ్యక్డ్(HACKED). గత కొన్నేళ్లుగా హారర్ జానర్ లో బాగా పేరు తెచ్చుకున్న విక్రమ్ భట్ దీనికి దర్శకుడు. రెండు గంటల నిడివే ఉండటంతో ఎక్కువ టైం ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా సాగిన ఈ హ్యక్డ్ లో అసలు ఏముందో రివ్యూలో చూసేద్దాం

కథ

సమీరా అలియాస్ సామ్(హీనా ఖాన్) ఒక ప్రముఖ మ్యాగజైన్ కు చీఫ్ ఎడిటర్ గా ఉంటుంది. అప్పటికే పెళ్ళైన ఓ సినిమా డైరెక్టర్ ఓం కపూర్ (సిద్ మక్కర్)ని పిచ్చిగా ప్రేమించి అతనితో డేటింగ్ లో ఉంటుంది. సామ్ కు పక్కనే ఉండే అపార్ట్ మెంట్ లో 19 ఏళ్ళ కుర్రాడు వివేక్ (రోహన్ షా)ఆమె మీద విపరీతమైన పిచ్చిని పెంచుకుంటాడు. సామ్ కు ఓం కపూర్ నుంచి సరైన ప్రేమ దొరకదు. ఓసారి తన బర్త్ డే పార్టీకి అతను రాకపోవడంతో అతిగా మందు కొడుతుంది.

దీంతో ఏం చేస్తోందో తెలియని మైకంలో వివేక్ కు సర్వం అర్పించుకుంటుంది. లేచి చూశాక జరిగిన తప్పు తెలుసుకుని అంతా మర్చిపోమని వివేక్ కు చెబుతుంది. కానీ వివేక్ వినడు. తన అపారమైన హ్యాకింగ్ తెలివితేటలు ఉపయోగించి సామ్ లైఫ్ ని దుర్భరం చేస్తాడు. ఏకంగా ఆమె ఉద్యోగం కూడా పోతుంది. ఇక చనిపోదాం అనుకుంటున్న టైంలో సామ్ క్లాస్ మెట్ రోహన్(మోహిత్ మల్హోత్రా)తనకు అండగా నిలబడతాడు. సామ్ కు ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళ జీవితంతో ఆడుకోవడం మొదలుపెట్టిన వివేక్ దుర్మార్గాలకు వాళ్లిద్దరూ ఎలా చెక్ పెట్టారు అనేదే అసలు స్టోరీ

నటీనటులు

హ్యక్డ్ మూవీ ఎక్కువ రెండు పాత్రల మధ్యే సాగుతుంది. టీవీ షోల ద్వారా పాపులరైన హీనా ఖాన్ ఇందులో సమీరాగా బాగా నటించింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో దారుణమైన మానసిక సంఘర్షణ చెందే పాత్రలో చక్కని పెర్ఫార్మన్స్ ఇచ్చింది. కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నప్పటికీ అవి మరీ ఎబ్బెట్టుగా లేకపోవడంతో తనవరకు మైనస్ అని చెప్పేందుకు పెద్దగా ఏమి లేవు. ఇక హ్యాకర్ గా నటించిన రోహన్ షా మాత్రం చెలరేగిపోయాడు. తనకంటే వయసులో పెద్దదైన అమ్మాయి వెనుక పడి ఆమె కోసం ఎంతకైనా తెగించే వివేక్ గా డిఫరెంట్ షేడ్స్ ని బాగా మోశాడు. హీరో ఫీచర్స్ లేవు కాని ఇలాంటి సైకో లక్షణాలున్న విలన్ పాత్రలకు ముందు ముందు ఇతన్ని మంచి ఆప్షన్ గా ఎంచుకోవచ్చు. హ్యక్డ్ చూశాక గుర్తొచ్చేది వీళ్లిద్దరే కాబట్టి ఇంత ప్రస్తావన చేయాల్సి వచ్చింది. ఇక మిగిలిన సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ సందర్భానికి తగ్గట్టు వచ్చిపోయే వాళ్లే.

డైరెక్టర్ అండ్ టీమ్

భయపెట్టే సినిమాలతో ఆకట్టుకునే స్థాయి నుంచి విసిగించే దాకా వచ్చిన దర్శకుడు విక్రమ్ భట్ హ్యక్డ్ లో ఓ కొత్త సిరీస్ ని ట్రై చేశాడు. ఇలాంటి డార్క్ క్రైమ్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళకు హ్యక్డ్ ఓ మాదిరిగా టైం పాస్ చేయిస్తుంది కానీ సాదారణ ప్రేక్షకులకు మాత్రం ఇదో ప్రహసనంలా అనిపిస్తుంది. టేకాఫ్ కు ఎక్కువ టైం తీసుకోవడంతో పాటు మెయిన్ పాయింట్ చిన్నది కావడంతో సెకండ్ హాఫ్ చాలా సేపు సాగదీసినట్టు అనిపిస్తుంది. టెక్నికల్ గా హ్యక్డ్ లో మంచి స్టాండర్డ్స్ ఉన్నప్పటికీ బడ్జెట్ లో రాజీ పడిన విషయం స్క్రీన్ మీద కనిపిస్తుంది.

యాక్టర్స్ పెర్ఫార్మన్సులు చాలా మటుకు మైనస్ లను కవర్ చేశాయి. అయితే హ్యక్డ్ లో ఉన్న ప్రధాన లోపం స్క్రీన్ ప్లే. రెండు సీన్లలో చెప్పే విషయాన్ని పది సన్నివేశాలకు సాగదీయడం వల్ల థ్రిల్ కాస్తా ముందుకు వెళ్లే కొద్ది కిల్ అయిపోయింది. లేకపోతే రెగ్యులర్ ఆడియన్స్ కూడా దీనికి కనెక్ట్ అయ్యేవాళ్ళు. అది మిస్ అవ్వడం వల్ల హ్యక్డ్ బోరింగ్ క్యాటగిరీ నుంచి తప్పించుకోలేకపోయింది. నలుగురు సమకూర్చిన సంగీతంలోని పాటలు ఇలాంటి కథకు అవసరం లేనివే. చేయి ఆటోమేటిక్ గా ఫార్వార్డ్ వైపు వెళ్ళిపోతుంది. ప్రకాష్ కుట్టి కెమెరా, కుల్దీప్ మెహన్ ఎడిటింగ్ సోసోనే. జీ సంస్థ ప్రొడక్షన్ సబ్జెక్టుకు తగ్గట్టు ఉంది

చివరిగా చెప్పలంటే

టైం ఎలా ఖర్చు పెట్టాలో అర్థం కాక యావరేజ్ క్రైమ్ థ్రిల్లర్స్ ని కూడా చూస్తామనే వాళ్లకు హ్యక్డ్ మరీ వరస్ట్ ఛాయస్ అనిపించుకోదు. అలా కాకుండా ఏదో ఆశించి హాలీవుడ్ రేంజ్ లోనో లేదా నెట్ ఫ్లిక్స్ టైపు క్వాలిటీ కంటెంట్ నో ఇందులో ఎక్స్ పెక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నిరాశ తప్పదు. హ్యాకర్ తెలివితేటలు మంచికి కాకుండా చెడుకి దారి తీస్తే ఎలా ఉంటుందన్న దర్శకుడి ఆలోచన మంచిదే కానీ అతను చూపించిన విధానం మాత్రం ఆ స్థాయిలో లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి