iDreamPost

ఇదో అందమైన,అద్భుతమైన నాటక రంగం

ఇదో అందమైన,అద్భుతమైన నాటక రంగం

ఒకప్పుడు నాట‌కం వీధుల్లో ఉండేది. కానీ అది ఇళ్ల‌లోకి , ఆఫీసుల్లోకి వ‌చ్చి చాలా కాల‌మైంది. నాట‌కం చ‌చ్చిపోయింది అంటూ వుంటారు కానీ, అది నిజం కాదు. నాట‌కాన్ని ఒక జీవ‌న‌శైలిగా మార్చుకున్నాం. న‌టులుగా మారిపోయాం. అయితే ఆ విష‌యాన్ని ఒప్పుకోం. ఎదుటి వాళ్లు బాగా న‌టిస్తున్నార‌ని అనుకుంటూ ఉంటాం. ఎవ‌డి నాట‌కాన్ని వాడు గుర్తు ప‌ట్ట‌లేడు. అదే విషాదం.

రోజూ జ‌రిగే నాట‌కానికి రంగులు అక్క‌ర‌లేదు. మేక‌ప్ చేసుకోవ‌డం కూడా సాధ్యం కాదు. ఎప్పుడు ఏ పాత్ర‌లో న‌టిస్తామో మ‌న‌కే తెలియ‌దు. ఉద‌యాన్నే ధ‌ర్మ‌రాజు మేక‌ప్‌లో బ‌య‌లుదేరితే కాసేప‌టికే దుర్యోధ‌నుడిగా మారిపోవ‌చ్చు. రావ‌ణుడిలా ఒక్కొక్క‌డికి ప‌ది త‌ల‌లుంటే, ఎన్ని ముఖాల‌కి రంగులేసుకుంటాడు?

ప్ర‌పంచ‌మే ఒక నాట‌క‌రంగం అంటారు. అయితే ఈ డ్రామాలో మ‌న‌కు స్క్రిప్ట్ ఉండ‌దు. డైలాగ్ ఎవ‌రూ అందివ్వ‌రు. నో ప్రాంప్టింగ్‌. వేగంగా డైలాగ్‌ని మ‌న‌సులోనే రాసుకుని ప‌ల‌కాలి. ఎంత బాగా న‌టించినా ఎవ‌డూ చ‌ప్ప‌ట్లు కొట్ట‌డు. ఎదుటి వాడు మ‌న‌కంటే బాగా న‌టించే ప్ర‌య‌త్నంలో వుంటూ మ‌న న‌ట‌న‌ని అభినందించే మూడ్‌లో వుండ‌డు.

అక్క‌డ స్టేజికి ఒకే తెర వుంటుంది. ఇక్క‌డ మ‌నిషి మ‌నిషికి మ‌ధ్య తెర‌లుంటాయి. ఎప్పుడు తెర లేస్తుందో, ప‌డుతుందో తెలియ‌దు. తెర‌లాగే వాడుకూడా ఒక్కోసారి ప్ర‌ధాన పాత్ర‌దారిగా మారి క‌థ న‌డిపిస్తాడు. అంద‌రూ ఎవ‌రికి వారు హీరోలు అనుకుంటూ ఎదుటి వాన్ని విదూష‌కుడిగా గుర్తిస్తారు.

ఒక ద‌ర్శ‌కుడు క్రీస్తు పాత్ర‌దారి కోసం వెతికాడు. ఎక్క‌డా అంత‌టి శాంత‌స్వ‌రూపం క‌న‌ప‌డ‌లేదు. చివ‌రికి ఒక గొర్రెల కాప‌రి దొరికాడు. అత‌ని మొహంలో క‌రుణ, తేజ‌స్సు. నాట‌కం వేయించాడు.

కొన్నేళ్ల త‌ర్వాత అదే ద‌ర్శ‌కుడు జుడాస్ పాత్ర (క్రీస్తుని మోసం చేసిన క‌ప‌టి) కోసం వెతికాడు. అంత‌టి కుటిల‌త్వం ఎవ‌రి క‌ళ్ల‌లో క‌న‌ప‌డ‌లేదు. చివ‌రికి ఒక‌డు దొరికాడు. అత‌న్ని సెలెక్ట్ చేశాడు.అత‌ను ఎవ‌రో కాదు. ఒక‌ప్పుడు క్రీస్తు పాత్రదారే.

కాలం మ‌నలోని క‌రుణ‌ని క‌రిగించి, కాఠిన్యాన్ని పెంచుతుంది. శాంతాన్ని తుడిచేసి సైతాన్‌ని త‌యారు చేస్తుంది.

క‌రోనాతో ఉప‌యోగం ఏమంటే ప్ర‌పంచ‌మంతా నాట‌కాలు ఆగిపోయాయి. న్యూయార్క్‌లోని బ్రాడ్‌వే కూడా మూసేశారు. ప్ర‌తి ఇల్లూ బిగ్‌బాస్ హౌస్‌గా మారింది. కెమెరాలుండ‌వంతే!

నాట‌కం బ‌త‌కాలంటే ప్రేక్ష‌కులుండాలి. మ‌నుషులు ఒకర్ని చూసి ఇంకొక‌రు భ‌య‌ప‌డి పారిపోతున్నారు. న‌లుగురు ఒక చోట గుమికూడితే నాట‌కం సంగ‌తి దేవుడెరుగు, పోలీసులు నేల‌మీద గుంజీలు తీయిస్తున్నారు.

రోజులెప్పుడూ ఒక్క‌లా ఉండవు. క‌రోనాకి కూడా తెర‌ప‌డుతుంది. మ‌ళ్లీ మ‌న నాట‌కాలు మ‌న‌కి వ‌చ్చేస్తాయి. బాస్‌ల ముందు నాట‌కం, భార్య‌ల ముందు విన‌య విధేయ నాట‌కం. ప్ర‌జ‌ల ముందు నాయ‌కులు, నాయ‌కుల ముందు ప్ర‌జ‌లు. మ‌ళ్లీ పాత‌రోజులు వ‌స్తాయి. న‌టులు, జైలు నుంచి విడుద‌లై ఆక‌లిగొన్న సింహాల్లా యాక్ట్ చేస్తారు. క‌రోనాతో పోతామో లేదో తెలీదు కానీ, న‌టించ‌క‌పోతే చ‌చ్చిపోతాం. అల‌వాటు ప‌డిన ప్రాణాలు!

(ఈ రోజు ప్ర‌పంచ రంగ‌స్థ‌ల దినోత్స‌వం)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి