iDreamPost

సిరిసిల్లలో చిరుత కలకలం.. పొలాల్లో చిరుత పిల్లలు

సిరిసిల్లలో చిరుత కలకలం.. పొలాల్లో చిరుత పిల్లలు

ఇటీవలి కాలంలో వన్యప్రాణులు జనావాసాల్లోకి తరచూ రావడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. అంతరిస్తున్న అడవులు, ఆహార వేట కోసం జనావాసాల్లోకి వస్తున్నాయి వన్య మృగాలు. వన్య ప్రాణులు గ్రామాల్లో సంచరించడంతో జనాలు భయంతో వణికిపోతున్నారు. ఏవైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కాగా ఈ మధ్య తిరుమలలో చిరుతల సంచారం భక్తులను తీవ్ర భయాందోళనకు గురి చేసిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. అంతే కాకుండా పంటపొలాల్లో రెండు పిల్లలకు జన్మనిచ్చింది. పొలం పనుల నిమిత్తం అటుగా వెళ్తున్న రైతుల కంట పడడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలం శివంగలపల్లి శివారులో చిరుత సంచరిస్తుందని తెలియడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. శివలింగంపల్లి శివారులో డంపింగ్ యార్డ్ సమీపంలో చిరుత పులి రెండు పిల్లలకు జన్మనిచ్చింది. కాగా ఈ రోజు ఉదయం చిరుత తన పిల్లను తీసుకుని వెళ్తుండగా ఓ రైతు గమనించాడు. వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించాడు.సమాచారం అందుకున్న గ్రామస్థులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అక్కడ ఉన్న చిరుత పిల్లలను చేతుల్లోకి తీసుకుని ఫొటోలు దిగారు. ఆకలితో అరుస్తున్న పిల్లలకు పాలు తాగించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని చిరుత పిల్లలను కరీంనగర్ కు తరలించారు. చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి