iDreamPost

ఇది కదా విజయమంటే.. ఏడు సార్లు గెలిచిన MLAను ఓడించిన దినసరి కూలీ

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అద్భుతమైన విజయం చోటుచేసుకుంది. పని చేస్తే కాని పూటగడవని ఓ దినసరి కూలీ ఏడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేను ఓడించి కొత్త చరిత్ర సృష్టించారు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అద్భుతమైన విజయం చోటుచేసుకుంది. పని చేస్తే కాని పూటగడవని ఓ దినసరి కూలీ ఏడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేను ఓడించి కొత్త చరిత్ర సృష్టించారు.

ఇది కదా విజయమంటే.. ఏడు సార్లు గెలిచిన MLAను ఓడించిన దినసరి కూలీ

సంకల్పబలం ఉంటే ఏదైనా సాధ్యమే అని మరోసారి నిరూపితమైంది. అతడు దినసరి కూలీ అయితేనేం రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. అంతేకాదు చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందుకున్నారు. ఏండ్లకేండ్లు రాజకీయ చరిత్ర ఉన్న నాయకులు ఎన్నికల్లో గెలిచేందుకు ఆపసోపాలు పడుతున్న తరుణంలో అలవోకగా గెలుపొంది చరిత్ర సృష్టించారు. ఇప్పుడు రాష్ట్రమంతా ఆయన పేరు మారుమ్రోగుతోంది. ఆయన మరెవరో కాదు ఛత్తీస్ గఢ్ కు చెందిన ఈశ్వర్ సాహు. ఛత్తీస్ గఢ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించారు. ఓ సామాన్యుడు ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఇది తెలిసిన వారు ఇది కదా విజయమంటే అని కొనియాడుతున్నారు.

ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్‌ గఢ్‌లో భారతీయ జనతా పార్టీ మొత్తం 54 స్థానాల్లో విజయం సాధించింది. కాగా, అధికార కాంగ్రెస్‌ కేవలం 35 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో ఉప ముఖ్యమంత్రి టీఎస్‌ సింగ్‌దేవ్‌తో సహా తొమ్మిది మంది మంత్రులు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఒక సీటుపై జోరుగా చర్చ సాగుతోంది. అది బెమెత్రా జిల్లాలోని సాజా అసెంబ్లీ స్థానం. ఛత్తీస్ గడ్ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య ఫలితం అందరి దృష్టిని ఆకర్షించింది. రోజువారి కూలీ అయిన ఈశ్వర్ సాహూ ఏడు సార్లు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఓడించి గెలుపొందారు. ఈశ్వర్ బీజేపీ తరఫున పోటీచేసి ఈ విజయాన్ని అందుకున్నారు. బఘేల్ ప్రభుత్వంలో సాహు కుమారుడు హత్యకు గురయ్యారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈశ్వర్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

కొడుకు మరణంతో..

ఇది గమనించిన బీజేపీ వ్యూహాత్మకంగా ఈశ్వర్ కు టికెట్ ఇచ్చింది. సాజా అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దించింది. ఈ పోటీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రవీంద్ర చౌబేపై ఆయన 5527 ఓట్ల మెజారిటీతో గెలుపొంది చరిత్ర సృష్టించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్ర చౌబే సాజా అసెంబ్లీ స్థానంలో ఓటమి చవిచూశారు. వృత్తిరీత్యా కార్మికుడైన ఈశ్వర్ సాహు కుమారుడు ఈ ఏడాది రాష్ట్రంలో జరిగిన అల్లర్లలో మరణించారు. ఏప్రిల్ 2023లో సాజా అసెంబ్లీ నియోజకవర్గంలోని బీరాన్‌పూర్ గ్రామంలో మతపరమైన అల్లర్లు జరిగాయి. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు చనిపోయారు. ఇందులో ఈశ్వర్ సాహు కుమారుడు భువనేశ్వర్ సాహు కూడా ఉన్నాడు. కాగా చత్తీస్‌ గఢ్ ప్రభుత్వం బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం మరియు ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించినట్లు తెలిసింది. కానీ ఈశ్వర్‌ సాహు దానిని తీసుకోవడానికి నిరాకరించినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ఘటన తర్వాత బీజేపీ ఈశ్వర్‌ సాహుకు టికెట్‌ ఇచ్చింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఈశ్వర్ సాహు విజయం సాధించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి