iDreamPost

ఆ లెక్క‌లు త‌ప్ప‌యితే.. నేను రాజీనామా చేస్తా : కేటీఆర్‌

ఆ లెక్క‌లు త‌ప్ప‌యితే.. నేను రాజీనామా చేస్తా : కేటీఆర్‌

బీజేపీ, టీఆర్ఎస్ నేత‌ల స‌వాళ్లు, ప్ర‌తి స‌వాళ్ల‌తో తెలంగాణ రాజ‌కీయాల్లో వేడి త‌గ్గ‌డంలేదు.నిత్యం ఎన్నిక‌ల సంగ్రామంలా ఉంటోంది. ఇరు పార్టీల నాయ‌కుల మ‌ధ్యా ఏదో ఒక అంశంపై మాట‌ల యుద్ధం కొన‌సాగుతూనే ఉంది. మొన్న‌టి వ‌ర‌కూ వ‌రి ధాన్యం కొనుగోలుకు సంబంధించి తీవ్ర‌స్థాయిలో తూటాలు పేల్చుకున్నారు. ఇప్పుడు తాజాగా రాష్ట్రానికి కేంద్రం విడుద‌ల చేసిన నిధుల‌పై చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో బీజేపీకి తెలంగాణ మంత్రి, కేసీఆర్ కుమారుడు కేటీఆర్ స‌వాల్ విసిరారు. తాను చెప్పేది తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

హనుమకొండ, నర్సంపేటలో బుధ‌వారం కేటీఆర్‌ పర్యటించారు. అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. బుధవారం సాయంత్రం బాలసముద్రంలోని హయగ్రీవచారి గ్రౌండ్‌లో బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేంద్రంపై చేసిన విమ‌ర్శ‌లు త‌ప్ప‌యితే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసి, తాను సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగుతానని తెలిపారు. కేంద్రానికి రూ.3,65,797 కోట్లు ఇచ్చామని, తెలంగాణకు కేంద్రం లక్షా అరవైఎనిమిది వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని పేర్కొన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు రుజువు చేయాలని సవాల్ విసిరారు. ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారు? అని ప్రశ్నించారు.

తెలంగాణ రాకపోతే టీపీసీసీ, టీబీజేపీ ఎక్కడిది? అని ప్రశ్నించారు. ఎవడీ రేవంత్ రెడ్డి, బండి సంజయ్ అని ప్రశ్నించారు. కేసీఆర్‌పై చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాము బూతులు తిట్టగలం.. కానీ తమకు సంస్కారం ఉందన్నారు. భారతీయ జనతా పార్టీ బఫూన్‌ పార్టీ అని ఎద్దేవాచేశారు. మోడీ గుజరాత్‌కే ప్రధానమంత్రా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. తెలంగాణను మళ్లీ ఏపీలో కలుపుతారని, బీజేపీ దీనికి కూడా వెనకాడదని చెప్పారు. నలుగురు బీజేపీ ఎంపీలు రాష్ట్ర సమస్యలపై ఎప్పుడైనా మోడీని కలిశారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి