iDreamPost

విజయవాడ టీడీపీలో కేశినేని వర్సస్ దేవినేని

విజయవాడ టీడీపీలో కేశినేని వర్సస్ దేవినేని

ఇంతకాలం విజయవాడ నగరానికే పరిమితమైన తెలుగుదేశం విభేదాలు తాజాగా రూరల్ ప్రాంతానికీ విస్తరించాయి. ఎంపీగా ఉన్న తనకు.. తన పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పెత్తనం కావాలన్న ధోరణితో కేశినేని నాని వ్యవహరిస్తుండగా ఆయా నియోజకవర్గాల నేతలు దాన్ని అంగీకరించడంలేదు. దాంతో విభేదాలు రాజుకుంటున్నాయి. నందిగామ విషయంలో ఎంపీ కేశినేని, మాజీమంత్రి దేవినేని ఉమా వర్గాలు గత వారం రోజులుగా నేరుగా అధినేత వద్దే పంచాయితీ పెడుతున్నారు. నందిగామతో పాటు తిరువూరు, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాల ఇంఛార్జీలను మార్చాలని కేశినేని పట్టు పడుతుంటే స్థానిక నేతలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు.

అధినేత తీరుతో గందరగోళం

నందిగామ ఇంఛార్జిగా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వ్యవహరిస్తున్నారు. అయితే అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఆయన సోదరుడు అరుణ్ కుమార్ ప్రజలకు అందుబాటులో ఉంటూ దూసుకు పోతున్నారని, వారిని సౌమ్య ధీటుగా ఎదుర్కోలేక పోతున్నారని ఎంపీ కేశినేని చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. పార్టీ రూరల్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్, బొమ్మసాని సుబ్బారావు తదితర నేతలను తీసుకెళ్లి చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టారు. సౌమ్యను మార్చి కొత్త ఇంఛార్జీని నియమించాలని, అంతవరకు విజయవాడకు చెందిన గన్నే వెంకట నారాయణ ప్రసాద్ (అన్న)ను పర్యవేక్షకుడిగా నియమించాలని ప్రతిపాదించారు. దానికి చంద్రబాబు ఓకే చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సౌమ్యతోపాటు నియోజకవర్గ సీనియర్ నేతలను తీసుకుని చంద్రబాబు వద్దకు వెళ్లారు. ఇంఛార్జిగా సౌమ్యనే కొనసాగించాలని పట్టుబట్టడంతో దానికి కూడా ఆయన ఓకే చెప్పారు. దాంతో కేశినేని నాని అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము చెప్పిన మార్పులకు అంగీకరించిన చంద్రబాబు.. ప్రత్యర్థి వర్గం డిమాండుకు ఎలా అంగీకరించారని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాలతో పార్టీ వర్గాల్లో గందరగోళం, అనిశ్చితి నెలకొంటున్నాయి.

ఇతర నియోజకవర్గాల్లోనూ కేశినేని జోక్యం

నందిగామ విభేదాలు ఇతర నియోజకవర్గాలకు పాకుతున్నాయి. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు నియోజకవర్గాలపై పెత్తనం తనకే ఉండాలన్న ధోరణితో ఎంపీ కేశినేని పావులు కదుపుతున్నారు. నందిగామ మాదిరిగానే తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట నియోజకవర్గాల ఇంఛార్జీలను కూడా మార్చాలని ఆయన కోరుతున్నారు. తిరువూరు ఇంఛార్జిగా ఉన్న నల్లగట్ల స్వామిదాస్ స్థానంలో కొన్నినెలల క్రితమే చావల దేవదత్తును
నియమించారు. ఆయన్ను కూడా మార్చి వాసం మునెయ్యను నియమించాలని కేశినేని పట్టుపడుతున్నట్లు సమాచారం. ఆయన తీరుపై ఆయా నియోజకవర్గాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో ఎంపీ జోక్యాన్ని, పెత్తనం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. అధినేత అడ్డుచెప్పకపోవడం వల్లే ఆయన రెచ్చిపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి