iDreamPost

అలకబూనిన తమ్ముడికి 434 మీటర్ల భారీ లేఖ రాసిన అక్క..గిన్నిస్ రికార్డుకెక్కుతుందా ?

అలకబూనిన తమ్ముడికి 434 మీటర్ల భారీ లేఖ రాసిన అక్క..గిన్నిస్ రికార్డుకెక్కుతుందా ?

మనపై ఎవరైనా అలిగితే.. సారీ అని ఒక మెసేజ్ చేస్తాం. లేఖ రూపంలో క్షమాపణలు చెప్పాలనుకుంటే ఒక పేజీ రాస్తాం. కొంతమంది పేజీలో సగం కూడా రాయరు. కానీ ఓ అమ్మాయి తనపై అలిగిన తమ్ముడికి క్షమాపణలు చెప్తూ.. ఏకంగా 434 మీటర్ల భారీ లేఖ రాసింది. ఆ లేఖ బరువు అక్షరాలా 5 కిలోలు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. పీర్మడేలోని ఇడుక్కి ప్రాంతంలో నివసించే కృష్ణప్రసాద్ (21)కు కృష్ణ ప్రియ (28) అనే అక్క ఉంది. తిరువనంతపురంలో ఉద్యోగం చేస్తూ.. అక్కడే ఉంటోంది కృష్ణప్రియ. మే 24న ప్రపంచ సోదరుల దినోత్సవం సందర్భంగా తన అక్క తనకు శుభాకాంక్షలు చెప్తుందని కృష్ణప్రసాద్ ఎన్నో ఆశలతో ఎదురుచూశాడు.

కానీ.. కృష్ణప్రియ నుంచి విషెస్ రాకపోవడంతో తానే మెసేజ్ చేశాడు. ఫోన్ కాల్ చేశాడు. అయినా స్పందించలేదు. ఇతరులు తనకు ప్రపంచ సోదరుల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పగా.. వాటన్నింటినీ స్క్రీన్ షాట్స్ తీసి పంపాడు. ఎంతకూ కృష్ణప్రియ నుంచి రిప్లై రాకపోవడంతో కృష్ణప్రసాదం కోపంతో వాట్సాప్ లో ఆమె నంబరును బ్లాక్ చేశాడు. మర్నాడు ఉదయం మొబైల్ ను చూసుకున్న ప్రియ.. తన తమ్ముడు అలిగాడని గుర్తించింది. లేఖ రూపంలో అతనికి క్షమాపణలు చెప్పాలనుకుంది. స్టేషనరీకి వెళ్లి 15 రోళ్ల పేపర్ కొని.. 12 గంటలపాటు కష్టపడి తమ్ముడిని క్షమాపణలు కోరుతూ.. చిన్ననాటి జ్ఞాపకాలన్నింటినీ అక్షర రూపంలో రాసి పంపింది.

అది చూసిన కృష్ణప్రసాద్ అక్కకు తనపై ఉన్న ప్రేమకు ఫిదా అయిపోయాడు. ఈ సందర్భంగా కృష్ణప్రియ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఏటా నా తమ్ముడికి శుభాకాంక్షలు చెప్తాను. కానీ ఈసారి నేను తీరిక లేకుండా ఉండటంతో అతనికి శుభాకాంక్షలు చెప్పడం మరిచిపోయాను. మర్నాడు ఫోన్ చూశాక కృష్ణప్రసాద్ బాధపడినట్లు తెలుసుకుని క్షమాపణలు కోరుతూ ఈ లేఖ రాశాను. సోదరుడికి అతిపెద్ద లేఖ రాసినందుకు గుర్తించాలంటూ.. కృష్ణప్రియ గిన్నిస్ రికార్డుకు దరఖాస్తు చేసుకుంది.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి