iDreamPost

వైసిపి బాటలో కేఈ ప్రభాకర్‌

వైసిపి బాటలో కేఈ ప్రభాకర్‌

తెలుగుదేశం పార్టీకి షాక్‌ మీద షాక్‌ తగులుతోంది. ఆ పార్టీ నుంచి మాజీ, తాజా ప్రజా ప్రతినిధులు అధికార వైసిపిలోకి క్యూ కడుతున్నారు. రాయలసీమతోపాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలోని బలమైన నేతలు టీడీపీని వీడుతున్నారు. ముఖ్యంగా సీమలో వైఎస్సార్‌ కడప జిల్లాతో మొదలైన ఈ వలసలు ఇతర జిల్లాలకు పాకుతోంది. తాజాగా ఈ రోజు తెలుగుదేశం సీనియర్‌ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సోదరుడు, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ టీడీపీకి రాజీనామా చేశారు.

1994 శాసన సభ ఎన్నికల్లో డోన్‌ నియోజకవర్గం నుంచి గెలిచిన కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి 1996 లోక్‌సభకు పోటీ చేసి గెలవడంతో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున కేఈ ప్రభాకర్‌ పోటీ చేసి గెలవడంతో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1999 ఎన్నికల్లో కూడా గెలిచిన కేఈ ప్రభాకర్‌ 2004లో మాత్రం కోట్ల సుజాతమ్మ చేతిలో ఓడిపోయారు. 2009లో డోన్‌ నుంచి కేఈ కృష్ణమూర్తి పోటీ చేయడంతో ప్రభాకర్‌కు పత్తికొండ నుంచి పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికల్లో మాత్రం డోన్‌ నుంచి కేఈ ప్రతాప్, పత్తికొండ నుంచి కేఈ కృష్ణ మూర్తి పోటీ చేయడంతో ప్రభాకర్‌కు పోటీ చేసే అవకాశం రాలేదు. తనను కాదని ప్రతాప్‌కు టిక్కెట్‌ ఇప్పియ్యడంతో అన్నదమ్ములైన కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రభాకర్‌ల మధ్య మనస్పర్థలు వచ్చాయి.

2014 శాసన సభలోనే అందరి కన్నా వయస్సులో పెద్దవాడైన కేఈ కృష్ణమూర్తి తాను 2016లోనే రాజకీయంగా రిటైర్‌ అవుతున్నానని, తన వారసుడిగా కొడుకు శ్యాంబాబు వస్తున్నాడని చెప్పారు. కేఈ శ్యాంబాబు కూడా పత్తికొండ నియోజకవర్గంలో తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని హవా నడిపారు. వైసీపీ పత్తికొండ ఇన్‌చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో శ్యాం ముద్ధాయిగా ఉన్నారు.

మళ్లీ ఫ్యాక్షన్‌ తలెత్తుతున్న పరిస్థితుల్లో కృష్ణమూర్తి 2019 ఎన్నికల్లో పత్తికొండ ఎమ్మెల్యే టిక్కెట్‌ తనకు ఇప్పిస్తాడని ప్రభాకర్‌ భావించాడు గానీ అలాంటి సూచనలు కనపడలేదు. భూమా నాగిరెడ్డి మరణంతో 2017 ఆగస్టులో జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ తరఫున శిల్పా మోహన్‌రెడ్డి పోటీ చేయగా.. ఎమ్మెల్సీగా ఉన్న ఆయన సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి జగన్‌ నిబంధనల ప్రకారం తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరి శిల్పా మోహన్‌ రెడ్డి తరఫున ఎన్నికల బాధ్యతలు చేపట్టారు.

శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవి కోసం పట్టుబట్టి ప్రభాకర్‌ ఆ పదవి తనకు ఇవ్వకుంటే పార్టీని వీడుతానని ప్రటించారు. ప్రభాకర్‌ ఒత్తిడి మేరకు ఆ పదవి ఆయనకే ఇచ్చారు. ఆ సందర్భంలో 2019 ఎన్నికల్లో నిన్ను పత్తికొండకు పంపిద్దామనుకుంటే.. ఎమ్మెల్సీ పదవి కోసం తొందర పడ్డావని ప్రభాకర్‌ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. దానికి ప్రభాకర్‌ స్పందిస్తూ.. మా అన్న ఆయన కొడుకు శ్యాంను కాదని నాకు టిక్కెట్‌ ఇవ్వనిస్తాడా..?. మీరు మాత్రం మా అన్న మాట కాదని నాకు టిక్కెట్‌ ఇస్తారా..? అని .. వ్యాఖ్యానించినట్లు వార్తలొచ్చాయి.

ప్రభాకర్‌ ఊహించినట్లుగానే 2019 పత్తికొండ టిక్కెట్‌ చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబుకే వచ్చింది.

2014 నుంచి తన అన్న కేఈ కృష్ణమూర్తితో కేఈ ప్రభాకర్‌కు అంతంత మాత్రంగానే సంబంధాలున్నాయి. రెండు నెలల కిందట కేఈ ప్రభాకర్‌ ఇడుపులపాయకు వెళ్లి వైఎస్సార్‌ సమాధికి శ్రద్ధాంజలి ఘటించినప్పటి నుంచి ఆయన పార్టీ మారడంపై ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ ప్రచారానికి ముగింపు పలుకుతూ ఈ రోజు ఆయన తన అనుచరులతో కర్నూలు టౌన్‌లో కేఈ ప్రభాకర్‌ సమావేశయ్యారు. అనుచరులతో చర్చించిన అనంతరం టీడీపీకి రాజీనామా చేశారు. రెండు మూడు రోజుల్లో సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు.

కేఈ ప్రభాకర్‌తోపాటుగా తన అక్క కొడుకు కర్నూలు మాజీ కార్పొరేటర్‌ కుమార్‌ కూడా వైసీపీలో చేరనున్నారు. నాలుగు రోజుల కిందట టీజీ భరత్‌ నుంచి టీడీపీ భి.ఫాం తెచ్చుకున్న కుమార్‌ వైసీపీలో చేరుతుండడం గమనార్హం.

రెండు కత్తులను ఒకే ఒరలో ఇమిడ్చానని చంద్రబాబు పడ్డ సంతోషం ఎన్నికల్లో ఒటమి తర్వాత ఎక్కువ రోజులు నిలబడలేదు. జమ్మలమడుగులో నిన్న రామసుబ్బారెడ్డి, నేడు కర్నూలు జిల్లా నుంచి కేఈ ప్రభాకర్‌ టీడీపీని వీడడం ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు. అధికారం ఉన్నంత కాలం ఇమిడినట్లుగా కనిపిస్తాయంతే. ఎన్నికలకు ముందు చంద్రబాబు కోట్ల కుటుంబాన్ని టీడీపీలోకి తీసుకురావడంపై రేపు వైసీపీలో చేరే సందర్భంగా కేఈ ప్రభాకర్‌ ఏమని స్పందిస్తాడోనన్న ఆసక్తి కర్నూలు జిల్లా ప్రజల్లో నెలకొంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి