iDreamPost

Kathanayakudu : NTR సూపర్ హిట్ పేరుతో బాలయ్య – Nostalgia

Kathanayakudu : NTR సూపర్ హిట్ పేరుతో బాలయ్య – Nostalgia

తండ్రి నటించిన బ్లాక్ బస్టర్స్ టైటిల్స్ తో సినిమాలు చేస్తున్నప్పుడు సదరు వారసులు ఆ అంచనాలు మోసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఫలితం అటుఇటు అయిపోయి అసలుకే మోసం వస్తుంది. నటశిఖరం నందమూరి తారకరామారావు గారి చిత్రాలతో ఇలాంటి ప్రయోగం చేస్తున్నప్పుడు ఏం చేయాలో వేరే చెప్పాలా. నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలు చెప్పుకోదగ్గ స్థాయిలోనే చేశారు. అందులో ఒకటి కథానాయకుడు. 1969లో ఈ పేరుతో ఎన్టీఆర్ నటించిన సినిమా సూపర్ హిట్టు. దాన్నే మళ్ళీ వాడుకుంటూ డాక్టర్ డి రామానాయుడు గారు బాలయ్య హీరోగా రూపొందించిన కమర్షియల్ ఎంటర్ టైనర్ 1984లో వచ్చిన కథానాయకుడు.

డెబ్యూ చేసిన మొదటి సినిమాకే చిరంజీవి(సంఘర్షణ)తో హిట్టు కొట్టిన దర్శకుడు కె మురళీమోహన్ రావుకి రామానాయుడు గారు దీని రూపంలో రెండో అవకాశం తన బ్యానర్ లోనే కల్పించారు. పరుచూరి బ్రదర్స్ రాసిన స్క్రిప్ట్ మొదట్లో ఎన్టీఆర్ గారికి అంతగా నచ్చలేదట. అయినా నిర్మాత మీద నమ్మకంతో ఎస్ చెప్పేశారు. అలా దీని షూటింగ్ మొదలయ్యింది. విజయశాంతి హీరోయిన్ గా శారద, గొల్లపూడి, చంద్రమోహన్, అల్లు రామలింగయ్య, దేవదాస్ కనకాల, పిఎల్ నారాయణ తదితరులను ఇతర తారాగణంగా తీసుకున్నారు. ఎస్ గోపాల్ రెడ్డి ఛాయాగ్రహణం సమకూర్చగా చక్రవర్తి సంగీతం అందించారు. ఎలాంటి విఘ్నాలు లేకుండా షూట్ జరిగింది.

వెరైటీగా అనిపించే కింగ్ కాంగ్ అనే విలన్ క్యారెక్టర్ ని పరుచూరి గోపాలకృష్ణ పోషించారు. అందరికీ ఈ పాత్ర మైనస్ అవుతుందేమోనని డౌట్. కానీ రామానాయుడు గారికి గురి కుదిరింది. దర్శకుడికి ఇష్టం లేకపోయినా ఇందులో పెట్టారని అప్పట్లో కామెంట్లు వచ్చాయి. న్యాయానికి కట్టుబడే జడ్జ్ కుటుంబాన్ని బ్యాక్ డ్రాప్ గా తీసుకుని రూపొందిన ఈ సోషల్ కం ఫ్యామిలీ డ్రామా 1984 డిసెంబర్ 14న విడుదలయ్యింది. అదే రోజు కృష్ణంరాజు రౌడీ కూడా రిలీజ్. బాలయ్య సినిమాని క్లాసు మాస్ ఆదరించడంతో వంద రోజులు ఆడింది. హైదరాబాద్ లో రజతోత్సవం కూడా చేశారు. ఇదే టైటిల్ తో 2019లో మళ్ళీ బాలకృష్ణే నాన్న బయోపిక్ తీశారు కానీ ఫలితం మాత్రం డిజాస్టర్ కావడం ఎవరూ ఊహించనిది.

Also Read Yamagola : యమలోకం సినిమాల్లో ట్రెండ్ సెట్టర్ – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి