iDreamPost

ఆరేళ్ల ప్రయాణం.. జనసేనాని సింహావలోకనం

ఆరేళ్ల ప్రయాణం.. జనసేనాని సింహావలోకనం

సరిగ్గా నేటికి జనసేన పార్టీ స్థాపించి ఆరేళ్లవుతోంది. 2014 సాధారణ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు మార్చి 14వ తేదీన జనసేన ఆవిర్భవించింది. పార్టీ నిర్మాణం జరగలేదంటూ చెప్పిన జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల్లో పోటీ చేయలేమంటూ.. టీడీపీ, బీజేపీ కూటమికి మద్ధతిచ్చారు. ఆ తర్వాత దాదాపు నాలుగేళ్ల వరకూ పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టని జనసేనాని.. 2019 ఎన్నికలకు ముందు టీడీపీతో తెగతెంపులు చేసుకుంటున్నట్లు తనదైన శైలిలో ఊగిపోతూ ప్రకటించారు. గడిచిన సాధారణ ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలసి ఎన్నికలకు వెళ్లారు. తాను రెండు చోట్లా పోటీ చేసినా.. శాసన సభలో అడుగుపెట్టే భాగ్యం దక్కలేదు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద్‌ గెలుపు ఇప్పటికీ పవన్‌ కల్యాణ్‌ను వెక్కిరిస్తోంది.

సీఎం జగన్‌కు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు మధ్య వయస్సులో ఒకట్రెండేళ్లు వ్యత్యాసం ఉంది. వారి రాజకీయారంగేట్రం మాత్రం ఒకే సారి జరిగింది. 2009 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలవగా.. పవన్‌ కళ్యాణ్‌ తన అన్న మెగాస్టార్‌ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. యువజన విభాగమైన యువ రాజ్యం అధ్యక్షుడిగా ఆ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అభ్యర్థులకు మద్ధతుగా ప్రచారం చేశారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం అవడంతో పవన్‌ కళ్యాణ్‌ సైలెంటయ్యారు. 2014 ఎన్నికలకు ముందు సరికొత్తగా జనసేన పేరుతో ముందుకొచ్చారు.

2009 నుంచి 2019 వరకు పదేళ్లలో వైఎస్‌ జగన్‌ సీఎం కాగా… జనసేనాని ఎమ్మెల్యే కూడా కాకపోవడం ఆయన అభిమానులను బాధిస్తోంది. ప్రతి సభలోనూ సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేసే పవన్‌ అభిమానులు.. తమ ఆరాధ్యదైవం కనీసం ఎమ్మెల్యే కూడా కాలేదన్న ఆవేదన వారిలో నెలకొంది.

ఈ రోజు జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించారు. జనసేన అధినేత అభిమానులనుద్దేశించి ప్రశంగించారు. జనసేన ప్రయాణంపై సింహావలోకనం చేసుకున్నారు. జనసేన ఓటమికి ఓటర్లే కారణమనేలా మాట్లాడారు. నేతలు వెళ్లిపోవడానికి వారి పిరికితనమే కారణమంటూ నెపం వారిపైనే నెట్టారు. కానీ తాను ఎలా రాజకీయం చేసింది.. పార్టీ బలోపేతానికి, పార్టీని ప్రజలు ఆదిరించేందుకు, గెలుస్తామనే ధీమా నేతల్లో నింపేందుకు తానేమి చేశారో మాత్రం మచ్చుకు కూడా చెప్పలేదు. సినిమాలో మాదిరిగా అభిమానులను ఉర్రూతులూగించడానికి నాలుగు బట్టిబట్టిన డైలాగ్‌లు మాత్రం వదిలారు.

ఆరేళ్ల రాజకీయ జనసేన ప్రయాణంలో పవన్‌ ఏనాడూ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టలేదు. సొంత భావజాలంతో ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోలేదు. జగన్‌కు, చంద్రబాబుకు తాను ప్రత్యామ్నాయం అనే సందేశం ప్రజలకు పంపేలా ఏనాడు ప్రవర్తించలేదు. టీడీపీ ఐదేళ్లు పరిపాలనా కాలంలో చంద్రబాబు ప్రభుత్వానికి బాహుబలి కట్టప్పలా పని చేశారు తప్పా.. పజా సమస్యలను కనీసం ప్రస్తావించలేదని రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పే మాట.. చంద్రబాబు హమీలకు నాది పూచి అని చెప్పి.. ఆ వైపే ఆలోచన చేయలేదు. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పార్ట్‌టైం రాజకీయాలు చేస్తున్నారు. సీనిమాలు చేసుకుంటూ.. ఖాళీ దొరికినప్పుడు వచ్చి రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శల్లో వాస్తవం లేదంటే ఆయన్ను అభిమానించే వారు ఒప్పుకోరు.

ఎన్నికలకు ముందు ధవళేశ్వరంలో నిర్వహించిన గర్జనకు లక్షల మంది జనం వచ్చారు కానీ ఓట్లు మాత్రం రౌడీలకు వేశారంటూ.. పవన్‌ ఈ రోజు ప్రజలపై అక్కసు వెళ్లగక్కారు. తన సభలకు, ర్యాలీలకు భారీగా వస్తున్న జనం.. ఓట్లు మాత్రం ఎందుకు వేయడంలేదోనన్న ఆత్మ విమర్శ చేసుకోనంత వరకూ.. పవన్‌ రాజకీయ జీవితం ఆరేళ్లు కాదు.. ఇరవై ఏళ్లు అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనన్న చందంగా ఉంటుందన్నది సత్యం. ఈ నిజాన్ని గుర్తించి.. తాను ప్రత్యామ్నాయం అనేలా రాజకీయాలు చేసిన ప్పుడు మాత్రమే.. జనసేన ఉనికి కొనసాగుతుంది. లేదంటే.. మరో ప్రజారాజ్యం కాక తప్పదనే సందేహం ఆ పార్టీ నేతలే వ్యక్తం చేస్తున్నారు. బీజేపీతో పొత్తుతో.. ఆ సందేహం మరింత ఎక్కువైంది. పరనింద.. ఆత్మస్తుతి రాజకీయాల్లో విజయానికి ఉపకరించవు. అవి నాయకుడి లక్షణాలు కానేకాదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి