iDreamPost

ఆవిర్భావ సభ : విరాళాలివ్వాల‌ని జనసేన విజ్ఞ‌ప్తి

ఆవిర్భావ సభ : విరాళాలివ్వాల‌ని జనసేన విజ్ఞ‌ప్తి

ఈ నెల 14న గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలో జ‌ర‌గ‌నున్న జ‌న‌సేన ఆవిర్భావ సభ నిర్వహణ ఏర్పాట్ల‌లో పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మ‌నోహ‌ర్ బిజీ బిజీగా గ‌డుపుతున్నారు. ఇప్ప‌టికే నిర్వహ‌ణ క‌మిటీతో ప‌లుమార్లు భేటీ అయ్యారు. సభకు వచ్చే మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జనసేన ఆవిర్భావ సభా వేదికకు మాజీ సీఎం దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా నామకరణం చేశారు. చేశాయి పార్టీ శ్రేణులు.. ఈ సభా వేదికగా పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌.. కీలకమైన కార్యాచరణ ప్రకటిస్తారని ఇప్పటికే పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ మేరకు ఆవిర్భావ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా క‌మిటీల‌ను కూడా ఏర్పాటు చేసింది. అదే స‌మ‌యంలో ఆవిర్భావ వేడుక‌ల‌కు త‌మ వంతు స‌హ‌క‌రించాల‌ని ప్రవాసాంధ్రుల‌ను జ‌న‌సేన పార్టీ కోరింది. ఈ మేర‌కు పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మ‌నోహ‌ర్ ఇటీవ‌ల ఓ ప్రకటన విడుదల చేశారు.

నాదెండ్ల పిలుపునకు ఇతర దేశాల్లోని జనసైనికులు భారీగానే స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉంటున్న శ్రీనివాసులు అనే వ్యక్తి జ‌న‌సేన ఆవిర్భావ వేడుక‌ల‌కు త‌న వంతుగా రూ.లక్షను విరాళంగా పంపించారు. ఈ మేర‌కు శ్రీనివాసులు పంపిన మొత్తం త‌మ‌కు అందింద‌ని పార్టీ ఆవిర్భావ వేడుక‌ల‌కు త‌న వంతుగా స‌హ‌క‌రించిన శ్రీనివాసులుకు ధ‌న్యవాదాలు చెబుతూ జ‌న‌సేన ట్విట్టర్ వేదిక‌గా పోస్ట్ పెట్టింది. అటు జనసేన ఆవిర్భావ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయేలా సభను నిర్వహిస్తామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

ఈ మేరకు మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో జరగనున్న జనసేన ఆవిర్భావ సభ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సభావేదిక నుంచి భవిష్యత్తు కార్యాచరణ, పార్టీపరంగా తీసుకోవాల్సిన కొన్ని రాజకీయ నిర్ణయాలపై పవన్‌ కల్యాణ్‌ ప్రసంగిస్తారని తెలిపారు. రాజకీయ పార్టీ అంటే ఒక బృంద ప్రయత్నమని, కలిసికట్టుగా జనసైనికులు ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. ఏయే గ్రామాల్లో జన సైనికులు ఉత్సాహంగా పని చేస్తున్నారో గమనించి వారికి ఎన్‌ఆర్‌ఐ మద్దతుదారుల ఉడతాసాయంగా అండగా నిలిస్తే అది పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి