iDreamPost

జ‌గ‌న్ టాప్ గేర్ : మే నుంచి మ‌రింత దూకుడు

జ‌గ‌న్ టాప్ గేర్ : మే నుంచి మ‌రింత దూకుడు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైసీపీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి దూకుడు ముందు విప‌క్షాలు ఇప్ప‌టికే చెల్లాచెదుర‌య్యాయి. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కొంచెం కొంచెం కూడ‌గ‌ట్టుకుని, క‌లిసిక‌ట్టుగా జ‌గ‌న్ ను ఎదుర్కోవాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నాయి. ఈ క్ర‌మంలో తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడు కూడా జ‌నాల్లోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టికే కౌలురైతు కుటుంబాల ప‌రామ‌ర్శ‌ల‌తో జ‌నంలో తిరుగుతున్నారు. మ‌రోవైపు బీజేపీ దేవాల‌యాల యాత్ర‌, ఉత్త‌రాంధ్ర యాత్ర త‌న‌దైన శైలిలో ముందుకు సాగుతోంది. ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్లు గ‌డువు ఉన్న‌ప్ప‌టికీ, ఇప్ప‌టినుంచే జ‌నాల్లో లేక‌పోతే మ‌న‌ల్ని ఎవ‌రూ గుర్తించేలా లేర‌నే స్థితికి వ‌చ్చాయి విప‌క్షాలు.

ఏ అంశంలోనూ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో అంత‌గా వ్య‌తిరేక‌త క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చిన అవ‌కాశాల‌ను ఉప‌యోగించుకుని అప్పుడ‌ప్పుడూ రాద్దాంతం చేస్తున్నా.., త‌గిన విధంగా స్పందిస్తూ జ‌గ‌న్ వెంట‌నే చ‌ల్లార్చేస్తున్నారు. త‌మ అనుకూల మీడియా ద్వారా ఏదో విష‌యంపై ప్ర‌భుత్వంమీద బుర‌దజ‌ల్లుతూ ప‌దే ప‌దే ప్ర‌సారం చేసేలా ప‌న్నాగం ప‌న్నుతున్నారు. ప్ర‌జాపాల‌న‌లో బిజీగా ఉంటున్న జ‌గ‌న్, మ‌రోవైపు విప‌క్షాల ఎత్తుల‌ను కూడా గ‌మ‌నిస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు పైఎత్తులు వేస్తున్నారు. ఈ దిశ‌గా ఇప్పుడు మ‌రో అడుగు వేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే సంక్షేమ ర‌థాన్ని అధిక స్పీడుతో న‌డిపిస్తూ ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకుంటున్న జ‌గ‌న్ మే నుంచి మ‌రింత వేగం పెంచ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ‘‘మే నెల నుంచి పూర్తిగా గేర్‌ మారుస్తున్నాం.. అందరూ సన్నద్ధం కావాలి’’ అని పార్టీ శ్రేణుల‌తో సీఎం జగన్ పేర్కొన్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పుడు అంత‌టా ఆస‌క్తి ఏర్ప‌డింది.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా క్యాంపు కార్యాలయంలో మంత్రులు, పార్టీ అధ్యక్షులతో సమావేశం అయ్యారు. సమావేశంలో 26 జిల్లాల అధ్యక్షులు, రీజనల్‌ కో ఆర్డినేటర్లు, మంత్రులు హాజరయ్యారు. పార్టీ, ప్రభుత్వం సమన్వయంపై సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు. యుద్ధం చంద్రబాబుతోనే కాదు.. ఎల్లో మీడియాతోనూ చేస్తున్నామని ఈ సంద‌ర్భంగా శ్రేణుల‌తో జ‌గ‌న్ అన్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు చేప‌ట్టాల్సిన కార్య‌క్ర‌మాలు, తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వానికి పెద్ద‌గా వ్య‌తిరేక‌త లేదు.. కానీ ఎల్లో మీడియా తీరుతో జ‌నం గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నారు. ఆ ప‌రిస్థితి నుంచి ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాల‌ను వివ‌రించాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. ఇందుకోసం సోషల్‌ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలని పార్టీ శ్రేణుల‌కు సూచించారు.

అలాగే ప్లీన‌రీ ఏర్పాట్ల‌లో భాగంగా ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌ను వివ‌రించాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. అంతేకాదు.. ఈ సంద‌ర్భంగా కొత్త ప్ర‌తిపాద‌న‌ను, తీపి క‌బురును జిల్లా అధ్య‌క్షుల‌కు తెలిపిన‌ట్లు తెలిసింది. ‘‘కలిసికట్టుగా పనిచేయాలి, ఎలాంటి విభేదాలున్నా పక్కనబెట్టాలి. మనమంతా ఒకటే పార్టీ, ఒకటే కుటుంబం’’ అని చెబుతూ.. జిల్లా అధ్యక్షుల్ని జిల్లా అభివృద్ధి మండలి ఛైర్మన్లుగా చేస్తున్నామ‌ని, వారికి కేబినెట్‌ హోదా ఇస్తున్నామ‌ని, త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల అవుతాయ‌ని ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌క‌ట‌న పార్టీ నేత‌ల్లో మ‌రింత ఉత్సాహం పెంచింది. దీంతో ‘‘మే నెల నుంచి పూర్తిగా గేర్‌ మారుస్తున్నాం.. అందరూ సన్నద్ధం కావాలి’’ అన్న సీఎం ఆదేశాల ప్ర‌కారం సిద్ధ‌మ‌వుతున్నారు. అన్ని ర‌కాలుగానూ జగ‌న్ ఇప్ప‌టికే టాప్ గేర్ లో వెళ్తున్నారు. ఇవ‌న్నీ ప‌రిశీలిస్తే మార్చ‌బోయే గేర్ ఎలా ఉండ‌నుందో అన్న ఆస‌క్తి ఏర్ప‌డింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి