iDreamPost

చంద్రబాబు పిఎ, అనుచరుల ఇళ్లపై కొనసాగుతున్న సోదాలు

చంద్రబాబు పిఎ, అనుచరుల ఇళ్లపై కొనసాగుతున్న సోదాలు

ఢిల్లీ నుండి రంగంలోకి దిగిన ఐటి ప్రత్యేక బృందాలు ఇప్పుడు టిడిపి అధినేత గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి పి.శ్రీనివాస్, లోకేష్‌ సన్నిహితుల ఇళ్లు, సంస్థలపై గురువారం మొదలైన ఐటి సోదాలు వరుసగా ఐదో రోజైన సోమవారం కూడా కొనసాగుతున్నాయి. విజయవాడలోని శ్రీనివాస్‌ ఇంటితోపాటు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉంటున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌కు చెందిన అవెక్సా కార్పొరేషన్, లోకేష్‌ సన్నిహితుడు కిలారు రాజేష్‌ ఇళ్లల్లో నిరంతరాయంగా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల కర్ణాటక, రాజస్థాన్ తో సహా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కొన్ని రాజకీయ పార్టీలకు మద్దతుగా హవాలా రూపంలో నగదు పంపిణీ చేసినట్లు ప్రాధమికంగా స్పష్టమైన ఆధారాలు లభించడంతోనే ఆదాయ పన్ను అధికారులు సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది.

ఆదివారం శ్రీనివాసరావు కు చెందిన రహస్య లాకర్ నుండి పలు కీలక పత్రాలు, ఒక డైరీ, విలువైన వస్తువులు నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. శ్రీనివాస్ తో పాటు అతని సన్నిహితులు బంధువుల వివరాలను ఐటి అధికారులు సేకరించారు. ముంబై కి చెందిన ఒక పెద్ద వ్యాపారాసంస్థ నుండి ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒక బడా నేత కి 150 కోట్ల రూపాయలకు పైగా ముడుపులు అందినట్టు ఐటి అధికారులు గుర్తించారు. ఈ సమాచారం ఆధారంగానే ఐటి అధికారులు మాజీ మంత్రి నారా లోకేష్ ప్రధాన అనుచరులైన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉంటున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌కు చెందిన అవెక్సా కార్పొరేషన్, లోకేష్‌ సన్నిహితుడు లోకేష్ కి చెందిన నిర్వాణ హోల్డింగ్స్ కి డైరెక్టర్ గా ఉన్న కిలారు రాజేష్‌ ఇళ్లల్లో సోదాలు కొనసాగిస్తున్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నపుడు ఈ ఇద్దరు ప్రభుత్వం నుండి కోట్లలో లబ్ది పొందినట్టు ఐటి అధికారులు గుర్తించారు.

రాజధాని అమరావతి నిర్మాణంలో పాలుపంచుకున్న ఒక ప్రధాన నిర్మాణ సంస్థ నుంచి సబ్‌ కాంట్రాక్టుల రూపంలో దక్కించుకున్న పనులను చేయకపోయినా దొంగ ఇన్వాయిస్‌ల రూపంలో నగదును బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసి హవాలా, మనీల్యాండరింగ్‌ రూపంలో తరలించినట్లు తెలుస్తోంది. ఇలా బ్యాంకుల నుంచి డ్రా చేసిన మొత్తం ఎప్పుడు, ఎక్కడకు చేర్చారనే విషయాన్ని బ్యాంక్‌ స్టేట్‌మెంట్ల ఆధారంగా ఐటి అధికారులు సోదాలు చేస్తున్నారని, దీనివల్ల విచారణ ఆలస్యం అవుతోందని సంబంధింత వర్గాల సమాచారం.

ఈవిధంగా 2019 నవంబర్-డిసెంబర్ మధ్య 2,300 కోట్ల రూపాయల హవాలా గుట్టు ను ఐటి అధికారులు బయటపెట్టారు. దీనితో తమ ఆర్థికమూలలపై సమాచారం ఎక్కడబయటపడుతుందోమోననే ఆందోళన ఇప్పుడు ప్రతిపక్షం తెలుగుదేశంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. అలాగే ఉత్తర తెలంగాణకు చెందిన మరో రాజకీయ నాయకుడి ఇంటిపైనా ఐటీ దాడులు కొనసాగాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి