iDreamPost

ఇక మ‌న‌దే బాధ్య‌త‌..!

ఇక మ‌న‌దే బాధ్య‌త‌..!

క‌రోనా కాటు నుంచి త‌ప్పించుకోవ‌డానికి దాదాపు రెండు నెల‌ల పాటు ఇళ్ల‌ల్లోనే బంధీ అయ్యాం.. లాక్ డౌన్ తో ప్ర‌భుత్వాలు కూడా ఇప్ప‌టి వ‌ర‌కూ కాపాడుతూ వ‌చ్చాయి. ఆర్థిక కార్య‌క‌లాపాలు నిలిపివేసి అత్య‌ధిక కాలం మ‌నుగ‌డ సాగించ‌డం క‌ష్టం క‌నుక‌.. విడ‌త‌ల వారీగా స‌డ‌లింపులు ఇస్తూ వ‌చ్చాయి. ప్ర‌జ‌ల రాక‌పోక‌లు కూడా క్ర‌మంగా పెరుగుతూ వ‌చ్చాయి. ఇప్పుడు తాజాగా ఆదివారం లాక్ డౌన్ 4.0 మార్గ‌ద‌ర్శ‌కాల్లో కేంద్రం భారీ మిన‌హాయింపులు ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు కూడా వాటిని దాదాపు అమ‌లు చేస్తున్న‌ట్లు సోమ‌వారం ప్ర‌క‌టించాయి.

ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ‌, ప్రైవేటు కార్య‌క‌లాపాలు ఇంచు మించు సాధార‌ణ స్థాయిలో జ‌ర‌గ‌నున్నాయి. వాహ‌నాలు ఒక్క‌సారిగా రోడ్డెక్కుతాయి. దుకాణాలు, కార్యాల‌యాలు, బ‌‌హిరంగ ప్ర‌దేశాల్లో జ‌న సంచారం పెరుగుతుంది. ఈ ప‌రిస్థితుల్లో వేసే ప్ర‌తి అడుగూ చాలా జాగ్ర‌త్త‌గా వేయాలి. వెళ్లే ప్ర‌తి చోటా అప్ర‌మ‌త్తంగా ఉండాలి. స్వీయ ర‌క్ష‌ణ మ‌ర‌చిపోకూడ‌దు. మందు లేని మహమ్మారిని భౌతిక దూరంతో దూరం పెట్టాలి. బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు ఏం మ‌ర‌చిపోయినా కానీ.. మాస్క్ మ‌ర‌చిపోకూడద‌ని దృష్టిలో ఉంచుకోవాలి. ప్ర‌యాణ స‌మ‌యంలో వాటర్ బాటిల్ మ‌ర‌చిపోయినా కానీ.. శానిటైజ‌ర్ త‌ప్ప‌నిస‌రిగా మారిన క‌రోనా కాల‌మిది అని జ్ఞ‌ప్తికి ఉండాలి.

ఆస్ప‌త్రుల‌కు వెళ్లాల్సి వ‌స్తే అక్క‌డికి ఎవ‌రు ఏ స‌మ‌స్య‌తో వ‌చ్చారో తెలియ‌దు కాబ‌ట్టి.. మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ఏ మాత్రం ఏమ‌ర‌పాటుగా ఉన్నా ఇన్నాళ్ల మ‌న క‌ష్టం వృథా అవుతుంది. ఏ మాత్రం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించినా ముప్పు మ‌న ముంగిట్లో తిష్ట వేస్తుంది. ముఖ్యంగా పిల్ల‌లు, వృద్ధుల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది. కనిపించని ఆ శత్రువును తుదముట్టించే సరైన ఆయుధం (మందు) తయారయ్యే వరకూ యుద్ధం చెయ్యాల్సిందే. అలాగని అనవసర భయాలు పెట్టుకోవద్దు. ఎవ‌రికి వారు బాధ్యత‌గా ముందుకు సాగితే ఏ ప్ర‌మాద‌మూ ఉండ‌దు.
స‌ర్వే జ‌నా సుఖినోభ‌వంతు..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి