iDreamPost

ఇస్రో శాస్త్రవేత్తపై యువకుడి దాడి.. వీడియో వైరల్‌

  • Published Aug 31, 2023 | 2:19 PMUpdated Aug 31, 2023 | 2:19 PM
  • Published Aug 31, 2023 | 2:19 PMUpdated Aug 31, 2023 | 2:19 PM
ఇస్రో శాస్త్రవేత్తపై యువకుడి దాడి.. వీడియో వైరల్‌

చంద్రయాన్‌ 3 ప్రయోగం మొదలైన నాటి నుంచి ఇస్రో శాస్త్రవేత్తల పేరు మారుమోగిపోతుంది. చంద్రయాన్‌ 3 విజయంలో కీలక పాత్ర పోషించిన ఇస్రో శాస్త్రవేత్తలను రియల్‌ హీరోలుగా కీర్తిస్తున్నారు జనాలు. అయితే తాజాగా ఇందుకు భిన్నమైన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఇస్రో శాస్త్రవేత్త మీద ఓ యువకుడు దాడి చేసిన వీడియో ఒకటి తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజనులు.. ఆ యువకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇంతకు ఈ సంఘటన ఎక్కడ జరిగింది అంటే..

రెండు రోజుల క్రితం చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్కూటీ మీద వెళ్తున్న నిందితుడు.. ఇస్రో శాస్త్రవేత్త కారును అడ్డగించాడు. ఆ తర్వాత.. కార్‌ టైర్లను తంతూ.. శాస్త్రవేత్తను బెదిరించసాగాడు. దాడికి సంబంధించిన దృశ్యాలు.. సైంటిస్ట్ కార్డు డ్యాష్‌బోర్డు కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ తర్వాత ఆయన ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక సదరు ఇస్రో సైంటిస్టు పేరు ఆశిష్ లాంబా. ఎప్పటిలానే అతడు  మంగళవారం ఉదయం ఆఫీస్‌కు వెళ్తుండగా.. కొత్తగా నిర్మించిన హెచ్ఏఎల్ అండర్‌‌పాస్ వద్ద ఈ దాడి ఘటన జరిగిందని చెప్పుకొచ్చాడు.

హెల్మెట్ లేకుండా స్కూటీ నడుపుతున్న యువకుడు ఒకరు.. నిర్లక్ష్యంగా బండి నడపడమే కాకుండా.. తన కారును అడ్డగించాడని చెప్పుకొచ్చారు ఆశీష్‌. అంతేకాక తనను అసభ్య పదజాలంతో దూషిస్తూ కారు టైర్లను తంతూ.. తన మీద దాడికి యత్నించాడని ఆశిష్ ఆరోపించారు. వార్నింగ్ కూడా ఇచ్చాడని అన్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు కారులో తనతో పాటు తన కొలీగ్స్ కూడా ఉన్నారని పేర్కొన్నారు. నిందితుడి వాహనం నెంబరు (KA03KM8826)ను కూడా షేర్‌ చేశారు ఆశీష్‌. ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. శాస్త్రవేత్తపై దాడికి ప్రయత్నించిన యువకుడిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు యువకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

వీడియో వైరల్‌ కావడంతో.. అది కాస్త పోలీసుల దృష్టికి చేరింది. దాంతో వారు ఈ సంఘటన మీద కేసు నమోదుచేసి… వీడియో ఆధారంగా సదరు యువకుడిని గుర్తించే చర్యలు చేపట్టామని వెల్లడించారు. ఈ సంఘటన, నిందితుడికి సంబంధించిన వివరాలు అందించాలంటూ సైంటిస్టు ఆశిష్ లాంబాను పోలీసులు కోరారు. ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు పోలీసులు తెలిపారు. నిందితుడి మీద చర్యలు తీసుకోవడంతో.. పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు ఆశీష్‌ లాంబా.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి