iDreamPost

జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేసిన ఇస్రో

జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 రాకెట్  ప్రయోగాన్ని వాయిదా వేసిన ఇస్రో

గురువారం సాయంత్రం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి అంతరిక్షంలోకి పంపాల్సిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 రాకెట్ ప్రయోగంను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వాయిదా వేసింది.రాకెట్ ప్రయోగానికి ముందు చేపట్టాల్సిన 24 గంటల కౌంట్‌డౌన్ ప్రక్రియ బుధవారం మధ్యాహ్నం 3.43 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కౌంట్‌డౌన్‌ ప్రారంభించడానికి పది నిమిషాల ముందే సాంకేతిక కారణాలతో ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్టు ఇస్రో ప్రకటించింది.లభిస్తున్న సమాచారాన్ని బట్టి రాకెట్‌ ప్రయోగం వాయిదా పడటానికి సాంకేతిక సమస్య కారణం కాదని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అనుమతి రాకపోవటమే అని తెలుస్తుంది.

జీఎస్ఎల్వీ రాకెట్‌లో నాలుగు మీటర్ల వ్యాసం కలిగిన ఓగివ్ ఆకారంలో ఉండే పేలోడ్ ఫెయిరింగ్‌ను తొలిసారి వినియోగిస్తున్నారు. శ్రీహ‌రి కోట‌లోని రెండ‌వ లాంచ్ ప్యాడ్‌ను నుంచి జీఎస్ఎల్వీ ప్రయోగానికి సర్వం సిద్ధం చేశారు.ఈ దశలో బుధవారం మధ్యాహ్నం షార్ కేంద్రంలో ఇస్రో ఛైర్మన్ శివన్‌ శాస్త్రవేత్తలతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.ప్రతి రాకెట్‌ ప్రయోగానికి ముందు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అనుమతి రావాల్సి ఉంటుంది.కౌంట్‌డౌన్‌ సమయం దగ్గర పడినప్పటికి పీఎంవో కార్యాలయం నుంచి సమాచారం రాకపోవడంతో ప్రయోగాన్ని వాయిదా వేయాలని ఇస్రో నిర్ణయించింది.

భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్న “జీశాట్-1”

ఉపగ్రహం ప్రత్యేకతలు:

దేశీయ రక్షణ అవసరాలు,విపత్తుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా జీశాట్-1 ఉపగ్రహాన్ని ఇస్రో రూపొందించింది.ఈ జీశాట్-1 ఉపగ్రహం బరువు సుమారు 2,275 కిలోలు.ఇది భారతదేశ అత్యాధునిక భూ పర్యవేక్షిత ఉపగ్రహం.దేశ రక్షణ అవసరాలు తీర్చడంతోపాటు విపత్తుల సమాచారాన్ని ముందుగా పసిగట్టడం జీశాట్ ప్రయోగ ముఖ్య ఉద్దేశం.ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్‌ను తొలిసారిగా భూమికి సుమారు 36వేల కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న జియోస్టేష‌న‌రీ ఆర్బిట్ లోకి పంపాలని ఇస్రో భావించింది. జీశాట్-1 ఉప‌గ్ర‌హం ఏడేళ్ల పాటు తన సేవలు అందించనుంది. వాతావరణం సానుకూలంగా ఉన్నా,సాంకేతిక కారణాలతో ప్రయోగం వాయిదా వేశామని ఇస్రో ప్రకటించటం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి