iDreamPost

ద్వారంపూడి సవాల్ కి పవన్ కళ్యాణ్ సిద్ధమా..?

ద్వారంపూడి సవాల్ కి పవన్ కళ్యాణ్ సిద్ధమా..?

అధికార పార్టీ మీద దూకుడు ప్రదర్శించిన పవన్ కళ్యాణ్ కి ప్రతిస్పందన కూడా అంతే ఘాటుగా వస్తోంది. ఎదురుదాడి ఉధృతంగా సాగుతోంది. తాజాగా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెరమీదకు వచ్చారు. ఆవిర్భావ సభలో జనసేనాని ప్రస్తావించిన నలుగురు వైఎస్సార్సీపీ నేతల్లో ఆయన కూడా ఒకరు. వారి మీద వ్యక్తిగత విమర్శలకు పవన్ దిగారు. దాంతో వ్యక్తిగతంగానే ఎదుర్కొంటామనే రీతిలో ఈ నేతలు సవాళ్లు విసురుతున్నారు. జనసేనానిని కాకినాడ నుంచి పోటీ చేయాలని ఆహ్వానించారు. లేదంటే జిల్లాలో ఎక్కడి నుంచి పోటీచేసినా ఆయన్ని ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. అందుకే తానే ఇన్ఛార్జ్ గా బాధ్యత తీసుకుంటామని ప్రకటించారు.

ఈ తీరులో ప్రతిస్పందన జనసేనని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ద్వారంపూడి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటూ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించడం దానికి అద్దంపడుతోంది. వ్యక్తిగతంగా పేర్లు ప్రస్తావించి వేదిక మీద నుంచి విమర్శించింది పవన్ కళ్యాణ్ అన్న విషయాన్ని నాదెండ్ల విస్మరించడం విడ్డూరంగా కనిపిస్తోంది. కానీ నేరుగా ద్వారంపూడి ఛాలెంజ్ కి జనసేన స్పందించకపోవడం విశేషం. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. కాకినాడ నుంచి కాపులకు అవకాశం అత్యంత కష్టం. జనాభాలో కాపులు కొంత ప్రబలంగా కనిపించినా రాజకీయంగా వారికి అక్కడ పట్టు దక్కడం లేదు. కాకినాడ సీటులో కేవలం ఒకే ఒక్కసారి కాపు ఎమ్మెల్యే గెలిచారు. అది కూడా 1955లో అంటే నేటికి డెబ్బై ఏళ్ల క్రితమే మల్లిపూడి పళ్లంరాజు గెలిచారు. యూపీఏ హయాంలో మంత్రిగా పనిచేసిన ఎంఎం పళ్లంరాజుకి ఆయన తాత. ఆ తర్వాత వైశ్య, మత్స్యకార, రెడ్లు అవకాశం దక్కించుకోవడం విశేషం.

ఈ తరుణంలో కాకినాడ నుంచి పోటీచేయాలన్న ద్వారంపూడి సవాల్ కి జనసేన ధీటుగా స్పందించలేకపోయింది. అయితే పవన్ ప్రతిస్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. ఆయన కూడా పోటీకి సిద్ధపడతారని ఎవరూ ఊహించడం లేదు. నిజానికి గత ఎన్నికల్లో కూడా కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలను ఎంచుకుని పవన్ బరిలో దిగారు. నాన్ కాపు అంతా ఏకం కావడంతో భంగపడ్డారు. ఈసారి భీమవరం వంటి సీట్లు వదులుకుంటే ఆయనకు ఒక సమస్య వస్తుంది. ఓటమికి భయపడి పారిపోయారనే ప్రచారానికి ఊతమిస్తుంది. ప్రజల సమస్యలు ఆయనకు పట్టవని ఆరోపణలకు బలం పెరుగుతుంది. దానికి భిన్నంగా భీమవరంలో బరిలో ఉండాలంటే మూడేళ్లుగా కనీసం అక్కడ మొఖం కూడా చూపించకపోవడంతో జనాదరణ కష్టం అవుతుంది. అందుకే ఎక్కడ నుంచి పోటీలో ఉండాలన్నది పవన్ తేల్చుకోలేకపోతున్నారు.

ఈ తరుణంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి పోటీ చేస్తే ఓడించి తీరుతామని ద్వారంపూడి వ్యాఖ్యానించడం పుండుమీద కారం జల్లినట్టయ్యింది. జనసేన నేతలు కూడా ద్వారంపూడి విమర్శలకు స్పందించినప్పటికీ పోటీ విషయంలో అస్పష్టంగా మాట్లాడడం అందుకు తార్కాణంగా ఉంది. ఏమయినా ద్వారంపూడి నేరుగా పవన్ ని ఇరకాటంలో నెట్టే రీతిలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపేలా ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి