iDreamPost

చంద్రబాబు చెప్పినట్లే జగన్ నడుచుకోవాలా ? కుదరకపోవటంతోనే యాగీ చేస్తున్నాడా ?

చంద్రబాబు చెప్పినట్లే జగన్ నడుచుకోవాలా ? కుదరకపోవటంతోనే యాగీ చేస్తున్నాడా ?

దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగని రాజకీయ గొడవలు ఏపిలో జరుగుతున్నాయి. ప్రభుత్వం తీసుకునే ప్రతి విషయాన్ని వివాదంగా మలుస్తు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు. చంద్రబాబుకు మద్దతుగా ఎల్లోమీడియా సంపూర్ణ సహకారం అందిస్తుండటంతోనే ప్రతి విషయమూ వివాదంగా మారిపోతోంది. మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే.

ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్న చంద్రబాబు ఇంకా ప్రభుత్వంలో తన మాటే చెల్లుబాటు కావాలని పంతానికి పోతుండటమే అన్నీ సమస్యలకు మూలంగా మారిపోయింది. ఏ సమస్య అయినా, విషయంలో అయినా జగన్మోహన్ రెడ్డిదే అంతిమ నిర్ణయం అన్న విషయం అందరికీ తెలిసిందే. అందరికీ తెలిసిన విషయాన్ని కూడా చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇక్కడే సమస్య పెరిగిపోతోంది.

జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే టిడిపి నేతలు, శ్రేణులపై దాడులంటూ నానా గోల చేశాడు. తీరా చూస్తే పార్టీ పరంగా జరిగిన గొడవలు చాలా తక్కువన్న విషయం బయటపడింది. మళ్ళీ దాని గురించి మాట్లాడలేదు. తర్వాత ఇసుక కొరతంటూ యాగీ చేశాడు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇసుక తవ్వకాలు సాధ్యం కాదని తెలిసినా చంద్రబాబు అండ్ కో పట్టించుకోలేదు. భవన నిర్మాణ కార్మికులకు నష్టపరిహారంటూ టిడిపి పెద్ద గోలే చేసింది.

ఆ తర్వాత ఇంగ్లీషుమీడియం ఏర్పాటు విషయంలో కూడా ఇలాగే జరిగింది. ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీషుమీడియంను ప్రవేశపెట్టటం చంద్రబాబుకు ఇష్టంలేదు. అందుకనే జగన్ నిర్ణయాన్ని అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నించాడు. చివరకు చట్ట సభల్లో కుదరక న్యాయస్ధానంలో కేసు వేయించాడు. మధ్యలో మూడు రాజధానుల అంశం విషయంలో కూడా ఇలాగే వ్యవహరించాడు. వివిధ విభాగాల్లో రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేయాలని జగన్ నిర్ణయిస్తే ఆ విషయంలో కూడా ఎంత గోల చేశాడో అందరూ చూసిందే.

తాజాగా కరోనా వైరస్ సంక్షోభంలో కూడా తాను చెప్పినట్లే ప్రభుత్వం వినాలంటూ రోజూ గోల చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. వైరస్ ను ఎదుర్కొనే విషయంలో తాను చెప్పిన సూచనలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ ఒకటే గోల చేస్తున్నాడు. తాను ఎన్నిసార్లు అడిగినా అఖిలపక్ష సమావేశం పెట్టలేదంటూ విరుచుకుపడుతున్నాడు. తాను అధికారంలో ఉన్నపుడు ప్రతిపక్షాలకు ఏనాడూ విలువ ఇవ్వని ఇదే చంద్రబాబు ప్రతిపక్షంలోకి రాగానే తాను చెప్పినట్లే జగన్ నడుచుకోవాలని కోరుకోవటమే ఆశ్చర్యంగా ఉంది.

అధికారంలో ఉన్నది బహుశా కొణిజేటి రోశయ్యో లేకపోతే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డో అనుకున్నట్లున్నాడు. ఎందుకంటే వాళ్ళద్దరి సిఎంలుగా ఉన్నపుడు చంద్రబాబే ప్రభుత్వాన్ని వెనకనుండి నడిపించాడని వైసిపి నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ అధికారంలో ఉన్నది జగన్ అన్న విషయాన్ని మరచిపోయి తన మాటే చెల్లుబాటు కావాలన్న కోరిక కుదరకపోవటంతోనే ప్రతి విషయాన్ని వివాదాస్పదం చేసేస్తున్నాడు. మరి ఎంత కాలం ఇలాగ యాగీ చేస్తుంటాడో ఏమో చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి