iDreamPost

వెంకయ్యకు హ్యాండిచ్చారా? ఆశలు నీరుగారినట్టేనా??

వెంకయ్యకు హ్యాండిచ్చారా? ఆశలు నీరుగారినట్టేనా??

సుదీర్ఘకాలం పాటు బీజేపీలో కీలక పాత్ర పోషించిన ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రస్తుతం ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్నారు. సంప్రదాయంగా ఉపరాష్ట్రపతిని రాష్ట్రపతి స్థానానికి ప్రమోట్ చేసే అవకాశం ఉండడంతో ఆశించడం తప్పు కూడా కాదు. కానీ అలాంటి ఆశలన్నీ నీరుగార్చేలా మోడీ ప్రభుత్వం ముందుకెళుతున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రపతి స్థానానికి ప్రతిపాదితుల్లో వెంకయ్య పేరు లేదని తెలుస్తోంది. దాంతో రాబోయే నాలుగైదు నెలల తర్వాత వెంకయ్య ఇంటిదారి పట్టాల్సి ఉంటుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.

ఒకనాడు బీజేపీ జాతీయ అధ్యక్ష పీఠం ఎక్కిన వెంకయ్య మోడీ ప్రభుత్వం తొలినాళ్లలో క్రియాశీలకంగా వ్యవహరించారు. పట్టణాభివృద్ధి వంటి ముఖ్యమైన శాఖలు నిర్వహించారు. రాజకీయంగాను సుదీర్ఘ అనుభవంతో చొరవగా ఉండేవారు. కానీ అనూహ్యంగా ఆయన్ని ఉపరాష్ట్రపతి స్థానానికి ఎంపిక చేయడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. కానీ పార్టీలో తమకన్నా సీనియర్లని పరిమితం చేసేందుకు ప్రాధాన్యత ఇస్తారని పేరున్న మోడీ-షా ద్వయం వ్యూహాత్మక నిర్ణయాల్లో ఇది భాగమని కొందరు భావించారు.

తదుపరి రాష్ట్రపతిగా ఆయనకి అవకాశం ఉంటుందని, అందుకే ఉపరాష్ట్రపతి సీటు కట్టబెట్టారని కొందరు అంచనావేశారు. వెంకయ్య అనుచరులు గట్టిగా నమ్మారు. కాబోయే రాష్ట్రపతిగా భావించారు. కానీ తీరా చూస్తే తాజా సమీకరణల్లో ఆయన పేరు ప్రస్తావనలోకి కూడా తీసుకోకపోవడం విశేషంగా మారింది. తాజాగా మైనారిటీ నేతను రాష్ట్రపతి చేస్తారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకు గులాం నబీ ఆజాద్ కి అవకాశం ఉందనే కథనాలు కూడా వస్తున్నాయి. అయినప్పటికీ ఆజాద్ కి అవకాశాలు అతి స్వల్పంగా కనిపిస్తున్నాయి.

ఇప్పటికే విపక్ష కూటమి నుంచి కూడా శరద్ పవార్ పేరు ముందుకొస్తోంది. ఆయన నితీష్ కుమార్ ని ప్రతిపాదించారు. యూపీ ఎన్నికల్లో బీజేపీ ప్రభావాన్ని బట్టి రాష్ట్రపతి ఎన్నిక ఆ పార్టీ చేతుల్లో ఉంటుంది. సమాజ్ వాదీ హవా చాటుకుంటే యూపీతో పాటుగా దేశ రాష్ట్రపతి ఎన్నికల్లోనూ మోడీ అండ్ కో ముప్పుతిప్పలు పడాల్సి ఉంటుంది. అందుకే బీజేపీ అధిష్టానం సామాజిక కోణంలో మహిళా నేతని ప్రతిపాదించవచ్చని కొందరి భావన. ఊహాగానాలు ఎలా ఉన్నప్పటికీ వెంకయ్యకి ఎగనామం పెట్టి సాగనంపేందుకు సిద్ధపడడం ఆశ్చర్యమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి