iDreamPost

55 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్! 28 ఏళ్ళ పగ తీర్చిన సిరాజ్!

Mohammed Siraj in IND Vs SA Test 2024: సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ లో సిరాజ్ విజృంభిచడంతో.. సఫారీలపై 28 ఏళ్ల పగ తీరినట్లు అయ్యింది. ఆ పగ ఏంటో చూడండి.

Mohammed Siraj in IND Vs SA Test 2024: సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ లో సిరాజ్ విజృంభిచడంతో.. సఫారీలపై 28 ఏళ్ల పగ తీరినట్లు అయ్యింది. ఆ పగ ఏంటో చూడండి.

55 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్! 28 ఏళ్ళ పగ తీర్చిన సిరాజ్!

చరిత్ర కాలాన్ని తనలో కలుపుకోగలదు గాని.. పగ, ప్రతీకారాన్ని ఎంత మాత్రము కాదు. ఆటల్లో అయితే.. గణాంకాలు, రికార్డ్స్ ఆ పగని ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటాయి. ఇందుకు క్రికెట్ ఏమీ అతీతం కాదు. అలాంటి ఓ పగ ఇప్పుడు టీమిండియా తీర్చింది. 28 ఏళ్ల క్రితం జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుని లెక్క సరి చేసింది. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన బౌలర్ ని అనుకుని విర్రవీగిన సౌతాఫ్రికా బౌలింగ్ లెజండ్ అలెన్ డోనాల్డ్ కి.. మహమ్మద్ సిరాజ్ రూపంలో సరైన సమాధానం లభించింది. దీని అంతటికి కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ స్టేడియంలో జరుగుతున్న సౌతాఫ్రికా vs ఇండియా సెకండ్ టెస్ట్ వేదిక అయ్యింది. తొలి ఇన్నింగ్స్ లో సఫారీలు కేవలం 55 పరుగులకే ఆలౌట్ కావడంతో 28 ఏళ్ళ మన పగ తీరినట్టు అయ్యింది. అసలు ఎప్పుడో 1996లో జరిగిన ఓ సాధారణ టెస్ట్ కి, 2024లో జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ కి లింక్ ఏంటి? 1996 డిసెంబర్ 26న ఏం జరిగింది? డోనాల్డ్ చేసిన ఆ అవమానం ఏమిటి? ఇలాంటి అన్నీ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1990ల్లో దక్షిణాఫ్రికా జట్టు అంటే అందరికీ భయం. ఆ తత్తరపాటు మొత్తం ఆ జట్టుని చూసి కాదు. ఆ జట్టులోని ఒకే ఒక్క బౌలర్ ని తలుచుకుని. అతని పేరే అలెన్ డోనాల్డ్. 6 అడుగుల 4 అంగుళాల ఎత్తు. దుర్బేధ్యమైన శరీరం. చిరుత లాంటి వేగం. అన్నిటికీ మించి గుర్రంలా ఎగిరి.. బాల్ విసిరే విధానం. ఇవన్నీ ఆకాలం బ్యాటర్స్ కి భయాన్ని మిగిల్చిన గుర్తులు. పేస్ కి స్వర్గధామమైన సౌత్ ఆఫ్రికా పిచ్ లపై 155 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చే డోనాల్డ్ బౌలింగ్ ఎదుర్కోవడానికి స్టార్ బ్యాటర్స్ సైతం వణికిపోయేవారు. ఇక ఉపఖండ పిచ్ పై మాత్రమే రెచ్చిపోయి.. విదేశాల్లో ఢీలా పడిపోయే ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక బ్యాటర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి సమయంలోనే ఇండియా సౌతాఫ్రికా టూర్ కి పోవాల్సి వచ్చింది. 1996 డిసెంబర్.. 23 ఏళ్ళ కుర్రాడు సచిన్ టెండూల్కర్ కి తొలిసారి కెప్టెన్సీ. గంగూలీ, ద్రవిడ్ వంటి యంగ్ జూనియర్స్ టీమ్ లోకి వచ్చి అప్పుడే 4 నెలలు అవుతుంది అంతే. అందరిలో గెలవాలన్న కసి. బాగా రాణించాలన్న తాపత్రయం. కానీ.., అవతలి ఎండ్ లో డైనోసార్ డోనాల్డ్.

డర్బన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో సౌతాఫ్రికా ముందుగా బ్యాటింగ్ చేసి.. 235 పరుగులు చేసింది. అప్పట్లో డర్బన్ పిచ్ పై ఇది చెప్పుకోతగ్గ స్కోరే. వెంకటేశ్ ప్రసాద్ 5 వికెట్స్ సాధించగా, శ్రీనాథ్ 2 వికెట్స్ దక్కించుకున్నాడు. ఇక భారత్ ఇన్నింగ్స్ మొదలవ్వడంతోనే డోనాల్డ్ విధ్వంసం కూడా మొదలైంది. వికెట్ తీయడం కన్నా.. ఇండియన్ బ్యాటర్స్ తలలు పగలకొట్టడమే ధ్యేయంగా డోనాల్డ్ బౌలింగ్ సాగింది. మరో ఎండ్ నుండి షాన్ పొలాక్ లైన్ అండ్ లెంత్ తో చెలరేగిపోయాడు. ఈ ద్వయం దెబ్బకి ఇండియా కేవలం 100 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ముఖ్యంగా టీమ్ లో సగం మంది ఆటగాళ్లకు డోనాల్డ్ విసిరిన బంతులు తగిలాయి. రన్స్ సంగతి తరువాత.. ముందు దెబ్బలు తగలకుండా బయట పడితే చాలు అన్నట్టు టీమిండియా ఆటగాళ్ల స్తైర్యం దెబ్బతింది. 16 పరుగులు చేసిన గంగూలీ టాప్ స్కోరర్ అంటే భారత్ ఆట ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఆ ఇన్నింగ్స్ లో డోనాల్డ్ మొత్తం 5 వికెట్స్ సాధించడం విశేషం.

తొలి ఇన్నింగ్స్ లో 135 పరుగుల ఆధిక్యానికి తోడు.. సెకండ్ ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 259 పరుగులు చేయడంతో.. భారత్ టార్గెట్ కొండంత అయ్యింది. అప్పటికే పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయిన ఇండియన్ బ్యాటర్స్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంకా ఘోరమైన ఆట కనపరిచారు. అప్పటికి కొత్త కుర్రాడైన రాహుల్ ద్రవిడ్ 27 పరుగులతో దైర్యంగా నాటౌట్ గా నిలిచినా.. మిగిలిన ఎండ్ లో ఒక్క బ్యాట్సమెన్ కూడా నిలువలేకపోయారు. ద్రవిడ్ మినిహా ఒక్కరు కూడా రెండు అంకెల స్కోర్ సాధించకపోవడంతో ఇండియా 66 పరుగులకే ఆలౌట్ అయ్యి.. పరువు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇండియన్ బ్యాటర్స్ బాడీలను టార్గెట్ గా చేసుకుని బంతులు విసిరిన అలెన్ డోనాల్డ్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా 4 వికెట్స్ సాధించి.. గర్వంతో స్లెడ్జింగ్ కి దిగిన విధానం అప్పటి క్రికెట్ ప్రేమికులు ఎప్పటికీ మరచిపోలేరు.

ఇక చివరిదైన మూడో టెస్ట్ నాటికి అక్కడి పరిస్థితులను అర్థం చేసుకుని అక్కడి పరిస్థితులను అర్థం చేసుకుని సచిన్, ద్రవిడ్, గంగూలీ త్రయం సెంచరీలు, అర్ధ సెంచరీలతో చెలరేగినా.. అప్పటికే టీమిండియా సీరిస్ కోల్పోయింది. కాకుంటే.., సౌతాఫ్రికాకి వెళ్లి.. అక్కడ వాళ్ళ బౌలింగ్ నే చీల్చి చెండాడిన గంగూలీ, ద్రవిడ్ అనే ఇద్దరు కురాళ్ళపై ప్రశంసల వర్షం కురిసింది. అప్పుడు అందరూ అనుకున్నట్టే.. వీరిద్దరూ తరువాత కాలంలో టీమిండియాని ముందుండి నడిపించి లెజండ్స్ అనిపించుకునే స్థితికి చేరారు. ఏదేమైనా.. తొలి టెస్ట్ లో ఇండియా 66 పరుగులకే ఆలౌట్ అవ్వడం మాత్రం ఓ మచ్చలా అలానే ఉండిపోయింది. అయితే.., 28 ఏళ్ళ  తరువాత సౌతాఫ్రికా జట్టుని 55 పరుగులకే ఆలౌట్ చేయడంతో పగ తీర్చుకున్నట్టు అయ్యింది. మరి.. నిప్పులు చెరిగి, 28 ఏళ్ళ పగ తీర్చిన మహ్మద్ సిరాజ్ బౌలింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి