iDreamPost

టీమిండియాకు జరిమానా విధించిన ICC.. కారణం ఇదే!

  • Published Aug 04, 2023 | 8:54 PMUpdated Aug 04, 2023 | 8:54 PM
  • Published Aug 04, 2023 | 8:54 PMUpdated Aug 04, 2023 | 8:54 PM
టీమిండియాకు జరిమానా విధించిన ICC.. కారణం ఇదే!

ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ టీమిండియాకు జరిమానా విధించింది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌ కారణంగా భారత జట్టుకు ఫైన్‌ పడింది. టీమిండియాతో పాటు వెస్టిండీస్‌కు కూడా మ్యాచ్‌ ఫీజులో కోత విధించింది ఐసీసీ. దీనికి స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా చూపించింది. గురువారం ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో వేదికగా జరిగిన తొలి టీ20లో స్లో ఓవర్‌ కారణంగా ఇరు జట్లకు మ్యాచ్‌ ఫీజులో కోత విధించింది. ఇందులో టీమిండియా కంటే వెస్టిండీస్‌ జట్టుకే ఎక్కువ కోత పడింది. టీమిండియా మ్యాచ్‌ ఫీజులో ఐదు శాతం కోత పెట్టిన ఐసీసీ.. వెస్టిండీస్‌కు పది శాతం కోత విధించింది. మినిమమ్‌ ఓవర్‌ రేట్‌ కంటే.. ఒక ఓవర్‌ వెనుకబడి ఉన్నందుకు ఐసీసీ ఈ చర్యలు తీసుకుంది.

కనీస ఓవర్ రేట్ నేరాలకు సంబంధించి ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఈ చర్యలు తీసుకున్నారు. ఆటగాళ్లు తమ జట్టు నిర్ణీత సమయంలో బౌలింగ్ చేయడంలో విఫలమైన ప్రతి ఓవర్‌కు వారి మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధిస్తారు. అయితే ఈ జరిమానా మ్యాచ్‌ ఫీజులో 50 శాతం వరకు విధించవచ్చు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత వెస్టిండీస్‌ జట్టు బ్యాటింగ్‌ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఓపెనర్‌ బ్రాండెన్‌ కింగ్‌ 28 పరుగులతో పర్వాలేదనిపించాడు. కానీ మరో ఓపెనర్‌ కైల్‌ మేయర్స్‌ ఒక్క పరుగుకే పరిమితమై నిరాశపరిచాడు. ఈ ఇద్దరు ఓపెనర్లను యుజ్వేంద్ర చాహలే అవుట్‌ చేయడం విశేషం. పూరన్‌ 41, కెప్టెన్‌ రోవ్‌మన్‌ పావెల్‌ 48 పరుగులతో రాణించారు. మిగతా బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేదు. భారత బౌలర్లలో అర్షదీప్‌ 2, చాహల్‌ 2 వికెట్లు పడగొట్టగా.. హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు.

150 పరుగుల నామమాత్రపు లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన యువ టీమిండియా దారుణంగా నిరాశపర్చింది. విజయానికి 5 పరుగుల దూరంలో భారత పోరాటం ముగిసింది. ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌(6), శుబ్‌మన్‌ గిల్‌(3) దారుణంగా విఫలం అయ్యారు. మధ్యలో సూర్యకుమార్‌ యాదవ్‌(21), తిలక్‌ వర్మ(39) రన్స్‌తో టీమిండియాను విజయం వైపు నడిపించినా.. గెలుపు గుమ్మం వరకు తీసుకెళ్లలేకపోయారు. వీరిద్దరూ అవుటైన తర్వాత.. టీమిండియా బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలువలేదు. నిలిచినా పరుగులు చేయలేక చతికిల పడ్డారు. కెప్టెన్‌ పాండ్యా(19), సంజు శాంసన్‌(12), అక్షర్‌(13) స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఇక టెయిలెండర్ల కూడా అద్భుతం ఏమీ చేయలేదు. దీంతో టీమిండియా ఓవర్లు పూర్తయ్యే సరికి 9 వికెట్లు నష్టపోయి 145 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో 0-1తో వెనుకబడింది. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రదర్శన, అలాగే జరిమానా విధింపుపై కూడా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: తిలక్‌ వర్మ బాగానే ఆడుతున్నాడు కానీ.. ఇదొక్కటే పెద్ద మైనస్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి