iDreamPost

హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు పోలీసుల షాక్!.. కారణం ఏంటంటే?

హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు పోలీసుల షాక్!.. కారణం ఏంటంటే?

తెలంగాణలోని హైదరాబాద్ మహానగరంలో ఐటీ కంపెనీలకు కొదవ లేదు. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు హైదరాబాద్ లో కొలువుదీరి వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో దేశం నలుమూలల నుంచి ఉద్యోగాల కోసం పెద్ద ఎత్తున యువత హైదరాబాద్ కు తరలివస్తోంది. అయితే ఇటీవల చోటుచేసుకుంటున్న కొన్ని రాజకీయ సంఘటనల పట్ల ఐటీ ఉద్యోగులు స్పందిస్తూ ధర్నాలకు దిగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు పోలీసులు షాక్ ఇచ్చారు. ఇకపై ఆ విధంగా చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ లో సామాన్య ప్రజలకు, ట్రాఫిక్ కు అంతరాయం కలిగేలా వ్యవహిరించే ఐటీ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అవినీతికి పాల్పడిన కేసులో చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ఉన్నారు. అయితే ఈ అరెస్టుకు సంబంధించి ప్రజల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో టీడీపీ శ్రేణులు తీవ్ర నిరాశలో ఉన్నాయి. ప్రజలను రెచ్చగొట్టి గొడవలు సృష్టించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని ఐటీ ఉద్యోగులను ఉసిగొల్పుతున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజుల నుంచి ఐటీ కారిడార్ లో చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు నిరసనలు తెలుపుతున్నారు.

కాగా ఈ రోజు కూడా ఐటీ ఉద్యోగులు ఆందోళనలు చేపట్టగా పోలీసులు వారికి షాక్ ఇచ్చారు. ఐటీ ఉద్యోగులపై ఆంక్షలు విధించారు. మాధాపూర్, గచ్చిబౌలి, మణికొండ, నానక్ రాం గూడ వంటి ఐటీకారిడార్ ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఐటీ ఉద్యోగులు ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలకు దిగుతున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఐటీ ఉద్యోగులు రోడ్లపై నిరసనలు తెలపడంతో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్నారని పోలీసులు చెప్పారు. అనుమతి లేకుండా నిరసనలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని మాధాపూర్ పోలీసులు తెలిపారు. ఐటీ ఉద్యోగులు పనిచేసే కంపెనీలకు సైతం నోటీసులు జారీ చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి