iDreamPost

రాజకీయాల్లోకి హైదరాబాద్‌ కలెక్టర్‌..?

రాజకీయాల్లోకి హైదరాబాద్‌ కలెక్టర్‌..?

హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శర్మన్‌ రాజకీయాల్లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. మరో రెండునెలల్లో పదవీ విరమణ చేయనున్న ఆయన.. తర్వాత రాజకీయాల్లో చేరాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈమేరకు రాజకీయాల్లో ఉన్న తన సామాజికవర్గానికి చెందిన పెద్ద నేతలు, సంబంధీకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌కు చెందిన ఓ మంత్రి సహకారంతో టీఆర్‌ఎస్‌ పెద్దలతో సంప్రదింపుల్లో ఉన్నారని చెబుతున్నారు. అవకాశం వస్తే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఖానాపూర్‌ (ఎస్టీ) నియోజకవర్గం నుంచి పోటీచేయాలనే ఆలోచనలో శర్మన్‌ ఉన్నట్లు సమాచారం.

రిటైర్మెంట్‌ అనంతరం ఎన్నికలకు ఏడాదిన్నర వ్యవధి లభిస్తుందని.. ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సమయం చిక్కుతుందన్న భావనలో ఉన్నారంటున్నారు. ఆయన టీఆర్‌ఎస్‌ నుంచి బరిలోకి దిగనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు శర్మన్‌పై బీజేపీ, కాంగ్రెస్‌ సైతం దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామానికి చెందిన శర్మన్‌ 1994లో గ్రూప్‌-1 ఉద్యోగం సాధించారు. 2005లో ఐఏఎస్ హోదా పొందారు. ఏడాది నుంచి హైదరాబాద్‌ కలెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా, సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలపై శర్మన్‌ స్పందించారు. పదవీ విరమణకు 2 నెలల గడువుందని, తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తానని చెప్పారు. రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలపై ఇప్పుడు ఏమీ మాట్లాడనని తెలిపారు. కాగా, ఖానాపూర్‌ నుంచి ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ తరపున రేఖానాయక్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి