iDreamPost

మంచి సాహిత్యాన్ని పాఠకులకు చేరువ చేసిన హైదరాబాద్ బుక్ ఫెయిర్

మంచి సాహిత్యాన్ని పాఠకులకు చేరువ చేసిన హైదరాబాద్ బుక్ ఫెయిర్

పుస్తకం హస్తభూషణమనే మాట పాతబడి చాలా ఏళ్ళయిపోయింది. మొబైల్ ఫోన్ ప్రవేశంతో జీవితంలో చాలా విషయాలు నిష్క్రమించాయి . సహజమైన సంతోషాలకు మొబైల్ చరమ గీతం పాడేసింది. వాటిలో పుస్తక పఠనం ఒకటి. ఏదైనా సమాచారమో, విజ్ఞానమో కావాలనుకున్నపుడు షెల్ఫ్ లోంచి పుస్తకం తీసి రిఫర్ చెయ్యడమనేది పూర్తిగా అంతర్ధానమైంది. ఇది సాంకేతిక విప్లవ ఫలితం కావొచ్చు. కానీ మానవ సహజ కళాభిరుచిని పూర్తిగా దెబ్బకొట్టే ఫలితం ఇది. అవసరమైన పుస్తకాల కోసం పాత పుస్తకాల షాపులు తిరగడమూ, లైబ్రరీకి వెళ్ళడమూ, పేపర్ కటింగ్స్ దాచడమూ, జనరల్ నాలెజ్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోడమూ ఇవన్నీ గత చరిత్ర తాలూకు మరకలు ఇప్పుడు

ఏదైనా పుస్తకం ప్రస్తావన రాగానే నూటికి తొంభై మంది “పీడీఎఫ్ ఉందా?” అనడుగుతారు, పెద్ద చదివే వాళ్లకు మల్లే! ఒకవేళ మన దగ్గర పీడీఎఫ్ ఉండి, ఇచ్చినా, చదివే ఉత్సాహం ఉండదు. చాలా మంది దగ్గర లాప్టాపుల్లోనూ, టాబ్లెట్స్ లోనూ “ఈ బుక్సూ”, పీడీఎఫ్ లూ గుట్టలుగా పడి ఉంటాయి తప్ప తీరిగ్గా తీసి చదివే ఆసక్తి ఉండదు. ఎందుకంటే పుస్తక పఠనం మీద అభిరుచి లేక పోవడం సంగతి అలా ఉంచి, అచ్చు పుస్తకాన్ని చదవడానికే అందరూ ఇష్టపడటం కారణం కాబట్టి

తీరిగ్గా కూచుని, పేజీలు తిప్పుతూ పుస్తకం చదువుతూ అందులో లీనమై పోవడం ఎవరికైనా గొప్ప అనుభూతే.

గమనించారా ఎప్పుడైనా? అచ్చు పేజీలో చదివిన నవలో కథో మరోటో , ఆ పుస్తకంలోని ఒక దృశ్యాన్ని మనం నెమరేసుకున్నపుడు,ఆ పేజీ తో సహా, ఆ పేజీలో నలిగిన కాయితం మడతలతో సహా అది మన మెదడులో తిష్ట వేసుక్కూచుంటుంది

అందుకే, ఎన్ని రకాలు గా పుస్తకాలు మార్పు చెందినా, పీడీఎఫ్ లుగా ఆడియోలుగా రూపాలు మార్చుకున్నా, అచ్చు పుస్తకం విలువ అచ్చు పుస్తకానిదే! ఎన్నడూ తగ్గనిది

అందుకే, చదవాల్సిన పుస్తకాలు గుట్టలు గా పడి ఉన్నా, ఏటా డిసెంబర్ లో హైద్రాబాద్ బుక్ ఫెయిర్ రాగానే పుస్తకాభిమానులంతా అటు వైపు పరుగులు పెడతారు. ఎప్పటి నుంచో చదవాలనుకుంటున్న క్లాసిక్సూ, కొత్తగా పుట్టుకొచ్చిన పుస్తకాలూ,పిల్లల కోసం బాల సాహిత్యం, ఇతర భాషా సాహిత్యం అంటూ మళ్ళీ సంచులు నింపుకొస్తారు. ఎప్పుడు చదువుతారని అడక్కండి. అది తర్వాత సంగతి

33 ఏళ్ళుగా జరుగుతోన్న పుస్తకాల సంతలో ఈ సారి జనం సెలవు రోజు కాక పోయినా మరీ ఎక్కువగా కనిపించారు

ఒకటా రెండా? 330 స్టాళ్ళు. 9 రాష్ట్రాల నుంచి వచ్చ్న పబ్లిషర్లూ, లక్షల కొద్దీ పుస్తకాలూ!

బుక్ ఫెయిర్ కి ముందుగా కొత్త పుస్తకాలను పబ్లిష్ చేయడం, వాటిని సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం కొద్ది ఏళ్ళుగా మొదలైన సంప్రదాయం. ఈ సారి మరింతగా ఊపందుకుని, సరికొత్త పుస్తకాల్లు మార్కెట్లోకి వచ్చాయి. కథా సంకలనాలూ, కవితా సంకలనాలూ, నవలలూ కొత్తగా ఈ డిసెంబర్ లో పబ్లిష్ అయ్యి బుక్ ఫెయిర్ లో చోటు సంపాదించాయి.

ఫేస్బుక్ లో ప్రమోషన్ వల్ల పుస్తకాల సేల్స్ పెరిగిన మాట నిజమే! రచయితలంతా ఫేస్బుక్ లో ఉండటం వల్ల పుస్తకాలను బాగా ప్రమోట్ చేసుకోగలిగారు.

దివంగత రచయితలను, సాహితీ వేత్తలను గౌరవిస్తూ బుక్ ఫెయిర్ కమిటీ ప్రధాన ద్వారాన్ని అబ్బూరి ఛాయాదేవి, మాది రెడ్డి సులోచనల ద్వారంగా రూపొందించింది .

ప్రాంగణాన్ని దివంతగ ప్రధాని, సాహితీ వేత్త డాక్టర్ పివీ నరసింహా రావు ప్రాంగణంగా మలిచారు. ప్రముఖ సాహితీ వేత్తలు నోముల సత్యనారాయణ, డాక్టర్ సి రాఘవాచారి పేరిట పుస్తకావిష్కరణల కోసం వేదికలను ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ అక్కడ సరికొత్త పుస్తకాలు ఆవిష్కారం అవుతున్నాయి

ఈ సారి ప్రత్యేకంగా చెప్పుకోవలసింది బాల సాహిత్యం గురించిన వాకబులు, పిల్లల పుస్తకాలకు సేల్స్ రెండూ ఎక్కువగా ఉండటం.

చాలా మంది ప్లిల్లలతో సహా వచ్చి, వారికి ఇష్టమైన పుస్తకాలను అడిగి మరీ కొనడం ! స్మార్ట్ ఫోన్లకు అతుక్కు పోతున్న పిలల్లను పుస్తకల వైపు మళ్ళించే దిశగా తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారేమో అని ఆశ కల్గించే దృశ్యాలివి

గ్రోలియర్ ఇంటర్నేషనల్ (195,196స్టాల్స్ ) స్టాల్ లో పిల్లల మెదడుకు పదును పెట్టే గేంస్, తర్కాన్న్ని రేకెత్తేఇంచే ప్రశ్నలతో రూపొందించిన బ్లాక్స్, బొమ్మలతో కూడిన ఆసక్తి కరమైన పుస్తకాలు అమ్ముతున్నారు. వాళ్ల వలంటీర్లు, తల్లిదండ్రులను పిల్లలను కూచోబెట్టి కథలు చెప్పడం, గేంస్ ఆడించడం వంటివి చేస్తూ, సేల్స్ బాగానే పెంచుకున్నారు.

పిల్లల పర్సనాలిటీ అసెస్మెంట్ టెస్ట్ లు కూడా ఇక్కడ సులువైన పద్ధతుల ద్వారా ఒక స్టాల్ వద్ద చేస్తూ , అందుకు అనుగుణంగా పుస్తకాలు సూచిస్తున్నారు. ఇదీ మార్కెటింగ్ టెక్నిక్కే. 

మంచి ఇంగ్లీష్ సాహిత్యమూ, తెలుగు క్లాసిక్సూ కుప్పలు తెప్పలుగా అందుబాటులో ఉంది బుక్ ఫెయిర్ లో

ఎమెస్కో, నవ చేతన,నవోదయ,అనల్ప, అన్వీక్షికి,నవయుగ, ఏ స్టాల్ కైనా వెళ్లండి. ఎటువంటి మొహమాటాలకూ పోక మనసుకు నచ్చిన పుస్తకాలు తెచ్చుకోండి. తెచ్చుకున్న వాటిని తప్పకుండా చదవండి. చదివే సంకల్పంతోనే కొనండి

చదివే ఉద్దేశం లేకపోతే, కొనకండి. పుస్తకాలుండీ చదవని వాడు నిరక్షరాస్యుడి కిందే లెక్క

హైద్రాబాద్ బుక్ ట్రస్ట్ 28,29 తారీకుల్లో కొన్ని మంచి పుస్తకాలను 1 రూపాయి నుంచి పది రూపాయల లోపుగానే అందిస్తున్నారు. బారిష్టర్ పార్వతీశం కేవలం ఒక రూపాయికి దొరుకుతుందంటే నమ్మగలమా?

ఈ జాబితాలో మంచి పుస్తకాలు చాలానే ఉన్నాయి.

ఎవరి అభిరుచికి తగ్గట్టు వాళ్ళు పుస్తకాలు కొనుక్కున్నా, కొన్ని చదవదగిన పుస్తకాల జాబితా

శప్తభూమి- బండి నారాయణ స్వామి

చేదు పూలు- మెహెర్

తేరే బినా జిందగీ — పరేష్ దోషి

నేషనల్ బుక్ ట్రస్ట్ లో చాలా బుక్స్

అమృత సంతానం -గోపీనాథ్ మహంతి

కొండ పొలం -సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

మహాభారతం మన చరిత్రే -కల్లూరి భాస్కరం

రష్యన్ క్లాసిక్స్ – కుమార్ కూనపరాజు సేకరణ

ఖచ్చితంగా నాకు తెలుసు -వంశీ

ఇవి కొత్తగా వచ్చిన బుక్స్ లో కొన్ని (శప్త భూమి ఇంతకుముందే వచ్చినా, దాని ప్రాశస్త్యం చాలా మంది గ్రహించలేదు. ఇప్పుడు సాహిత్య అకాడమీ వచ్చిన నేపథ్యంలో ఎక్కువమంది కొని చదువుతారని ఆశ)

ఇవే కాకుండా

జీవితపు లోతుల్ని స్పృశించి ఆ స్పర్శను మనకు అందిచే గొప్ప రచయితల రచనలు, క్లాసిక్స్, ఎవరూ సజెస్ట్ చేయకుండానే నవ చేతన, ఎమెస్కో, నవోదయ వంటి స్టాల్స్ లో ప్రస్ఫుటంగానే కంపిస్తాయి. అవి ముఖ్యంగా చదవండి .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి