iDreamPost

డిటెక్టివ్ కావ‌డం ఎలా?

డిటెక్టివ్ కావ‌డం ఎలా?

చిన్న‌ప్పుడు చాలా కావాల‌నుకుంటాం. పెద్ద‌య్యే స‌రికి ఏమీ కాకుండా మిగిలిపోతాం. జేమ్స్‌బాండ్ ఎలాగూ కాలేం, క‌నీసం డిటెక్టివ్ అయినా అవుదామ‌నుకున్నా. స్కూల్లో చేరితే ప‌రీక్ష పెట్టి పాస్ చేస్తారు. డిటెక్టివ్ కావాలంటే ఏం ప‌రీక్ష‌లు రాయాలో తెలియ‌దు.

మా ఫ్రెండ్‌కి అన్న‌, పేరు గంగాధ‌రం. నోట్లో ఎప్పుడూ బ్రిస్ట‌ల్ సిగ‌రెట్‌, చేతిలో పాకెట్ సైజ్ డిటెక్టివ్ బుక్‌. న‌డుస్తూ కూడా చ‌దివే వాడు. పింక్ క‌ల‌ర్ పేప‌ర్‌తో చూడ‌టానికి భ‌లే ఉండేవి. వాటి పేర్లు కూడా “బంగళాలో భూతం”, “ఎవ‌రు హంత‌కుడు?” ఇలా …అట్ట‌మీద ఒక అమ్మాయి బొమ్మ‌, రివాల్వ‌ర్ ప‌ట్టుకున్న హీరో బొమ్మ‌…

చ‌దువుతుంటే ఒక‌టే స‌స్పెన్స్‌. సింగిల్ సిటింగ్‌లో చ‌దివేసేవాన్ని. కానీ ఇంట్లో తెలిస్తే ఉతుకుతారు. కాబ‌ట్టి ఇదంతా సీక్రెట్‌గా జ‌ర‌గాలి. ఏడో త‌ర‌గ‌తి దాటే స‌రికి పాతిక పుస్త‌కాలు పైగా చ‌దివేశా. న‌ర్స‌న్‌, యుగంధ‌ర్ ప‌రిశోధ‌న మామూలుగా ఉండేది కాదు. అప్ప‌టికింకా మ‌ధుబాబు షాడో రాలేదు. ఒక రెంటెడ్ షాపులోని పుస్త‌కాల‌న్నీ చ‌దివేస‌రికి , ఇక త‌న ద‌గ్గ‌ర లేవ‌ని చేతులెత్తేశాడు. సొంతంగా రాసేద్దామ‌ని ప్ర‌య‌త్నిస్తే ఒక పేరాగ్రాఫ్‌కి మించి రాయ‌లేక‌పోయాను.

జ్ఞానం వ‌ల్ల ప్ర‌మాదం ఏమంటే , అది ఊరికే ఉండ‌నివ్వ‌దు. అర్జెంటుగా ప‌రిశోధ‌న ప్రారంభించాలి. ఒక భూత‌ద్దం కావాలి. అదేం పెద్ద ప‌నికాదు. 40 పైస‌ల‌కే వ‌చ్చింది. బైనాక్యుల‌ర్స్ కొనాలి. వెల రూ.1, కొంచెం క‌ష్ట‌మే. కానీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఉన్నాడు, ఆయ‌న‌కో హుండీ ఉంది. హుండీలోంచి డ‌బ్బులు తీయ‌డానికి హెయిర్ పిన్స్ క‌నిపెట్టారు. నాలుగు పావ‌లా బిల్ల‌లు లాగేశాను. ఫుట్‌పాత్ మీద బైనాక్యుల‌ర్స్ కొన్నాను. దాంట్లో అంతా బూజుబూజు త‌ప్ప ఏమీ క‌న‌ప‌డ‌లేదు.

వ‌స్తువులు రెడీ, కానీ ప్ర‌తి డిటెక్టివ్‌కి ఒక అసిస్టెంట్ ఉంటాడు. మ‌ల్లికార్జున అనే త‌ల‌మాసినోడు దొరికాడు. వాడికి పుస్త‌కాల అనుభ‌వం లేదు, సినిమాలు చూసే అల‌వాటు లేదు. ఏదో ఉత్సాహం కొద్దీ ఒప్పుకున్నాడు. ప‌రిశోధ‌న ముందుకు సాగాలంటే దొంగ‌త‌న‌మైనా జ‌ర‌గాలి, లేదా హత్య‌!

మా అదృష్టం కొద్దీ ఒక ఇంట్లో దొంగ‌లు ప‌డ్డారు. కిటికీ ఊచ‌లు వంచి దొంగ‌త‌నం చేశారు. మేము వెళ్లేస‌రికి ఒక‌టే జ‌నం. ఆ టైంలో భూత‌ద్దం , బైనాక్యుల‌ర్స్ తీస్తే మాకు వాస్తుందని అర్థ‌మైంది.

పైగా గంజి పెట్టిన నిక్క‌ర్ల‌తో తిరుగుతున్న పోలీసుల్ని చూస్తే మా నిక్క‌ర్లు త‌డిసిపోయాయి. కానీ త‌ర్వాత అర్థ‌మైంది ఏమంటే అది మా స్థాయికి త‌గిన ప‌రిశోధ‌న కాదు. ఆ దొంగ‌లు దుర‌దృష్ట‌వంతులు. ఇంటాయ‌న డొక్కు వాచీ, ఆవిడ పాత చీర‌లు మాత్ర‌మే ద‌క్కాయి. బంగార‌మంతా తాక‌ట్టు పెట్టినందుకు, మొగున్నిమొద‌టిసారిగా ఆవిడ మెచ్చుకుంది. కానీ నాలుగు ఉతుకులు కూడా ప‌డ‌కుండానే చీర‌లు దొంగ‌ల పాలైనందుకు ఆవిడ వెక్కిళ్లు పెట్టి ఏడ్చింది. చీర‌ల వ‌ల్ల ఆ చోరుల భార్య‌లు సంతోషించారేమో తెలియ‌దు.

ఆ త‌ర్వాత కొంత కాలానికి మాకు క‌రెక్ట్ కేసు త‌గిలింది. ఒక ముస‌లావిడ హ‌త్య జ‌రిగింది. గొప్ప‌గొప్ప డిటెక్టివ్‌లు యుగంధ‌ర్‌, న‌ర్స‌న్‌లు హ‌త్య కేసుల్ని ఎలా ప‌రిశోధించారో తెలుసుకోడానికి డిటెక్టివ్ పుస్త‌కాల‌ను రివిజ‌న్ చేశాను కానీ, ఏమీ అర్థం కాలేదు.

హ‌త్య జ‌రిగిన ఇంటి ప‌రిస‌రాల‌కు వెళ్ల‌డానికి ధైర్యం చాల్లేదు. ఎందుకంటే ఆ ముస‌ల్ది గ్యారెంటీగా దెయ్యంగా మారి ఉంటుంది. మేము డిటెక్టివ్‌ల‌ని గుర్తించ‌క‌, పీక నులిమి చంపేస్తుంది. హ‌త్య కేసు ప‌రిశోధ‌న‌కి వెళ్లి హ‌త్య‌కు గురి కావ‌డం డిటెక్టివ్‌ల లక్ష‌ణం కాదు.

మ‌రుస‌టి రోజు అనంత‌పురం నుంచి పోలీస్ కుక్క‌లొచ్చాయి. ఊర‌కుక్క‌లు కాకుండా అలాంటి కుక్క‌లు కూడా ఉంటాయ‌ని నాకు తెలియ‌దు. మా ఊర్లోని కుక్క‌లు, వాటి మీద యుద్ధం ప్ర‌క‌టించాయిగానీ , అవి కోర‌లు చూప‌గానే, తోక‌లు ముడిచాయి.

ఆ కుక్క‌లు క‌నప‌డిన ప్ర‌తిదాన్నీ వాస‌న చూసి , గాల్లోకి మోర ఎత్తి అర‌వ‌డం త‌ప్ప చేసిందేమీ లేదు. ఒక‌వేళ మేము ముస‌ల్దాని ఇంటి ద‌గ్గ‌రికి వెళ్లి ఉంటే కుక్క‌ల‌కి దొరికిపోయి , కుక్క బ‌తుకు బ‌తికేవాళ్లం. నా డిటెక్టివ్ నాలెడ్జీ ర‌క్షించింది.

ఒక‌రోజు నా స్కూల్ బ్యాగ్‌లోంచి భూత‌ద్దం, బైనాక్యుల‌ర్స్ ఎవ‌రో కొట్టేశారు. ఎంత ప‌రిశోధించినా ప‌ట్టుకోలేక పోయాను. ఆ దొంగ‌ల్నే కాదు , నా బాల్యం, య‌వ్వ‌నం, జీవితంలో చాలా సంతోషాల్ని దోచుకున్న‌వాళ్లెవ‌రో ఇప్ప‌టికీ క‌నిపెట్ట‌లేక‌పోయాను.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి