iDreamPost

పవన్ – నాలుగు ఎన్నికలు.. నాలుగు పార్టీలు..

పవన్ – నాలుగు ఎన్నికలు.. నాలుగు పార్టీలు..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి ఎన్నికల్లో ఓ రికార్డు సృష్టించారు. ఏ పార్టీ అధినేత కూడా ఇప్పటివరకు తిరుపతి ఎన్నికల్లో తమ పార్టీకి కాకుండా వేరే పార్టీకి అది కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 ఎన్నికల్లో లో నాలుగు పార్టీలకు మద్దతుగా ప్రచారం చేయలేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం 2009 ఎన్నికలు నుంచి చూస్తే ఇప్పటివరకు నాలుగు పార్టీలకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. 2009లో తన అన్నయ్య ప్రజారాజ్యం పార్టీ తరపున ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత టిడిపి, బిజెపి, బి ఎస్ పి పార్టీలకు మద్దతుగా ప్రచారం నిర్వహించి రికార్డు సృష్టించారు.

స్థిరత్వంలేని రాజకీయ వ్యూహం..

తిరుపతి ఉప ఎన్నిక జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వైఖరి.. ఆయన అనుసరిస్తోన్న రాజకీయ వ్యూహాలకు అద్దం పట్టినట్టయింది. రాజకీయాల్లో నిలకడలేమి తనాన్ని, ఎలాంటి స్థిర నిర్ణయాలను తీసుకోలేకపోతోన్న పవన్ కల్యాణ్ ఆలోచనా విధానాన్ని ప్రస్ఫూటింపజేస్తున్నట్టయింది. గాలివాటంగా ఆయన రాజకీయ ప్రయాణం సాగుతోందనడానికి ఉదాహరణగా నిలిచినట్టయింది. తన అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా తొలిసారిగా రాజకీయ తెరపై కనపించిన పవన్ కల్యాణ్.. ఈ 12 ఏళ్లలో ఎన్ని పార్టీలకు మద్దతుగా ప్రచారం సాగించారో తెలియజేయడానికి తిరుపతి ఉప ఎన్నిక కారణమౌతోంది.

తొలిసారిగా ప్రజారాజ్యం తరఫున..

ప్రజారాజ్యం తరపున పవన్ కల్యాణ్ తొలిసారిగా తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో చిరంజీవి.. తిరుపతి నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. ప్రజారాజ్యం అనుబంధ విభాగం యువరాజ్యం అధ్యక్షుడి హోదాలో చిరంజీవి గెలుపు కోసం పవన్ కల్యాణ్ పర్యటించారు. ప్రజారాజ్యానికి ఓటేయాలంటూ పిలుపునిచ్చారు. ప్రతి డివిజన్‌లోనూ ఆయన పర్యటించారు. ఆ ఎన్నికలో చిరంజీవి ఘన విజయం సాధించారు. అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డిపై 15 వేలకు పైగా ఓట్ల తేడా గెలిచారు. తిరుపతిలో మెజారిటీ సంఖ్యలో ఉన్న బలిజ సామాజిక వర్గ ఓటుబ్యాంకు ఇప్పటికీ కొణిదెల కుటుంబం వైపే ఉందనే అభిప్రాయాలు లేకపోలేదు.

2014లో టీడీపీకి..

ప్రజారాజ్యం ఉనికిని కోల్పోవడం, క్రీయాశీలక రాజకీయాల నుంచి చిరంజీవి దాదాపు తప్పుకొన్న తరువాత.. రాజకీయాల్లోకి పవన్ కల్యాణ్ వచ్చారు. జనసేన పేరుతో రాజకీయ పార్టీని నెలకొల్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తన అభిమానులను ఆయన నమ్ముకున్నారు. ఆయన పార్టీని ప్రకటించిన తరువాత.. ఎదురైన 2014 నాటి ఎన్నికల్లో పోటీ చేస్తారని భావించినా.. అది వాస్తవ రూపం దాల్చలేదు. 2014 నాటి సార్వత్రిక ఎన్నికల రేసులో నిల్చోలేదు. అయినప్పటికీ.. తెలుగుదేశం-బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు. ఆ పార్టీ తరఫున అదే తిరుపతిలో మరోసారి ఎన్నికల ప్రచారానికి వచ్చారు.

2019లో బీఎస్పీ, కమ్యూనిస్టుల కోసం

అయిదేళ్ల తరువాత.. 2019 నాటి ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పార్టీ బరిలో నిలిచింది. మతతత్వ పార్టీ అంటూ బీజేపీని దూరం పెట్టారు. పాచిపోయిన లడ్డూలంటూ ఆ పార్టీ నేతలను ఎద్దేవా చేశారు. 2014లో తాను మద్దతిచ్చిన టీడీపీ-బీజేపీపై సమరానికి దిగారు. బహుజన సమాజ్‌వాది పార్టీ, సీపీఐ, సీపీఎంలతో జట్టు కట్టారు. పొత్తులో భాగంగా తిరుపతి లోక్‌సభ స్థానాన్ని బీఎస్పీకి కేటాయించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతితో కలిసి అదే తిరుపతిలో లోక్‌సభ ఎన్నికల్లో పాల్గొన్నారు. బహిరంగ సభలను నిర్వహించారు. నాటి ఎన్నికల ఫలితాలేమిటనేది తెలిసిన విషయమే.

రెండేళ్లు తిరిగే సరికి బీజేపీ కోసం..

సరిగ్గా రెండేళ్లు తిరిగే సరికి పవన్ కల్యాణ్ మళ్లీ ఎన్నికల ప్రచారానికి అదే తిరుపతికి వచ్చారు.. ఈ సారి బీజేపీ తరపున. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక బరిలో నిల్చున్న రత్నప్రభ కోసం ఈ నెల 3వ తేదీన ఆయన బహిరంగ సభను నిర్వహించారు. ఏ బీజేపీ నేతలపైన ఆయన పాచిపోయిన లడ్డూలంటూ నిప్పులు చెరిగారో.. అదే బీజేపీ నేతలతో చేతులు కలిపారు.. వేదికను పంచుకున్నారు. 2009-2021 మధ్యకాలంలో ఒక్క తిరుపతిలో పవన్ కల్యాణ్.. నాలుగు పార్టీల తరఫున ప్రచారం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒక్క ప్రజారాజ్యం మినహా.. తన సొంత పార్టీకి చెందని అభ్యర్థి కోసం పవన్ కల్యాణ్ కష్టపడటం కొసమెరుపు.

Also Read : తిరుపతిలో పవన్ ప్రచారం.. ఏం చెప్పి ఓట్లు అడుగుతారు?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి