iDreamPost

టీడీపీ ఎమ్మెల్సీని బహిష్కరించిన సొంత గ్రామం

టీడీపీ ఎమ్మెల్సీని బహిష్కరించిన సొంత గ్రామం

ఆయనో ఎమ్మెల్సీ. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు. అలాంటి వ్యక్తి తనసొంత గ్రామ ప్రజలచేతిలో బహిష్కరణకు గురయ్యారు. ఆ ఎమ్మెల్సీ ఎవరో కాదు.. బీద రవిచంద్ర. సొంత గ్రామమే ఓ ప్రజా ప్రతినిధిని బహిష్కరించడం ఆంధ్రప్రదేశ్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

ఇంతకీ ఏం జరిగిందంటే…

బీద రవిచంద్రది నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు మండలం ఇస్కపల్లి. ఈ పంచాయతీ పరిధిలోనే ఇస్కపల్లి పాలెం గ్రామం ఉంది. ఇస్కపల్లిలో మంగళవారం నుంచి పురాతన శివాలయం పునఃప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇస్కపల్లిపాలెం మత్స్యకారులు 300 మంది కలశాలతో సముద్రపునీటిని తెచ్చి శివునికి అభిషేకం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమం కోసం మత్య్సకారులందరూ ఒకే రకమైన వస్త్రాలు దరించి సముద్రానికి వెళ్లారు. ఆ సమయంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర గ్రామం, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని గ్రామస్తులు ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి దరిద్రపు గ్రామం తాను ఎక్కడూ చూడలేదంటూ బీద రవిచంద్ర మాట్లాడడంతో.. మహిళలు, గ్రామస్తులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయారు.

రవిచంద్రతో మాట్లాడితే 10వేలు జరిమానా..

విద్యార్థి దశ నుంచి నేటి వరకు గ్రామాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయంగా రవీచంద్ర ఎదిగారు. గత మూడుపర్యాయాలు పంచాయతీలో టీడీపీదే ఆధిపత్యం. ఇతరపార్టీల వారికి కనీసం ఏజెంటు కూడా ఉండరు. 2018లో కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌ రెడ్డి గ్రామ పర్యటనకు వచ్చేందుకు సిద్ధమవగా గ్రామ పొలిమేర్లలోనే గ్రామస్తులతో కలసి రవిచంద్ర అడ్డుకున్నారు. ఆ స్థాయిలో గ్రామం బీద రవిచంద్రకు అండగా నిలిచింది. ఇంత చేసిన తమను అవమానించడంతో.. గ్రామస్తులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ఈ క్రమంలోనే గ్రామస్తులందరూ సమావేశమై రవిచంద్ర తీరుపై చర్చించుకున్నారు. అనంతరం ఓ నిర్ణయానికి వచ్చారు. ఇకపై బీద రవి చంద్రతో ఎవరూ మాట్లాడకూడదని తీర్మానం చేసుకున్నారు. ఈ కట్టుబాటను అతిక్రమించి అతనితో నేరుగా మాట్లాడిన వారికి పది వేల రూపాయలు, ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిస్తే మూడువేల రూపాయల జరిమానా విధించుకునేలా తీర్మానం చే సుకున్నారు.

బీద రవిచంద్ర విద్యార్థి నేతగా రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీలో అంచెలంచెలుగా ఎదిగారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. ప్రస్తుతం టీడీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీగా ఉన్నారు. 2009, 2014, 2019 ఎన్నికల్లో ఇస్కపల్లి పంచాయతీలో రవిచంద్ర ఏమి చేబితే అదే జరిగేది. ప్రజలందరూ రవిచంద్రకుకు అనుకూలంగా ఉన్నారు. ఆయా ఎన్నికల్లో టీడీపీకి గుంపగుత్తగా ఓట్లు వేశారు. అలాంటిది రవిచంద్ర గ్రామంపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో  గ్రామ ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. కాగా. ఈ విషయంలో బీద రవిచంద్ర మీడియతో మాట్లాడుతూ.. తన మాటలను గ్రామస్తులు అపార్థం చేసుకున్నారని చెప్పుకొస్తున్నారు. త్వరలో వారితో నేరుగా మాట్లాడతానంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి