iDreamPost

ఎస్ఈసీ తొలగింపు వ్యవహారం.. హైకోర్టు కీలక నిర్ణయం..

ఎస్ఈసీ తొలగింపు వ్యవహారం.. హైకోర్టు కీలక నిర్ణయం..

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపుపై దాఖలైన పిటిషన్లను ఈరోజు హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. తనను ఎస్ఈసీగా తొలగించడంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో శనివారం పిటిషన్ దాఖలు చేశారు. ఆయనతోపాటు మరో ఐదుగురు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరు పిటిషన్లపై ఈరోజు ధర్మాసనం విచారణ జరిపింది. పూర్వాపరాలను విచారించిన ధర్మాసనం ఈ నెల 16వ తేదీ నాటికి అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.

కాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు రాష్ట్ర ప్రభుత్వం కుదిస్తూ ఆర్డినెన్సును జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేశారు. ఫలితంగా ఇప్పటికే నాలుగేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న నిమ్మగడ్డ రమేష్కుమార్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆయన స్థానంలో మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి కనగరాజు ను రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎస్సీ గా నియమించిన విషయం నియమించింది. ఆయన బాధ్యతలు చేపట్టారు. తనను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమంటూ రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై అధికార వైసిపి, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడినప్పటికీ నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అంతరం పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా ఏకపక్షంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఆక్షేపించింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ కార్యక్రమాల్లో జరిగిన చెదురు మదురు ఘటనలు, ఏకగ్రీవాల పై ఆక్షేపిస్తూ రమేష్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడంతో ఈ వివాదం మరింత రాజుకుంది. రమేష్ కుమార్ టిడిపి పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని వైసిపి విమర్శలు చేసింది. ఇది చివరికి చినికిచినికి గాలివానగా మారి రమేష్ కుమార్ పదవికి ఎసరు తెచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి