iDreamPost

ఆంధ్ర‌జ్వోతి ఎడిట‌ర్‌కు హైకోర్టు నోటీసులు-మ‌ధ్యంతర ఉత్తర్వులిచ్చిన న్యాయ‌స్థానం

ఆంధ్ర‌జ్వోతి ఎడిట‌ర్‌కు హైకోర్టు నోటీసులు-మ‌ధ్యంతర ఉత్తర్వులిచ్చిన న్యాయ‌స్థానం

ఆంధ్ర‌జ్వోతి దిన‌ప‌త్రిక ఎడిట‌ర్‌కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ మేర‌కు రాష్ట్ర ఉన్న‌త న్యాయ‌స్థానం మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇచ్చింది. ప్రాథమిక విచారణ జరపకుండా కేవలం పత్రికలో వచ్చిన వార్తా కథనం ఆధారంగా ఓ కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేయడంపై హైకోర్టు స్పందించింది. సస్పెండ్‌ చేస్తూ కర్నూలు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ జారీచేసిన ప్రొసీడింగ్స్‌ అమలును నిలుపుదల చేసింది. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటర్, ఎక్సైజ్‌ కమిషనర్, డిప్యూటీ కమిషనర్‌ తదితరులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ దొనడి రమేశ్‌ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.

కర్నూలు జిల్లా నంద్యాలలో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తనపై ఆంధ్రజ్యోతి దినపత్రిక తప్పుడు కథనం ప్రచురించిందని, అయితే ఉన్నతాధికారులు విచారణ జరపకుండా కేవలం పత్రికా కథనం ఆధారంగా తనను సస్పెండ్‌ చేశారంటూ కె.బలరాముడు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ విచారణ జరిపి.. కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేస్తూ జారీచేసిన ప్రొసీడింగ్స్‌ అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.

మ‌రోవైపు ఇదే క‌ర్నూల్‌లో ఇటీవ‌లి నిషేధిత సరుకుతో పట్టుబడిన‌ ఆంధ్ర‌జ్వోతి ప్ర‌తిక‌కు సంబంధించిన వాహ‌నం సీజ్ చేయ‌బ‌డింది. ఆంధ్రజ్యోతి దిన పత్రిక రవాణా వాహనంలో అక్రమంగా గుట్కా ప్యాకెట్లు తరలిస్తుండగా బొమ్మలసత్రం రూరల్‌ పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. క‌ర్నూల్‌కు చెందిన వీరబ్రహ్మేంద్ర ఆచారి కొంతకాలంగా తుపాన్‌ వాహనంలో ఆంధ్రజ్యోతి దినపత్రిక కాపీలను రవాణా చేస్తున్నాడు. ఇదే క్రమంలో కర్నూలుకు చెందిన గుట్కా వ్యాపారి సుబ్బయ్యతో పరిచయం ఏర్పడటంతో అదే వాహనంలో గుట్కాపాకెట్లను ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేవాడు. జూన్ 1న‌ తెల్లవారుజామున పత్రికల మధ్య రెండు గుట్కా ప్యాకెట్ల బస్తాలను దాచుకుని నంద్యాలకు బయలుదేరాడు.

డిఎస్పీ చిదానందరెడ్డి, సిఐ దివాకర్‌రెడ్డి సిబ్బందితో స్థానిక ఆటోనగర్‌ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండటాన్ని గమనించిన వీరబ్రహ్మేంద్ర ఆచారి పోలూరు గ్రామం వైపు వాహనాన్ని మల్లించాడు. ఎస్‌ఐ తిమ్మారెడ్డి వాహనం వెంటపడటంతో నిందితుడు తప్పించుకునేందుకు ప్రయత్నం చేసి చివరకు విఫలమయ్యాడు. నిందితున్ని విచారించగా పట్టణానికి చెందిన నాగేంద్రబాబుకు గుట్కాపాకెట్లు సరఫరా చేస్తున్నట్లు అంగీకరించాడు. వాహనంతో పాటు గుట్కా పాకెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి