iDreamPost

గాంధీ- గాడ్సే కలసి పనిచేయలేరు…

గాంధీ- గాడ్సే కలసి పనిచేయలేరు…

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జెడియు బహిష్కృత నేత ప్రశాంత్ కిషోర్ తన తదుపరి కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. తానూ ఏ పార్టీలోనూ చేరబోనని, తన జీవితంలో మిగిలిన సమయాన్ని మొత్తాన్ని బీహార్ అభివృద్ధికే వెచ్చిస్తానని తెలిపారు. బిహార్‌ యువత బలమైన నాయకత్వాన్ని కోరుకుంటోందని ఆయన అభిప్రాయ పాడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ రాజకీయ పార్టీతో సంభంధం లేకుండా “బాత్ బీహార్ కీ..” పేరుతొ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్టు తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు 100 రోజుల పాటు రాష్ట్రమంతా పర్యటిస్తానని చెప్పారు. ఈ బాత్ బీహార్ కీ కార్యక్రమం ద్వారా కోటి మంది యువత అభిప్రాయాలను సేకరించడమే లక్ష్యంగా ఫిబ్రవరి 20 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జెడియు అధినేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తనకు తండ్రి లాంటివారు అంటూనే ఆయన ఎన్డీయే లో కలవడం పైనా ప్రశాంత్ కిషోర్ తీవ్రంగా మండిపడ్డారు. తనను పార్టీ నుంచి బహిష్కరించినందుకు జనతాదళ్‌ చీఫ్‌, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ను ప్రశ్నించబోనని స్పష్టం చేశారు. తనకు ముఖ్యమంత్రి తో సత్సంబంధాలే ఉన్నాయని, ఆయన మీద అపారమైన గౌరవం కూడా ఉందని పేర్కొన్నారు. అదే సమయంలో పార్టీ సిద్ధాంతం గురించి నేను, నితీశ్‌ తో చాలా సార్లు చర్చలు జరిపాను. గాంధీజీ ఆశయాలను పార్టీ ఎన్నటికీ వీడదని ఆయన నాతో చెప్పారు. కానీ గాంధీజీని హతమార్చిన నాథూరాం గాడ్సేకు అనుకూలంగా ఉన్న వ్యక్తులతో నితీష్ చేతులు కలిపారు. అయితే నాకు తెలిసినంత వరకు గాంధీ గాడ్సేలు ఇద్దరు కలసి చేతులు కలపరు కదా అని నితీష్ కి చురకలు అంటించారు.

కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా రిజిస్టర్‌(ఎన్‌పీఆర్‌)పై ప్రశాంత్‌కిషోర్‌ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఏఏ, ఎన్నార్సీకి మద్దతుగా నిలిచిన జేడీయూ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ ప్రశాంత్‌ కిషోర్‌ను బహిష్కరించింది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పరిణామాలు రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్‌ కిషోర్‌ మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

నితీష్ కేంద్రం ముందు తలవంచి, వారితో కలసి పోపొట్టు పెట్టుకున్నప్పటికీ బీహార్ పరిస్థితిలో మార్పు రావడం లేదు. గత పదిహేనేళ్లుగా బీహార్ లో అభివృద్ధి లానే వుంది. నితీశ్‌ ఆధ్వర్యంలో రాష్ట్రం కొంత అభివృద్ధి చెందడం చూశాం. కానీ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇది తక్కువే. మహారాష్ట్ర, కర్ణాటకలతో పోలిస్తే బిహార్‌ ఇప్పుడు ఎక్కడ ఉంది?? అని నితీశ్‌ కుమార్‌, బీజేపీ దోస్తీపై ప్రశాంత్ కిషోర్ విమర్శలు గుప్పించారు.

అదే విధంగా తనపై వస్తున్న విమర్శలపై ప్రశాంత్ కిషోర్ స్పందిస్తూ ‘నేనెక్కడికీ వెళ్లడం లేదు. ఇక్కడే ఉంటానని, బిహార్‌ కోసం పనిచేస్తాను. బిహార్‌ అభివృద్ధిని కోరుకునే వారు రాష్ట్రాన్ని బలోపేతం చేయడానికి ‘బాత్‌ బిహార్‌ కీ’లో పాల్గొనండి అని పిలుపునిచ్చారు. నితీశ్‌ పాలనలో రాష్ట్రం చాలా అభివృద్ధి చెందిందని కానీ ప్రస్తుతం ఆయన కొత్త స్నేహాలు ఇందుకు ఏమాత్రం ఉపయోగపడటం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి