iDreamPost

బాబు ఆశలపై నీళ్లు జల్లుతున్న గల్లా కుటుంబం, అక్కడ పోటీకి ససేమీరా అంటున్న జయదేవ్

బాబు ఆశలపై నీళ్లు జల్లుతున్న గల్లా కుటుంబం, అక్కడ పోటీకి ససేమీరా అంటున్న జయదేవ్

ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న నాయకుల్లో సొంత నియోజకవర్గాన్ని కాపాడుకోలేకపోయిన పెద్ద నాయకుడు దాదాపుగా చంద్రబాబు నాయుడు ఒక్కరే ఉంటారు. టీడీపీ లో మిగిలిన నేతలు కూడా చాలామంది తమ సొంత నియోజకవర్గాల్లో అంతో ఇంతో పట్టు సాధించారు. కానీ చంద్రబాబుకి మాత్రం నారావారిపల్లె కి చెందిన ఎమ్మెల్యేని మాత్రం ఎక్కువమార్లు గెలిపించుకోవడంలో విఫలమయ్యారు. గడిచిన రెండు దశాబ్దాలుగా టీడీపీ విజయం మొఖం చూడని సీట్లలో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉంటుంది. దాంతో చంద్రబాబు వచ్చే ఎన్నికల కోసం కొత్త వ్యూహాలతో వెళ్లాలని ఆశించారు. కానీ ఇప్పుడు అవి నెరవేరేలా కనిపించడంలేదు.

గల్లా కుటుంబానికి చంద్రగిరి నియోజకవర్గంలో ఒకప్పుడు గట్టి పట్టుండేది. రాజగోపాలనాయుడి అండదండలతోనే చంద్రబాబు రాజకీయ ఆరంగేట్రం కూడా చేశారు. ఆ తర్వాత తనకు ఆసరగా నిలిచిన గల్లా కుటుంబాన్ని అణగదొక్కాలని చూడడంతో గల్లా అరుణకుమారి సీన్ లోకి వచ్చారు. చంద్రబాబుకి చెక్ పెట్టారు. వైఎస్సార్ ఆశీస్సులతో సత్తా చాటారు. తర్వాత క్యాబినెట్ మంత్రిగానూ పనిచేశారు. చివరకు రాష్ట్ర విభజనతో మళ్లీ ఆమె టీడీపీ పక్షాన చేరారు. గల్లా కుటుంబ వారసత్వంతో కుమారుడు జయదేవ్ తెరమీదకు వచ్చారు. ఆయన గుంటూరు నుంచి పార్లమెంట్ కి బరిలో దిగి వరుసగా రెండు ఎన్నికల్లో గట్టెక్కారు.

వచ్చే ఎన్నికల్లో జయదేవ్ ని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దింపాలని చంద్రబాబు ఆశించారు. వరుసగా రెండు ఎన్నికల్లోనూ గెలిచిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ పాగా వేశారు. ఆయన్ని ఎదుర్కోవడంలో పులివర్తి నాని సరిపోవడం లేదని చంద్రబాబు భావిస్తున్నట్టు ప్రచారం సాగింది. దాంతో ఆర్థికంగానూ, కుటుంబపరంగానూ విస్తృతస్థాయి కలిగిన జయదేవ్ తగినవాడని చంద్రబాబు అంచనా వేసినట్టు కనిపించింది. కానీ తీరా చూస్తే తాము చంద్రగిరి బరిలో దిగేందుకు సిద్ధంగాలేమని గల్లా కుటుంబం అధినేతకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. తమ పేరు ఆ నియోజకవర్గంలో ప్రచారం సాగుతోందని, దానికి అధినేత చెక్ పెట్టాలని కోరినట్టు సమాచారం.

భవిష్యత్తులో పునర్విభజన తర్వాత తిరుపతి లేదా చిత్తూరు పార్లమెంట్ సీట్లలో ఒకటి జనరల్ స్థానంగా మారితే అప్పుడు ఏదో ఓ సీటు నుంచి బరిలో దిగే ప్రయత్నం చేస్తాం గానీ అసెంబ్లీ ఆలోచన తమకు లేదని గల్లా జయదేవ్ తేల్చడంతో చంద్రబాబు మరోసారి పులివర్తి నానినే ఆశ్రయించాల్సి వచ్చేలా ఉంది. దాంతో చెవిరెడ్డిని ఎదుర్కోవడం ఎలా అన్నది అంతుబట్టని అంశంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి