iDreamPost

హార్బర్లు నిర్మాణానికి నిధుల గండం

హార్బర్లు నిర్మాణానికి నిధుల గండం

మత్స్యకారుల విషయంలో ఏపీ ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తోంది. సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించే దిశలో ఆలోచనలు సాగిస్తోంది. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు రచిస్తోంది. ఏటా ఉత్తరాది జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం నుంచి వేల మంది మత్స్యకారులు గుజరాత్ సహా పలు పశ్చిమ తీర రాష్ట్రాలకు వలసలు వెళుతున్నారు. ఇటీవల లాక్ డౌన లో కూడా అలా చిక్కుకుపోయిన మత్స్యకారుల సమస్య పెద్ద ఇబ్బందికరంగా మారింది. ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం బస్సు, భోజనం సహా పలు సదుపాయాలు ఏర్పాటు చేసి వారిని తరలించాల్సి వచ్చింది.

ఇక మత్స్యకారుల వలస జీవనానికి అసలు సమస్యను జగన్ గుర్తించారు. తన పాదయాత్రలోనే అందుకు తగ్గట్టుగా హామీ ఇచ్చారు. వలసలు వెళ్లాల్సిన అవసరం రాకుండా బంగాళాఖాతం తీరంలోనే వేటకు వెళ్లేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అందులో భాగంగా హార్బర్లు, జెట్టీల నిర్మాణానికి తగ్గట్టుగా ప్రయత్నాలు ప్రారంభించారు. విశాఖ నుంచి ఒడిశాలోని పారాదీప్ వరకూ మధ్యలో ఒక్క హార్బర్ కూడా లేకపోవడంతో చేపల వేట సాగడం లేదని సతమతం అవుతున్న మత్స్యకారులకు ఊరట కల్పించేలా ఏపీలో కొత్తగా 9 మినీ హార్బర్ల నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పలు చోట్ల జెట్టీల నిర్మాణానాలకు కూడా అనుమతులు ఇచ్చారు.

దానికి తగ్గట్టుగా శ్రీకాకుళం జిల్లాలో ఎద్దువానిపాలెం, బుడగట్లపాలెం లో కొత్తగా హార్బర్లు నిర్మించాలని నిర్ణయించారు. వాటితో పాటుగా ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం ఫేజ్ 2, జువ్వలదిన్నె, కొత్తపట్నం లలో కూడా పూర్తి చేయాలని సంకల్పించారు రూ.2,902 కోట్ల వ్యయం అయ్యే వాటికి తొలిదశలో రూ. 1404 కోట్ల కేటాయింపునకు అంతా సిద్ధం చేశారు. అయితే ఈ విషయంలో కేంద్రం నుంచి రావాల్సిన సహాయానికి కొర్రీలు పడడంతో జగన్ ప్రభుత్వ ప్రయత్నాలకు అడ్డుపుల్లగా మారింది. సముద్రంలో వేటకు అనుగుణంగా జెట్టీలు, మినీ హార్బర్ల నిర్మాణం విషయంలో కేంద్రం నుంచి కనీసంగా రూ.600 కోట్ల నిధులు రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికి వాటిని కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్దం లేదని తేలడంతో ఏపీ ప్రభుత్వం పునరాలోచన చేస్తోంది. మత్స్యకారులకు అండగా ఉండేందుకు వాటిని పూర్తిచేయాలనే లక్ష్యంతో ఉన్న జగన్ నిధుల సమీకరణ విషయంలో ఎలా అన్నది ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్రం మత్స్యకారుల విషయంలో కూడా మొండిచేయి చూపడం విశేషంగా మారింది. అయినా ముందుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి