iDreamPost

తండ్రి ముఖ్యమంత్రి.. కొడుకు మంత్రి

తండ్రి ముఖ్యమంత్రి.. కొడుకు మంత్రి

భారతదేశంలో వారసత్వ రాజకీయాలు అన్ని జాతీయ,ప్రాంతీయ పార్టీలకు విస్తరించింది. గతంలో కాంగ్రెస్ వారసత్వ రాజకీయాల మీద తీవ్రమైన విమర్శల చేసిన పార్టీలన్నీ ఇప్పుడు నాయకుల వారసులను అందలం ఎక్కించినవే.

వారసత్వ రాజకీయాలకు పుట్టినిల్లు లాంటి కాంగ్రెస్ లో తండ్రులు, వారసులు ఒకేసారి పదవులు చేపట్టలేదు. నెహ్రు తరువాత ఇందిరా, ఇందిరా తరువాత రాజీవ్ ప్రధానులు అయ్యారు. రాష్ట్రాలలో కూడా ఒకే కేబినెట్లో తండ్రులు వారి వారసులు మంత్రులుగా పనిచేయలేదు. ఒక దశాబ్దం కిందటి వరకు తండ్రులు రాజకీయ విరమణ చేసిన తరువాత వారసుల రంగప్రవేశం జరిగేది. కానీ 2009 నుంచి తండ్రులు ముఖ్యమంత్రులుగా ఉండగానే కొడుకులు ఆ మంత్రివర్గంలో మంత్రులు అయ్యే సాంప్రదాయం మొదలైంది. ఈకోవకు చెందిన నాయకులు దేశంలో పలువురు ఉన్నారు.

ప్రకాష్ సింగ్ బాదల్ – సుఖ్బీర్ సింగ్ బాదల్ -పంజాబ్-2009

2007 పంజాబ్ ఎన్నికల్లో బీజేపీ – ఆకాళీ దళ్ కూటమి ఘన విజయం తర్వాత ప్రకాష్ సింగ్ బాదల్ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటికే 80 సంవత్సరాల వృదుడైన బాదల్ పార్టీని మరియు ప్రభుత్వాన్ని నడపటానికి ఇబ్బంది పడేవాడు. ప్రకాష్ సింగ్ బాదల్ కొడుకు సుఖ్బీర్ సింగ్ బాదల్ 1996లో రాజకీయ రంగప్రవేశం చేసి 1996,1998 లోక్ సభ ఎన్నికల్లో గెలిచి 1999 ఎన్నికల్లో ఓడిపోయాడు. 2001లో రాజ్యసభకు ఎన్నికయ్యాడు. సుఖ్బీర్ 1998-1999 మధ్య వాజ్ పాయ్ కేబినెట్లో మంత్రిగా పనిచేశాడు. 2004 ఎన్నికల్లో సుఖ్బీర్ మరోసారి లోక్ సభ కు ఎన్నికయ్యాడు. ప్రకాష్ సింగ్ బాదల్ 2008లో కొడుకు సుఖ్బీర్ కు అకాలీదళ్ అధ్యక్షపదవి అప్పగించి 2009లో ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా ఇచ్చాడు. ఐతే ఏ సభలోనూ సుఖ్బీర్ సింగ్ ఆరు నెలల్లో ఎన్నిక కావడానికి ఒక్క అసెంబ్లీ స్థానం కూడా కాళిగా లేకపోవడంతో జులై మొదటి వారంలో మంత్రి పదవికి రాజీనామా చేసి తిరిగి ఆగస్టు లో పదవి చేపట్టారు. ఆ తర్వాత జలాలాబాద్ కు జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి ఆ పదవిలో కొనసాగారు. భారత దేశ చరిత్రలో తండ్రి ముఖ్యమంత్రిగా ,కొడుకు మంత్రి గా పనిచేసిన తొలి ద్వయం వీరే.

కరుణానిధి-స్టాలిన్- తమిళనాడు-2009

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి స్టాలిన్‌ మూడో కుమారుడు. 1953 మార్చి 1న మద్రాసులో జన్మించారు. ఈయన పుట్టిన నాలుగు రోజుల తర్వాతే రష్యా అధ్యక్షుడు స్టాలిన్‌ మరణించారు. వామపక్ష భావాలపై ఉన్న మమకారంతో కరుణానిధి తన తనయుడికి స్టాలిన్‌ అని పేరు పెట్టారు. స్టాలిన్‌ చిన్నప్పటి నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. 14ఏళ్లకే రాజకీయాల్లోకి అడుగుపెట్టి 1967 ఎన్నికల్లో తండ్రి తరఫున ప్రచారం చేశారు.

1973లో డీఎంకే జనరల్‌ కమిటీకి స్టాలిన్‌ ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన జైలుకెళ్లడంతో స్టాలిన్‌ పేరు వార్తల్లో నిలిచింది. తమిళనాడు అసెంబ్లీని స్టాలిన్ నాలుగుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.1989లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1996లో ఒకసారి, 2002లో మరోసారి చెన్నై మేయర్‌గా పనిచేశారు. దీంతో ఆయనకు పరిపాలన మీద మంచి అవగాహన వచ్చింది. 2006లో మున్సిపల్ మంత్రిగా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత 2009లో డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు. మరోవైపు పార్టీలో కూడా తన పట్టు పెంచుకుంటూ వచ్చారు..

కాగా, కరుణానిధి తర్వాత పార్టీ బాధ్యతలు ఎవరు చేపడుతారన్న సందిగ్ధత డీఎంకే శ్రేణుల్లో చాలా కాలం పాటు ఉంది. అయితే ఈ సందిగ్ధతను తొలగిస్తూ స్టాలినే తన రాజకీయ వారసుడంటూ 2013 జనవరిలో కరుణానిధి ప్రకటించారు. దీనిని నిరసిస్తూ కరుణానిధి మరో కుమారుడు స్టాలిన్ అన్న అళగిరి తిరుగుబాటు చెయ్యటంతో కరుణానిధి ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు. ఆ తర్వాత 2017లో స్టాలిన్‌ డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. కరుణ మరణం తర్వాత స్టాలిన్ పార్టీ పూర్తిస్థాయి అధ్యక్షుడిగా బాధ్యతలు చేబట్టారు. 2019 తమిళనాడు లోకసభ ఎన్నికల్లో యూపీఏ కూటమితో జతగట్టి 40 పార్లమెంటు స్థానాలకు గాను 39 స్థానాలను కైవసం చేసుకుని తన నాయకత్వ సమర్థతను నిరూపించుకున్నారు…

కెసిఆర్-కేటీఆర్-తెలంగాణ-2014

తన తండ్రి కేసీఆర్‌ బాటలో కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 2009 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీచేసి, తన సమీప ప్రత్యర్థి (స్వతంత్ర అభ్యర్థి) కేకే మహేందర్‌రెడ్డిపై 171 ఓట్ల మెజార్టీతో గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టాడు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరిగి 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 68,219 ఓట్ల భారీ మెజార్టీతో రెండోసారి గెలుపొందాడు.

2014 ఎన్నికల్లో తెరాస గెలిచి కెసిఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ మంత్రి వర్గంలో KTR ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి అయ్యారు. 2018 ఎన్నికల్లో మరోసారి తెరాస గెలిచినా KTR కు పది నెలల తరువాత గత సెప్టెంబర్ లో మంత్రి పదవి దక్కింది. KTR మంత్రి పదవితో పాటుగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా బాధ్యతలను నిర్వహిస్తున్నాడు.

చంద్రబాబు నాయుడు -నారా లోకేష్-ఆంధ్రప్రదేశ్-2017

1995లో తొలిసారి ముఖ్యమంత్రి అయినా రోజుల్లో వారసత్వ రాజకీయాల మీద వివరీతమైన విమర్శలు చేసిన చంద్రబాబు నాకు ఒకడే కొడుకు, వాడికి చదువు చెప్పిస్తాను కానీ నా ఆస్తిలో హక్కు కూడా ఇవ్వను అని చెప్పేవాడు.

తనకు రాజకీయ వారసులు కూడా ఉండరు అని బలంగా చెప్పిన చంద్రబాబు 2014 ఎన్నికల్లో గెలిచినా తరువాత మాత్రం మొదట పార్టీ సభ్యత నమోదు బాధ్యతలు అంటూ పార్టీ ప్రధాన కార్యదర్శిని చేశాడు. 2017లో ఏకంగా మంత్రిని చేశాడు .

తెలుగుదేశం తొలినాళ్ళ ప్రచారాన్ని చూసినవారికి లోకేష్ వారసత్వ రాజకీయం మింగుడుపడదు. ఎంత వాదించినా సమయం వచ్చినప్పుడు రాజకీయ వారసత్వం అనివార్యం అని చంద్రబాబు ను చూస్తే అర్ధమవుతుంది.

ఉద్ధవ్ ఠాక్రే-ఆదిత్య ఠాక్రే – మహారాష్ట్ర-2019

శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల థాక్రే కానీ ఆయన కొడుకు ఉద్దవ్ థాక్రే కానీ మొన్న జరిగిన ఎన్నికల వరకు ఎప్పుడు పోటీచేసింది లేదు. 1995 లో ముఖ్యమంత్రి పదవి శివ సేనకు దక్కినప్పుడు కూడా మనోహర్ జోషిని ఆ పదవికి ఎంపిక చేశారు కానీ వారు స్వయంగా పీఠం ఎక్కాలని అనుకోలేదు. థాక్రే కింగ్ మేకర్ గా ఉండటానికే ఇష్ట పడ్డాడు.

మారిన పరిస్థితులు ,2014లో శివసేన తో పొత్తు లేకుండా బీజేపీ మహారాష్ట్ర ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించి ముఖ్యమంత్రి పదవిని చెప్పట్టడంతో శివ సేన అస్తిత్వానికి ముప్పు ఏర్పడింది. మతవాదానికి జాతీయ వాదం కూడా తోడవటంతో శివ సేన ఓట్ బ్యాంకు పునాదులు కదిలాయి. దీనితో కార్యకర్తలతో, ప్రజలలో నిత్యం కలిసి పనిచేయవలసిన అవసరాన్ని ఉద్దవ్ థాక్రే గుర్తించి తాం కొడుకు ఆదిత్య థాక్రేను రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు.

2019 అక్టోబర్ ఎన్నికల నాటికి బీజేపీ శివసేన విబేధాలను పరిష్కరించుకొని కలసి పోటీ చేసి గెలిచాయి. కానీ ముఖ్యమంత్రి పీఠం మీద
ఇరుపక్షాలు పట్టుపట్టంతో శివ సేన ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి మద్దతు ఇవ్వమని చెప్పింది. NCP నేత అజిత్ పవర్ పార్టీని చీల్చి బీజేపీకి మద్దతు ఇవ్వటంతో ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ అజిత్ పవార్ అనుకున్న సంఖ్యలో NCP ఎమ్మెల్యేలను చీల్చలేకపోవటంతో మూడు రోజులకే ఆ ప్రభుత్వం కూలిపోయింది.

కాంగ్రెస్-NCP మద్దతుతో శివసేన తరుపున ఉద్దవ్ థాక్రే ముఖ్యమంత్రి అయ్యాడు. మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినా ఉద్దవ్ తన కొడుకు ఆదిత్య థాక్రే ను ఉద్ధవ్ తన మంత్రి వర్గంలోకి తీసుకున్నాడు.

ఈ దశాబ్దంలో వారసత్వ రాజకీయాల పరాకాష్టకు తండ్రి మంత్రి వర్గంలో కొడుకులు మంత్రులు కావటం ఒక ఉదాహరణగా నిలుస్తుంది. అటు

బీజేపీ లో కూడా అనేక మంది నాయకుల కొడుకులు ఎమ్మెలేలు,ఎంపీ లు అయ్యారు. వీరికో కొందరు మంత్రులు కూడా అయ్యారు. బీజేపీ పార్టీ వయస్సు ఇప్పుడున్న నాయకుల అనుభవం తదితర కారణాల వలన ఇలా తండ్రి -కొడుకులు ఒకే మంత్రి వర్గంలో ఉండే అవకాశం లేదు కానీ భవిషత్తులో అలాంటి అవకాశం లేదని చెప్పలేము.

ఏమైనా వారసత్వ రాజకీయాలు ఇక ఏమాత్రం ఎన్నికల నినాదం అయ్యే అవకాశం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి