iDreamPost

పోరాటం ఆపేందుకు సిద్ధమైన ఉండవల్లి..!

పోరాటం ఆపేందుకు సిద్ధమైన ఉండవల్లి..!

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టబద్ధంగా జరగలేదని, ఏపీకి అన్యాయం జరిగిందని అనేకమంది మాట్లాడారు. వారిలో కొంతమంది చట్టసభల్లో మాట్లాడి ఆ తర్వాత మిన్నుకుండిపోయారు. మరికొంతమంది కోర్టుల్లో పిటీషన్లు దాఖలు చేసి ఆ తర్వాత మిన్నుకుండిపోయారు. అయితే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ మాత్రం రాష్ట్ర విభజన చట్టబద్ధంగా జరగలేదని, ఏపీకి అన్యాయం జరిగిందంటూ మొదలుపెట్టిన తన న్యాయపోరాటాన్ని 8 ఏళ్లుగా కొనసాగిస్తూనే ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ విభజన రాజ్యాంగ విరుద్ధమని ఉండవల్లి అరుణ్‌కుమార్‌ గతంలో సుప్రీంకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. దానిపై విచారణ జరుగుతోంది. ఓ వైపు కోర్టులో న్యాయపోరాటం చేస్తూనే.. మరోవైపు తన గళాన్ని మీడియా ద్వారా ఉండవల్లి వినిపిస్తున్నారు. తాజాగా ఉండవల్లి అరుణ్‌కుమార్‌ మరో పిటీషన్‌ సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. భవిష్యత్‌లో రాష్ట్రాల విభజన చేస్తే.. ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని పిటీషన్‌ దాఖలు చేశారు. ఇప్పటికే దాఖలుచేసిన పిటీషన్‌కు ఇది అనుబంధంగా వేశారు.

తన పిటీషన్‌పై విచారణ పూర్తయి.. ఏపీ విభజన రాజ్యాంగ విరుద్ధమని తీర్పువచ్చినా.. విభజన జరిగి 8 ఏళ్లు అయిన నేపథ్యంలో ఆ తీర్పును అమలుచేయడం సాధ్యం అయ్యే అవకాశాలు తక్కువగా ఉండడంతో ఉండవల్లి ఈ పిటీషన్‌ దాఖలు చేశారు. ఏపీ విభజన రాజ్యాంగ విరుద్ధమని తేలితే దాన్ని ప్రకటించాలని కోరిన ఉండవల్లి.. భవిష్యత్‌లో రాష్ట్రాల విభజనకు తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని విన్నవించారు. అంతేకాదు విభజన వల్ల నష్టపోయిన ఏపీకి కేంద్రం అన్ని విధాలుగా మద్ధతు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా ఉండవల్లి తన అనుబంధ పిటీషన్‌లో కోరారు.

ఏపీ విభజన చట్టం పార్లమెంట్‌లో పాస్‌ కాలేదని ఆది నుంచి ఉండవల్లి వాదిస్తున్నారు. అందుకు తగిన కారణాలు కూడా చెబుతున్నారు. కోర్టులో పిటీషన్‌ దాఖలు చేయడమే కాకుండా.. ఈ విషయంపై పార్లమెంట్‌లో మాట్లాడాలని వివిధ పార్టీలకు సూచించారు. తన మిత్రులను కోరారు. తన వాదనలకు అక్షరరూపం కూడా ఇచ్చి పుసక్తం తెచ్చారు. 2018లో టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వం నుంచి వైదొలిగిన తర్వాత.. చంద్రబాబును కలిసి ఈ విషయంపై పార్లమెంట్‌లో చర్చించాలని కోరారు. సుదీర్ఘకాలం న్యాయపోరాటం చేసిన ఉండవల్లి.. తన పిటీషన్‌పై అనుకూలమైన తీర్పు వచ్చినా.. దాని అమలు సాధ్యంకాదనే భావనతో.. రాబోయే రోజుల్లో ఏ రాష్ట్రాన్ని అయినా విభజించినప్పుడు సమస్యలు రాకుండా చూడాలని, అదే సమయంలో ఏపీకి న్యాయం చేసేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అనుబంధ పిటీషన్‌ దాఖలు చేయడంతో.. ఈ విషయంలో ఇక ఉండవల్లి తన పోరాటాన్ని ముగించదల్చుకున్నట్లు తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి