iDreamPost

పోలవరం ప్రాజెక్టు : ఉత్తరకుమారుడు ఎవరు..?

పోలవరం ప్రాజెక్టు :  ఉత్తరకుమారుడు ఎవరు..?

ఏదైనా ఒక అంశంపై రాజకీయం చేయాలనుకుంటే.. దాని గురించి తన అనుకూల మీడియాలో ఓ కథనం రాయించడం, ఆ తర్వాత దాన్ని పట్టుకుని ప్రెస్‌మీట్లు పెట్టి నానా హంగామా చేయడం తెలుగుదేశం పార్టీ నేతలకు బాగా అలవాటైన పని అన్న విషయం ఈ పాటికే అందరికీ అర్థం అయింది. కియా మోటార్స్‌ తరలిపోతోందంటూ గతంలో హడావుడి చేసినట్లుగానే… ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ రాజకీయం చేయాలని ప్రయత్నిస్తోంది. ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించాలని వైసీపీ ప్రభుత్వం యోచిస్తోందని, ఆ మేర నిర్వాసితులకు ఇచ్చే పరిహారం 27,500 కోట్ల నుంచి 3,500 కోట్లకు తగ్గించేందుకు ప్లాన్‌ చేసిందంటూ ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు రాయిచింది. ఆ కథనాలను పట్టుకుని తాజాగా ఇరిగేషన్‌ శాఖా మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మైక్‌ అందుకున్నారు. ఆంధ్రజ్యోతి కథనాలను పట్టుకుని వాటికి సీఎం జగన్‌ సమాధానాలు చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే క్రమంలో నిర్వాసితులకు రెండు దశల్లో పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది. మొదటి దశలో 41.15 మీటర్లు వచ్చే మార్చి నాటికి పూర్తి అవుతుందన్న అంచనాతో.. ఆ మేరకు నిర్వాసితులయ్యే వారికి పరిహారం అందించాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రెండో దశలో డిసెంబర్‌ నాటికి ప్రాజెక్టు పూర్తి ఎత్తు 45.72 మీటర్లు పూర్తవుతుందని, అంతకు ముందే రెండో దశలో మిగిలిన నిర్వాసితులకు పరిహారం చెల్లించేలా ప్రణాళికలు రచించింది. ఈ విషయమే జలవనరులశాఖ అధికారులు స్పష్టం చేస్తూన్నా.. తాము రాయించాలనుకున్నా విషయాన్నే టీడీపీ.. తన అనుకూల పత్రికలో రాయించి.. మళ్లీ దాన్ని ఆ కథనాలను పట్టుకుని పోలవరంలో ఏదోజరిగిపోతోందన్న భావనను ప్రజల్లో కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తారేమో.. ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తికాదేమోనన్న అనుమానాలు ప్రజల్లో కలిగేలా దేవినేని ఉమా స్వరం పెంచి పేద్ద పేద్ద గా మాట్లాడుతున్నారు.

సీఎం వైఎస్‌ జగన్, ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌లు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారంటూ దేవినేని ఉమా ఎద్దేవా చేశారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని మేమే కడతాం అంటూ కేంద్రం నుంచి తీసుకుని, రాసిపెట్టుకో జగన్‌.. 2018 మే నెల కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం.. అంటూ అసెంబ్లీలో నాడు ఇరిగేషన్‌ శాఖా మంత్రిగా ఉన్న దేవినేని ఉమా మాట్లాడిన మాటలు ఇంకా తెలుగు ప్రజలు మరచిపోలేదు. 2018 మే వెళ్లిపోయి రెండున్నర ఏళ్లు అవుతోంది. తాను ఈ మాట అన్నట్లు దేవినేని ఉమాకు కనీసం గుర్తుందో..? లేదో..? నేడు ఉత్తరకుమారుడు అంటూ సీఎం జగన్, ఇరిగేషన్‌ మంత్రి అనిల్‌కుమార్లను హేళన చేస్తూ.. 2018లో తాను అన్న మాటలను మరోసారి ప్రజలు గుర్తు చేసుకునేలా నోటికి పని చెబుతున్నారు.

తమ హాయంలో పోలవరం సోమవారం అంటూ.. ప్రాజెక్టు పనులను 71 శాతం పూర్తి చేశామని దేవినేని ఉమా చెబుతున్నారు. అంతకు ముందు ప్రాజెక్టు పనులు కనీసం 4 శాతం కూడా కాలేదని చెప్పుకొస్తున్నారు. 71 శాతం పోలవరం కట్టామంటున్న దేవినేని.. అందులో ఎగువ కాఫర్‌ డ్యాం ఉందన్న విషయం మరచిపోయినట్లుగా ఉన్నారు. ఆ కాఫర్‌ డ్యాం వల్లే గోదావరి వరదల సమయంలో గత ఏడాది, ఈ ఏడాది దేవీపట్నం ముంపునకు గురైంది. మరి వారికి పరిహారం ఇచ్చి ఖాళీ చేయించకుండానే కాఫర్‌ డ్యాం ఎలా కట్టామనే విషయం దేవినేనికి తోచనట్లుగా ఉంది.

నిర్వాసితులను గాలికి వదిలేశారంటున్న దేవినేని ఉమా.. ఇదే విషయం దేవీపట్నం వెళ్లి అక్కడ చెప్పి ప్రజల స్పందన చూస్తే టీడీపీకి ఎంతో మేలు జరుగుతుంది. నిర్వాసితుల గురించి ఈ రోజు ఆవేదన పడుతున్న దేవినేని ఉమా.. ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారి గురించి పట్టించుకోలేదన్న విషయం గుర్తుచేసుకుని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడునైనా.. వారి వద్దకు వెళ్లేందుకు సాహసం చేయడం లేదెందుకో అర్థం కావడం లేదు.

విజయవాడలో ప్రెస్‌మీట్‌లో చెప్పిన అంశాలనే పోలవరం ముంపు మండలాల్లో బహిరంగ సభ పెట్టి చెబితే.. ప్రభుత్వంపై ఒత్తిడి వస్తుంది. ప్రజలకు న్యాయం జరుగుతుందన్న విషయం దేవినేనికి తెలియంది కాదు. పత్రిపక్ష నేతగా ఉన్నప్పుడు సీఎం జగన్‌ ముంపు మండలాల్లో పర్యటించారు. బహిరంగ సభలో నిర్వాసితుల సమస్యలు ప్రస్తావించారు. ఇచ్చే పరిహారంలో జరుగుతున్న అన్యాయాన్ని నిలదీశారు. ఇదే మాదిరిగా దేవినేని ఉమా తమ నాయకుడు చంద్రబాబు చేతనో లేదా కరోనా వల్ల బాబు రాలేకపోతే.. దేవినేని ఉమానో వెళ్లి అక్కడ సభ పెడితే నిర్వాసితులకు ఎంతో మేలు చేసినవారవుతారనడంలో సందేహం లేదు. పైగా ప్రతిపక్ష పార్టీ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించారనే పేరు టీడీపీకి వస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి