iDreamPost

మోకాలికి.. బోడిగుండుకు.. ముడిపెట్టే ప్రయత్నం చేసి అభాసుపాలైన ఈనాడు.

మోకాలికి..  బోడిగుండుకు.. ముడిపెట్టే  ప్రయత్నం చేసి అభాసుపాలైన ఈనాడు.

ఈ రోజు ఈనాడు పత్రికలో అమరావతి, పోలవరం ఆగిపోవడం వల్ల విజయవాడ ఆటోనగర్ లో పనులు కుంటుపడ్డాయని ఆరోపిస్తూ ‘చెదిరిన చక్రం’ పేరుతొ ఒక కధానాన్ని పతాకశీర్షికగా అచ్చు వేశారు. ఈ కధనం ప్రకారం ప్రభుత్వం మారిన తర్వాత గత ఏడు నెలల నుండి అమరావతిలో అభివృద్ధి పనులు నిలిచిపోవడంతో, పోలవరం నిర్మాణం ఆగిపోవడంతో కొత్త వాహనాలకు బ్రేకులు పడ్డాయని, అందువల్ల ఆటోనగర్ లో పనుల్లేక కార్మికులు వలసపోతున్నారని ఈనాడు యాజమాన్యం తమదైన శైలిలో ఒక అసత్య కధనాన్ని వండి వార్చారు.

అసలు విషయానికొస్తే ‘ఆటోనగర్’ గా రాష్ట్రంలో అందరికి సుపరిచితమైన జవహార్ లాల్ నెహ్రు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఆటో మొబైల్ రంగంలో ఆసియాలో నే మొదటి అతిపెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్. విజయవాడ పటమట ప్రాంతంలో 1960 లో 54 ఎకరాల్లో ఈ సెజ్ ప్రారంభం అయింది. ప్రస్తుతం 276 ఎకరాల్లో విస్తరించి ఉంది. 1990లలో ఈ ఆటోనగర్ ప్రాంతాన్ని దాదాపు 334 ఎకరాల్లో కానూరు వరకు విస్తరించారు. షుమారు 65 వేల మంది కార్మికులు ఆటోనగర్ లో ఉపాధి పొందుతున్నారు. వీరి ద్వారా మరో 3 లక్షల మంది పరోక్షంగా ఈ ఆటోనగర్ పై ఆధారపడి బతుకుతున్నారు. ఈ ఆటోనగర్ లో మొత్తం ఆటోమోబైల్ కి సంబందించిన చాసిస్, బాడీ బిల్డింగ్, ట్రక్ బిల్డింగ్, పెయింటింగ్, టింకరింగ్, వాహనాల విడి భాగాలు, పాత ఇనుము, వాహనాల మెకానిక్ షెడ్లు, సర్వీసింగ్ షెడ్లు, ఇలా 2,100 వరకు చిన్న తరహా యూనిట్లు ఉండేవి. సంవత్సరానికి సాలీనా పదివేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగేది.

అయితే గత కొంత కాలంగా దేశవ్యాప్తంగా ఉన్న తీవ్ర ఆర్ధిక మాంద్యం వాహనరంగం పై కూడా బాగా ప్రభావం చూపుతుంది. ఇదే సమయంలో జియస్టి, పెద్దనోట్ల రద్దు వంటి ప్రభావం కూడా వాహన రంగం పై పడింది. దీనితో దేశంలో వాహన రంగం మునుపెన్నడూ లేనంత సంక్షోభం ఎదుర్కొంటుంది. వాస్తవానికి తాము తయారు చేస్తున్న కొత్త వాహనాలు ట్రక్కులకు బుకింగ్ లేక ప్రముఖ దిగ్గజ ఆటొమొబైల్ కంపెనీ అశోకా లై ల్యాండ్ వాహన ధరలను భారీగా తగ్గించింది. అంతేకాకా కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి 5 లక్షల వరకు వడ్డీ లేని ఋణం కూడా ఇస్తుంది. ప్రస్తుతం దేశ వాహనరంగంలో ఉన్న సంక్షోభం దృష్యా వార్షిక సామర్ధ్యం తగ్గించి ఉత్పత్తి చెయ్యాల్సి వస్తుందని స్వయంగా టాటా అశోకా లై ల్యాండ్ వంటి కంపెనీలే ప్రకటించాయి. ఆటోమొబైల్ రంగంలో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారని ప్రభుత్వ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఇక రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితులు చూస్తే తీవ్ర మానవవనరుల కొరత, డ్రైవర్లు క్లినర్లు దొరకకపోవడంతో పాటు రోజు రోజుకి పెరిగిపోతున్నజీవిత కాలపు పన్నులు, టోల్ ఫీజులు, ప్రభుత్వ కొత్త నిబంధనలు, కఠినమైన వాహనాలు కాలుష్య నియంత్రణ చట్టాలు, రవాణాశాఖ అధికారుల దాడులకు తట్టుకోలేక కొత్తగా ఎవరు రంగంవైపు రాలేకపోతున్నారు. ఇప్పటికే ఉన్నవాళ్లు కూడా తమవ్యాపారాన్ని గణనీయంగా తగ్గించుకోవడమో లేదా ఇతర ప్రత్యామ్న్యాయ వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారు. వెరసి ఈ ప్రభావం మొత్తం విజయవాడ ఆటోనగర్ పై పడింది.

విజయవాడ ఆటో క్లస్టర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ ( VACDCL ) కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలోని MSME డిపార్ట్మెంట్ కి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం విజయవాడ ఆటోనగర్ లోని ఈ యూనిట్లకు ముడిసరుకు పరిశీలించడానికి సరైన టెస్టింగ్ వ్యవస్థ లేకపోవడం, చాలా యూనిట్లకు ISO 9000 లాంటి సర్టిఫికేషన్ లేకపోవడం, గ్లోబల్ ఆటోమొబైల్ స్టాండర్డ్స్ JISC, ASTM, EU, DIN ప్రమాణాలకు తగ్గట్టు లేకపోవడం, అభివృద్ధి కాకూండా రిపేరింగ్ సెక్టార్ వరకే పరిమితం కావడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తయారీదారులతో ( original equipment manufactures ) అనుసంధానం కాకపోవడం, సొంతంగా బ్రాండ్ వ్యాల్యుని అభివృద్ధి చేసుకోకపోవడం, ప్రభుత్వ ఎగుమతుల పాలసీలపై సరైన అవగాహన లేకపోవడం, ఈ కామర్స్ వ్యాపారంలో వెనునుకబడడం, పనిచేసే కార్మికులకు కొత్తగా వస్తున్న సాంకేతిక అంశాలలో సరైన అవగాహన లేకపోవడం, Energy conservation (reducing power and energy) పై అవగాహన లేకపోవడంతో పాటు మరి ముఖ్యంగా కేవలం లారీలు బస్సులు లాంటి పెద్దవాహానాల మీదే ఆధారపడడం, కార్లు తయారీ లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్నఆటోమొబైల్ రంగంలో ప్రవగాహన లేకపోవడం విజయవాడ ఆటోనగర్ పరిశ్రమ దెబ్బతినడానికి ప్రధాన కారణంగా చూపింది.

ఒకప్పుడు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలనుండి విజయవాడ ఆటోనగర్ లో ట్రక్ బాడీ బిల్డింగ్ కి పెద్ద ఎత్తున చాసిస్ ఇంజన్లు వచ్చేవి. ముఖ్యంగా తమిళనాడు, కర్నాటక, తెలంగాణా ప్రాంతాలనుండి భారీగా ఆర్దర్లు విజయవాడ ఆటోనగర్ కి వచ్చేవి. కాలక్రమేణా ఇక్కడ పనిచేసిన కార్మికులు వలసలు పోవడం, అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో కూడా పెద్దఎత్తున బాడీ బిల్డింగ్ యూనిట్లు స్థాపించారు. కొత్తగా పేరుమోసిన బహుళజాతి కంపెనీలు కూడా ఈ రంగంలో ప్రవేశించడంతో దేశీయ సంప్రాదాయ బాడీ బిల్డింగ్ రంగం ఈ పోటీని తట్టుకోలేకపోయింది.

ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో పాటు పక్కనే ఉన్న తెలంగాణా హైదరాబాద్ చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున కొత్త ఆటోనగర్లు వెలిశాయి. దీనితో ఆ ప్రభావం విజయవాడ ఆటోనగర్ పై ప్రత్యక్షంగా పడింది. ఒకప్పుడు లక్మందికి పైగా ఉన్న విజయవాడ ఆటోనగర్ కార్మికులు ప్రస్తుతం 50 వేలమంది కూడా లేరు. ఆటో నగర్ లో పనిచేసే బరువులెత్తే ముఠాలకు, రోజువారీ కూలీలకు కూడా చేతిలో పని లేకుండా పోయింది.

అయితే ఈరోజు ఈనాడు మాత్రం విజయవాడ ఆటోనగర్ సంక్షోభం మొత్తానికి ఈ 7 నెలల జగన్ ప్రభుత్వ వైఖరే కారణం అంటూ కొత్తభాష్యం చెప్పే ప్రయత్నం చేసింది. వారు చెబుతున్నట్టు పోలవరం ఆగిపోవడం, రాజధాని ఆగిపోవడం వంటి అంశాలు ప్రభావం ఆటోనగర్ పై చాలా స్వల్పం. అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. ఆ విషయానికి వస్తే మొన్నటి వరకు నిర్మాణ రంగంలో ఇసుక కొరతని కారణంగా చూపెట్టారు, తరువాత వర్షాలు, వరదలు. కానీ ఇప్పుడు ఇసుక కూడా అందరికి అందుబాటులో దొరుకుతుంది. ఈనాడు చెప్పిన విధంగానే ఒకప్పుడు కృష్ణ ,గోదావరి పుష్కరాల సమయంలో, పట్టిసీమ కాలువ, పోలవరం కాలవల నిర్మాణం, నాగార్జున సాగర్ పరిధిలోని ఆయకట్టులో కాలువల ఆధునీకరణ ఇలా నిత్యం ఇదొక అభివృద్ధి పనులు జరుగుతూనే ఉంటాయి. అయినంత మాత్రాన వాటిమీద ఆధారపడి విజయవాడ ఆటోనగర్ అభివృద్ధి చెందలేదు కదా??

ఎక్కడైనా నిర్మాణ రంగం ఆగిపోతే దాని ప్రభావం సిమెంట్ మీద, స్టీల్ మీద, ఇసుక మీద, కాంట్రాక్టర్ల మీద, భావన నిర్మాణ కార్మికుల మీద పడుతుంది కానీ.. ఈనాడు పత్రిక చెప్పినట్టు విజయవాడపై ఆటోనగర్ మీద పడుతుందా?? తర్కం లేకుండా ఈనాడు చేస్తున్న వింత వాదన చూసి ఆఖరికి తలపండిన ఐవైఆర్ కృష్ణారావు వంటి ఐఏఎస్ అధికారులు, మేధావులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి