iDreamPost

టీడీపీ లో కుల నాయకులు తక్కువయ్యారా..?

టీడీపీ లో కుల నాయకులు తక్కువయ్యారా..?

ఆంధ్రప్రదేశ్‌లో కుల రాజకీయాలకు ఆధ్యుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అని అంటారు. సంక్షేమ పథకాలు, రాజకీయ విమర్శలు, సమస్యలు.. ఇలా ఏదైనా.. తన పార్టీలో ఉన్న ఆయా కులాల నేతలతో మాట్లాడించడం, విమర్శలు చేయించడంతోనే బాబుకు ఈ పేరు వచ్చిందని చెబుతుంటారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ఈ విధానాన్ని చంద్రబాబు అవలంభించారని గత రాజకీయాలను పరిశీలిస్తే తెలుస్తుంది.

గత ప్రభుత్వ హాయంలో బాబు ఇచ్చిన రిజర్వేషన్ల హామీని అమలు చేయాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేస్తే.. ఆయనపై టీడీపీలోని కాపు ప్రజా ప్రతినిధులతో విమర్శలు చేయించారు. ఎస్సీ వర్గీకరణను డిమాండ్‌ చేస్తూ ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ నిరసనలు చేస్తే.. ఆయనపై టీడీపీలోని మాదిగ సామాజికవర్గ ప్రజా ప్రతినిధులతో విమర్శలు చేయించారు. ఇలా బీసీ, ఎస్టీ, కాపు, రెడ్డి, కమ్మ, బ్రహ్మణ.. అన్ని సామాజికవర్గ సమస్యలు, విమర్శలు వచ్చినప్పుడు.. చంద్రబాబు తన పార్టీలోని అదే సామాజికవర్గ నేతలతో కౌంటర్లు, విమర్శలు చేయించిన విషయం సుస్పష్టం.

ఏళ్ల తరబడి ఈ విధానం అవలంభించిన చంద్రబాబు వైఖరిలో మార్పు వచ్చిందా..? ఆయన తన రాజకీయ పంథాను మార్చుకున్నారా..? అనే సందేహాలు ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో కలుగుతున్నాయి. ఇటీవల బీసీ కార్పొరేషన్లను వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో.. టీడీపీలోని బీసీ నేతలతోపాటు కాపు సామాజికవర్గ నేత అయిన మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా కూడా కార్పొరేషన్ల ఏర్పాటుపై విమర్శలు చేశారు. కార్పొరేషన్లకు చైర్మన్‌/చైర్‌పర్సన్, 12 మంది డైరెక్టర్ల చొప్పున పాలక మండళ్లను ఏర్పాటు చేస్తే.. వారికి కనీసం కుర్చీ వేస్తారా..? అంటూ మళ్లీ బొండా ఉమా ఎద్దేవా చేశారు. వారికి జీత భత్యాలు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో నాలుక్కరుచుకున్న ఉమా… మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. ఒక్కొక్క కార్పొరేషన్‌కు ఏడాదికి 500 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలనే డిమాండ్‌ను వినిపించారు.

ఈ పరిణామంతోనే పైన పేర్కొన్నట్లుగా.. చంద్రబాబు రాజకీయంపై సందేహలు కలుగుతున్నాయి. బొండా ఉమాది కాపు సామాజికవర్గం. బీసీ కార్పొరేషన్లపై ఆయన ఒక సారి విమర్శ చేస్తే.. ఏదో ఫ్లోలో అలా చేశారనుకొవచ్చు. కానీ మూడు సార్లు స్పందించడంతోనే కుల కట్టుబాట్లకు బాబు తెరదించారా..? అనే ప్రశ్న వినిపిస్తోంది. దీనికి కారణం ఏమిటనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. బీసీ నేతలు ఉన్నా.. ప్రభుత్వం పథకాలు, నిర్ణయాలపై విమర్శలు చేసేందుకు వారు ఎక్కువ మంది ముందుకు రాకపోవడంతోనే ఇలా ఇతర సామాజికవర్గ నేతలను బాబు రంగంలోకి దింపారా..? అనే సందేహాలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీలోని బీసీ నేతల్లో అచ్చెం నాయుడు, యనమల రామకృష్ణుడు, కొల్లు రవీంద్ర, బీద రవిచంద్ర యాదవ్‌లు మాత్రమే కొంత యాక్టివ్‌గా ఉన్నారు. మిగతా నేతలు ఉండీ లేనట్లుగా ఊగిసలాడుతున్నారు. ఈ పరిణామమే బాబును మారేలా చేసిందనే టాక్‌ నడుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి