iDreamPost

ఇక్కడికొచ్చాకైనా మాట్లాడతారంటావా..?

ఇక్కడికొచ్చాకైనా మాట్లాడతారంటావా..?

రోడ్డమ్మట వెళుతుంటే వీధిచివర్న కొంచెం 50కి అటూ ఇటూగా ఏజున్న నలుగురు మనుషులు కూర్చున్నారు. లాక్డౌన్‌ రూల్స్‌ నుంచి కొంచెం వెసులుబాటు లభించింది కదాని భౌతికదూరం పాటిస్తూ కూర్చుని చర్చమొదలెట్టేసారు. అందులో ఓ ఆసామి ‘ఇక్కడికొచ్చాకైనా మాట్లాడతారంటావా?’ అంటూ సందేహ మొహం పెట్టాడు. ఇంకో ఆయన ‘ఇంకేం మాట్లాడతాడు. అక్కడన్నీ కట్టలు కట్టి పక్కనెట్టేసినట్టే’ అన్నాడు. ఈ చర్చంతా ఎవరి కోసమే అనుకుంటూ ఆసక్తిగా వారి దగ్గరకెళ్ళి నుంచుంటే కాసేపటికి అర్ధమైంది.. వాళ్ళు మాట్లాడుకుంటున్నది మన టీడీపీ జాతీయాధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడిగారి గురించని. చర్చ ఆసక్తిగా ఉండడంతో అక్కడే నేనూ నిల్చున్నా.

‘‘… విడదీసిన రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ ఉందనుకుని అప్పట్లో జాతీయాధ్యక్షుడ్ని నేనే అన్నారు. రెండుకళ్ళ సిద్ధాంతానికి ఆధ్యుడాయన. కేసీఆర్‌ వస్తే సెటిలర్స్‌కి ముప్పు అంటూ వాళ్ళని పోగేసే ప్రయత్నం చేసాడు. తీరా ఎన్నికలయ్యాక సెటిలర్స్‌ గురించే మాటల్లేవు. పోనీ పార్టీని నమ్మి జెండాలు మోసి, బ్యానర్లు కట్టిన తెలంగాణాలోవాళ్ళగురించేమైనా ఆలోచించారా? అంటే అదీలేదాయె?. మొన్నటికి మొన్న లాక్డౌన్‌తో హైదరాబాదులో ఉండిపోయారు. అనుభవాన్నంతా క్రోడీకరించి రెండు రాష్ట్రాల గురించీ మాట్లాడితే కనీసం జాతీయాధ్యక్షుడ్ని నేనే అన్నందుకు ‘టైటిల్‌’ జస్టిఫికేషన్‌ అయ్యిందనైనా జనం అనుకునేవాళ్ళు. కానీ హైదరాబాదులో ఉండి ఆంధ్రాగురించి మాత్రమే మాట్లాడారు. దీంతో అక్కడున్న ఆయన పార్టీ వాళ్ళకు ఏదో చివరాకర్న మిగిలున్న ఆశలు కూడా వదిలేసుకున్నారంట….’’ ఇలా సాగుతోంది వారి చర్చ.

కొద్దిసేపు అక్కడున్న తరువాత ఇంట్లో వాళ్ళు పాలు తెమ్మన్న విషయం గుర్తొచ్చి అక్కడకు పరిగెత్తాను. దారిలో ఒకటే బుర్రలో తొలుస్తోంది. ఔను కదా.. వాళ్ళు మాట్లాడుకున్నది సబబే కదా అని. అక్కడుండగా మాట్లాడితే తేడా పాడాలొస్తాయేమోనని మాట్లాడలేదాయె.. కనీసం ఇక్కడకొచ్చాకైనా తెలంగాణాలో సెటిలర్స్‌ గురించో.. పోనీ.. సొంత పార్టీలో అక్కడక్కడా మిగిలిన వాళ్ళ ఇబ్బందులు, తెలంగాణా సీయం కేసీఆర్‌ పనితీరు.. ఇలా చాలా విషయాల గురించి మాట్లాడతారంటారా? లేకపోతే ఒక కన్ను పూర్తిగా మూసేసుకున్నట్టేనా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి