iDreamPost

కేరళలో వివాదం : బీజేపీ ‘జై శ్రీరామ్‌’ జెండాలు.. లెఫ్ట్‌ జాతీయ జెండాలు

కేరళలో వివాదం : బీజేపీ ‘జై శ్రీరామ్‌’ జెండాలు.. లెఫ్ట్‌ జాతీయ జెండాలు

కేరళలోని పాలక్కడ్‌ పట్టణంలో మునిసిపల్‌ ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించిన ఆనందంలో బీజేపీ కార్యకర్తలు ఆ పట్టణ మునిసిపల్‌ భవనంపై కాషాయ జెండాలు ఎగురవేశారు. ఛత్రపతి శివాజీ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఫొటోలు ఉన్న భారీ బ్యానర్లను ప్రదర్శించారు. వాటిలో ఓ జెండాపై ‘జై శ్రీరామ్‌’ అని నినాదం రాసి ఉంది. ఇది కాస్తా వివాదంగా మారింది.

మతపరంగా రెచ్చగొట్టే జెండాలను బీజేపీ కార్యకర్తలు ఎగురవేశారని పాలక్కడ్‌ మునిసిపల్‌ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేరళలో ఈనెల 8, 10, 14న స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. వాటిలో పాలక్కడ్‌ మునిసిపల్‌ స్థానంలో బీజేపీ వరుసగా రెండోసారి విజయం సాధించింది. ఈ క్రమంలో ఆ పార్టీ కార్యకర్తలు ఆనందం పట్టలేక మునిసిపల్‌ కార్యాలయ భవనం ఎక్కి జెండాలు ప్రదర్శించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి వివాదానికి కారణమైంది. మరోవైపు వామపక్ష కార్యకర్తలు శుక్రవారం పాలక్కడ్‌ భవనంపై జాతీయ జెండాను ఎగురవేసి బీజేపీ కార్యకర్తల చర్యకు సమాధానం చెప్పారు. ఆరెస్సెస్‌కు వ్యతిరేకంగా, లౌకికవాదానికి అనుకూలంగా నినాదాలు చేశారు. బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదు చేయడంపై పాలక్కడ్‌ బీజేపీ అధ్యక్షుడు, న్యాయవాది కృష్ణ దాస్‌ తప్పుపట్టారు. ‘జై శ్రీరామ్‌ నినాదాలు భారత్‌లో కాకుండా పాకిస్థాన్‌లో చేయాలా? జైశ్రీరామ్‌ అని రాసి ఉన్న జెండాలు ప్రదర్శిస్తే మతపరంగా రెచ్చగొట్టినట్లా? భావోద్వేగాలను దెబ్బతీసినట్లా?’ అని కృష్ణ దాస్‌ ప్రశ్నించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి