iDreamPost

ఏపీ ప్రభుత్వాన్ని మేమే కోరాం..పవన్ వ్యాఖ్యలతో సంబంధం లేదు – తేల్చేసిన నిర్మాతలు..

ఏపీ ప్రభుత్వాన్ని మేమే కోరాం..పవన్ వ్యాఖ్యలతో సంబంధం లేదు –  తేల్చేసిన నిర్మాతలు..

ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల రేట్లు సవరింపు అలాగే ఆన్లైన్ టికెట్ల వ్యవహారం మీద తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఒక తాటి మీదకు వచ్చింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదో చేసేస్తోంది అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున వివాదం చెలరేగినట్లయింది. అయితే ఈ విషయం మీద అసలు విషయం తేల్చేశారు తెలుగు సినిమా నిర్మాతలు. ఈరోజు దిల్ రాజు నేతృత్వంలో ఒక సినీ నిర్మాతల బృందం ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పేర్ని నానితో ఆయన క్యాంప్ ఆఫీస్ లో భేటీ అయ్యారు. సినీ నిర్మాతలు దిల్ రాజు, డి.వి.వి.దానయ్య, సునీల్ నారంగ్, రవిశంకర్(మైత్రీ మూవీ మేకర్స్), బన్నీ వాసు, వంశీ కృష్ణారెడ్డి(యూవీ క్రియేషన్స్) తదితరులు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయానికి తాము మద్దతు పలుకుతామని సినీ నిర్మాతలు పేర్కొన్నారు.

అంతేకాక రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ వ్యాఖ్యలకు మాకు సంబంధం లేదని నిర్మాతలు స్పష్టం చేశారు. ఆడియో ఫంక్షన్ లో జరిగిన పరిణామాలతో ఇండస్ట్రీకి సంబంధం లేదని చిరంజీవి కూడా ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీని బ్రతికించేందుకు ప్రభుత్వం ఇచ్చే సూచనలు, సలహాలు పాటించేందుకు సిద్ధమని కూడా నిర్మాతలు మంత్రితో పేర్కోన్నారు. స్వయంగా నిర్మాతలే పేర్ని నాని అపాయింట్మెంట్ అడిగి ఇండస్ట్రీకి నష్టం జరిగే కొన్ని సంఘటనలు జరుగుతున్నాయని ఈ విషయం మీద మాట్లాడాలని కోరగా మంత్రి వారికి సమయం ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీ అంతా ఒక్క మాటపై ఉన్నామని ఇదే మాట సీఎం జగన్ కు చెప్పండి అని పేర్ని నాని దృష్టికి తీసుకువెళ్లారు. ఆన్లైన్ టికెట్ల పై మేము అనుకూలం అని పేర్కొన్న నిర్మాతలు ఇప్పటికే పోర్టల్స్ నుంచి ఆన్లైన్ లో టికెట్ల అమ్మకం జరుగుతుంది అనే విషయాన్ని కూడా ప్రస్తావించారు.

అలాగే పవన్ కళ్యాణ్ మాతో చెప్పకుండా మాట్లాడారు అని, పవన్ వ్యాఖ్యలకు మేమంతా బాధపడ్డామని, పవన్ వ్యాఖ్యలకు సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు అని నిర్మాతలు మంత్రి పేర్ని నాని దృష్టికి తీసుకువెళ్లారు. చిరంజీవి , నాగార్జున , రాజమౌళితో కలిసి గతంలోనే సీఎం జగన్ ను టాలీవుడ్ బృందం ఒకటి భేటీ కాగా ఆ సమయంలో సినీ పరిశ్రమ మీద కరోనా ప్రభావం అలాగే సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న అనేక సమస్యలను జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇక ఈ రోజు జరిగిన భేటీ తర్వాత సినిమా ఇండస్ట్రీ అనేది చాలా సున్నితంగా ఉండే ఇండస్ట్రీ అని దయచేసి అందరూ వివాదాలకు సినిమా ఇండస్ట్రీని దూరంగా ఉంచండి అని నిర్మాతలు కోరారు.

గతంలో సినీ పరిశ్రమ నుంచి వెళ్లి ఏపీ సీఎం జగన్ తో చేసిన విజ్ఞప్తుల మీద ఏపీ ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందించిందని నిర్మాతలు క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాక ఆన్ లైన్ విధానం కావాలని పరిశ్రమ తరపున మేమే ప్రభుత్వాన్ని కోరామని, ఆన్ లైన్ విధానం ద్వారా ట్రాన్సరెన్సీ ఉంటుందని నిర్మాతల బృందానికి నేతృత్వం వహించిన దిల్ రాజు పేర్కొనడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి సినిమా ఇండస్ట్రీకి ఇలాంటి ఇబ్బందులు లేవని ఇదంతా పవన్ కళ్యాణ్ తదితరుల సృష్టి అని క్లారిటీ వచ్చినట్లయింది. ఇక ఈ అంశం మీద ఎవరేం మాట్లాడినా ఇక ఉపయోగం ఉండకపోవచ్చు.

Also Read : ఒకవైపు మా ఎన్నికలు – మరోవైపు టికెట్ల చర్చలు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి