iDreamPost

ఉరి ఖాయమే

ఉరి ఖాయమే

నిర్భయ దోషులకు పాటియాలా హౌస్ కోర్ట్ డెత్ వారంట్ జారీ చేయడంతో నిర్భయ కేసులో నలుగురు నిందితులని ఈనెల 22 న ఉదయం 7 గంటలకు ఒకేసారి ఉరి తీయడానికి తీహార్ జైలులో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. నిందితులు ముఖేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ లనుఉరి తీసేందుకు తీహార్ జైలు లోని 3 వ నంబర్ గదిలో సన్నాహక కార్యాక్రమాలు కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగానే జైలు అధికారులు బుధవారం నుండి మాక్ ఉరి కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నారు.

పీడబ్ల్యూడీ కార్యనిర్వాహక ఇంజినీరుతోపాటు జైలు అధికారులు హాజరై ఈ మొత్తం తతంగాన్ని పర్యవేక్షిస్తారని జైలు సూపరింటెండెంట్ చెప్పారు. పార్లమెంటుపై దాడి కేసులో నిందితుడైన అఫ్జల్ గురును ఉరి తీసిన 3 వ నంబరు గదిలోనే నిర్భయ దోషులు నలుగురికి 22 వ తేదీ ఉదయం 7 గంటలకు ఒకేసారి ఉరి తీయనున్నారు. ఇప్పటికే ఉరి తీసే తలారీని ఉత్తరప్రదేశ్ జైళ్ల శాఖ నుంచి ఢిల్లీకి రప్పించారు. పాటియాలా కోర్ట్ నిందితులను ఉరి తీయడానికి జారీ చేసిన డెత్ వారెంట్ నే బ్లాక్ వారెంట్ అని కూడా అంటారు, దీనిలో భాగంగానే న్యాయపరిభాషలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌, ఫారం 42 ని జారీ చేస్తారు. ఇందులో కోర్టు ఉరి తీయవలసిన వ్యక్తి పేరు, ఉరితీసిన తేదీ మరియు ఉరితీసిన సమయాన్ని పేర్కొంటుంది. ఈ బ్లాక్ వారెంట్ కవర్ ఎరుపు రంగు ఎన్వలప్ లో ఉంటుంది.

అయితే నిందితులు 22 లోపు ఉరి శిక్ష నుండి తప్పించుకోవడానికి లేదా ఈ ప్రక్రియ ని వాయిదా కోరడానికి నిందితులకు చిట్ట చివరి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలిస్తే నలుగురు దోషులు ఇప్పటినుండి 14 రోజులలోపు, అంటే జనవరి 21 వరకు సుప్రీంకోర్టు లో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసుకొనే అవకాశం ఉంది. దోషుల తరపున వారి న్యాయవాది దీనిని కోర్టులో దాఖలు చేస్తాడు, ఈ క్యురేటివ్ పిటిషన్ ని కనుక సుప్రీం కోర్ట్ కొట్టివేసిన తరుణంలో ఇక చిట్టా చివరి ప్రత్యామ్న్యాయంగా ఈ నలుగురు నిందితులు మరొక్కసారి రాష్ట్రపతి ని క్షమాబిక్ష కోరుతూ మెర్సీ పిటిషన్ పెట్టుకొనే అవకాశం వుంది. 

మోడల్ ప్రిజన్ మాన్యువల్ 2016 ప్రకారం నిందితుల క్షమాభిక్షకు అన్ని అవకాశాలు మూసుకుపోయిన తర్వాత నే దోషులను ఉరి తీయాలని నిభందనలు స్పష్టంగా చెబుతున్నాయి. అయితే గతంలో 2015 ఎస్సీ షబ్నం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో, ప్రత్యేక ట్రయల్ కోర్ట్ ద్వారా శిక్ష పడ్డ దోషులు అన్ని చట్టపరమైన మార్గాలను ఉపయోగించుకునే వరకు డెత్ వారెంట్ ని జారీ చేయవద్దని ట్రయల్ కోర్టులను సుప్రీం కోర్ట్ ఆదేశించింది.

నిర్భయ కేసులో కూడా డెత్ వారెంట్ జారీ చేసిన పాటియాలా హౌస్ కోర్టు గత నెలలో కేసును వాయిదా వేసింది. దీనికి కారణం నిందితుల్లో ఒకరు దాఖలు చేసిన క్షమాబిక్ష పిటిషన్ పెండింగ్ లో ఉండడమే, అయితే తరువాత నిందితుడు తన అనుమతి లేకుండానే తన పేరు మీద క్షమాబిక్ష పిటీషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నందున దానిని నిందితుడే ఉపసంహరించుకున్నాడు.ఆ తరువాతే పాటియాలా కోర్ట్ డేత్ సెంటెన్స్ జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో చట్టపరంగా దోషులకు ఇప్పటికే దాదాపు అన్ని దారులు మూసుకుపోవడంతో ఉరి ఖాయంగా కనిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి