iDreamPost

మా కార్యదర్శి మీద చర్యలు తీసుకోండి గవర్నర్ గారు— మండలి చైర్మన్ షరీఫ్

మా కార్యదర్శి మీద చర్యలు తీసుకోండి గవర్నర్ గారు— మండలి చైర్మన్ షరీఫ్

తనకున్న విచక్షణ అధికారాలను ఉపయోగించి శాసనమండలికి వచ్చిన రెండు బిల్లులలను సెలక్ట్ కమిటీ పరిశీలనకుకి పంపిస్తూ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, తన ఆదేశాలను శాసనమండలి కార్యదర్శి పాటించలేదని, సెలక్ట్ కమిటీ ఏర్పడినట్టు బులిటెన్ విడుదల చెయ్యమని ఇప్పటికి మూడుసార్లు మండలి కార్యదర్శి బాలకృష్ణాచార్యులను ఆదేశించినప్పటికీ, మండలి కార్యదర్శి తన ఆదేశాలను పాటించలేదని, ఈ వివాదంలో మీరు కలుగజేసుకోవాలని కోరుతూ శాసనమండలి చైర్మన్‌ ఎం.ఎ.షరీఫ్‌ గవర్నర్ తలుపులు తట్టారు.

అధికార వికేంధ్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు అంశంలో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో, శాసనమండలి చైర్మన్ మంగళవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో సమావేశమయ్యారు. రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా నిరాకరిస్తున్నారని, తనకు సహకరించకపోగా ప్రభుత్వానికి మండలికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడానికి కారకులయ్యారని ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మండలికి కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఇన్‌చార్జి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని ఆయన గవర్నర్ ని కోరారు. ఆ స్థానంలో విజయరాజును నియమించాలని విజ్ఞప్తి చేశారు.

Also Read:రాజధాని వికేంద్రీకరణ విషయంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందా?

గవర్నర్ ని కలిసిన తరువాత మీడియాతో మాట్లాడిన శాసనమండలి చైర్మన్ షరీఫ్ పోయిన నెల 27న, ఈ నెల 6న నేను రెండుసార్లు కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశానని, అయినా పాటించకుండా ఫైలును నాకు తిప్పి పంపారని తెలిపారు. కాగా ఈనెల 12 న 48 గంటల్లో సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటుపై బులెటిన్‌ విడుదల చేయాలని చివరగా నేను కార్యదర్శిని ఆదేశించాను. అప్పుడు కూడా ఆ ఆదేశాలను పాటించకుండా దానిని ఈ నెల 14న ఫైలు ను తిప్పి పంపారు’ అని వివరించారు. ఈ విషయాన్నీ గవర్నర్ దృష్టికి తీసుకురవడానికే తానూ గవర్నర్ ని కలిశానని చెప్పుకొచ్చారు.

చట్ట సభ చైర్మన్‌ సభ నిర్వహణకు సంబంధించిన అంశాల్లో గవర్నర్‌ను కలవడం శాసనమండలి చైర్మన్ కలవడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రధమం. ఒక రాష్ట్రంలో అసెంబ్లీ కార్యదర్శి ని కానీ, శాసనమండలి కార్యాదర్శిని కానీ గవర్నర్‌ ఉత్తర్వులతోనే నియమిస్తారు. ఈ నేపథ్యంలోనే శాసనమండలి చైర్మన్ షరీఫ్ నేరుగా గవర్నర్ నే కలిశారని తెలుస్తుంది.

అసెంబ్లీకి ప్రస్తుతం ఇన్‌చార్జి కార్యదర్శిగా ఉన్న బాలకృష్ణమాచార్యులు శాసనమండలికి కూడా కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. గతంలో రెండు సభలకు వేర్వేరుగా కార్యదర్శులు ఉండేవారు. కొన్ని నెలల క్రితం మండలి కార్యదర్శి రిటైరైన తర్వాత అసెంబ్లీ కార్యదర్శికే ఆ విధులు కూడా అప్పగించారు. అయితే షరీఫ్ కొత్త కార్యదర్శిగా నియమించమని గవర్నర్ కి సిఫార్సు చేసిన విజయరాజు గతంలో టీడీపీ హయాంలో శాసనమండలి కార్యదర్శిగా పనిచేశారు. మండలి సమావేశాల్లో రాజధాని బిల్లులు చర్చకు వచ్చిన నాటినుంచి ఇప్పటివరకూ చోటు చేసుకున్న పరిణామాలను వివరిస్తూ ఛైర్మన్‌ నాలుగు పేజీల వినతిపత్రాన్ని గవర్నర్‌కు అందజేశారని తెలుస్తుంది.

మండలి కార్యదర్శి బాలకృష్ణాచార్యులు గతంలోనే సభను నడపడంలో మీకు సహాయపడటం తన విధి అని 189 అధికరణ కింద సెలెక్ట్ కమిటీ చెల్లదని చైర్మన్ షరీఫ్ కు ఉత్తరం రాశారు. టీడీపీ నేతలు సభా హక్కుల ధిక్కరణ నోటీస్ ఇస్తామని చేసిన హెచ్చరికలు కూడా పనిచేయలేదు.

ఇప్పుడు మండలి చైర్మనే ఈ వివాదాన్ని గవర్నర్ వద్దకు తీసుకువెళ్లటంతో రూల్స్ మీద చర్చ జరగటం ఖాయంగా కనిపిస్తుంది.. చైర్మన్
నిర్ణయం మీద గవర్నర్ ఏమని స్పందిస్తారో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి