iDreamPost

కరోనా వర్సెస్‌ వాలంటీర్‌

కరోనా వర్సెస్‌ వాలంటీర్‌

ఈ రోజు ఉదయం 7 గంటలకు ఫోన్‌ మోగింది. లిఫ్ట్‌ చేయగానే.. ఆవల వైపు నుంచి తమ్ముడు. ‘‘ అన్నా.. మన వాలంటీర్‌ ఫోన్‌ చేసింది. మాచవరం ప్రాథమిక వైద్యశాలకు వెళ్లి కరోనా టెస్ట్‌ చేయించుకోవాలట. ఈ రోజు వెళ్లి బ్లడ్‌ శాంపిల్‌ ఇవ్వాలని చెప్పింది.’’ అన్నాడు ఓకింత ఆందోళన స్వరంతో. ఎందుకు ఆందోళన.. వెళ్లి చేయించుకో. మంచిదే కదా అన్నాను. ‘‘టెస్ట్‌ చేయించుకోవడానికి ఇబ్బంది లేదు. ఇంకా చాలా సంతోషమే. కానీ ఈ రోజు చాలా పని ఉంది. క్లయింట్‌ కాల్‌ అటెండ్‌ చేయాలి. ముందుగా చెప్పకుండా శెలవు పెట్టలేం. ఈ రోజు కాదు రేపు వెళతాను. ఈవిషయం వాలంటీర్‌కు చెబితే వినిపించుకోవడంలేదు. ఒకసారి మాట్లాడు’’ అని అన్నాడు. సరే అని ఫోన్‌ పెట్టేశాను.

తమ్ముడు ఎంఎన్‌సీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. బెంగుళూరు నుంచి రెండు రోజుల క్రితమే ఊరికి వచ్చాడు. వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నాడు. ఇప్పటికే మూడు నెలల నుంచి బెంగుళూరులో రూమ్‌లో నుంచే పని చేస్తున్నాడు. మరో మూడు నెలలు వర్క్‌ ఫ్రం హోం పొడిగించారట. లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో ఊరికి వచ్చాడు. ఇక్కడ నుంచే పనిచేయాలనుకున్నాడు.

సరే.. అని ఫోన్‌ పెట్టేసి నేను… మా వాలంటీర్‌కి ఫోన్‌ చేశాను. ఇదమ్మా విషయం.. మరి ఎలా…? అని అడిగాను. ‘మేడం ఈ రోజే తీసుకురమ్మంది. మన ఊరి నుంచి ముగ్గురు ఉన్నారు. ఎవరికి వారు వెళ్లి శాంపిల్‌ ఇవ్వాలని చెప్పారు’’ అని పరిస్థితి వివరిస్తూ.. హైదరాబాద్, బెంగుళూరు, ఇతర ప్రాంతాల నుంచి ఊరికి వచ్చిన వారికి పరీక్షలు చేయించాలని ప్రభుత్వం ఆదేశాలట. సరే.. నేను మేడంతో ఒక సారి మాట్లాడి చెబుతా.. అంటూ ఫోన్‌ కట్‌ చేసింది. మరో ఐదు నిమిషాలకు వాలంటీర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ‘‘ మేడంకు చెప్పాను. సరే అన్నారు. రేపు ఖచ్చితంగా రావాలని చెప్పారు. లేదంటే మహిళా కానిస్టేబుల్‌ను వారి ఇంటికి పంపించి చెప్పిస్తాం అని చెప్పమన్నారు.’’ అని బిగ్‌బాస్‌ స్వరంతో చెప్పి ముగించింది.

కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. వాలంటీర్ల ద్వారా వైరస్‌ కట్టడికి పటిష్ట చర్యలు వేగవంతంగా చేపడుతోంది.. అంటూ హైదరాబాద్‌లో ఉన్న నేను మీడియాలో చూడడం తప్పా నేరుగా చూసింది లేదు. కానీ ఈ రోజు ఘటన.. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కట్టడికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది..? అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది. 13 జిల్లాలు, ఐదు రాష్ట్రాలతో సరిహద్దు..దాదాపు 6 కోట్ల జనాభా, ఉపాధి, ఉద్యోగాల కోసం దేశ విదేశాలకు వెళ్లిన వారు తిరిగి వస్తున్నారు. వైరస్‌ వ్యాప్తి వేగంగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అయినా ఏపీ ప్రభుత్వం ఏ మాత్రం బెనకడంలేదు..తొనకడంలేదు. కారణం.. వాలంటీర్‌ వ్యవస్థ.

రాష్ట్రంలో ఏ మూలన ఏమి జరిగినా నిమిషాల వ్యవధిలో సమాచారం అందించే వాలంటీర్‌ వ్యవస్థ వైసీపీ ప్రభుత్వానికి కొండంత బలం తెచ్చిపెట్టింది.

ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడమే కాదు.. ఇసుక, మద్యం అక్రమాలపై సమాచారం కూడా వాలంటీర్లు ప్రభుత్వానికి చేరవేస్తూ వాటి కట్టడిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక కరోనా విషయం చూస్తే.. ఇప్పటికే మూడు సార్లు ఇంటింటి సర్వే చేపట్టి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారి జాబితాను ప్రభుత్వానికి అందించారు. వారి ఇచ్చిన జాబితా ప్రకారం దాదాపు 30 వేల మంది అనుమానితులకు ప్రభుత్వం కోవిడ్‌ పరీక్షలు చేసింది.

ఇప్పుడు లాక్‌డౌన్‌ సడలింపులతో పట్టణాలు, నగరాల నుంచి గ్రామాలకు రాకలు పెరిగాయి. వైరస్‌ నగరాల నుంచి గ్రామాలకు వ్యాపించకుండా, ముందుగానే కట్టడి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇదే విషయం ప్రధాని మోదీ కూడా చెప్పారు. గ్రామాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే.. ఏపీకి ఉన్న అద్భుతమైన వాలంటీర్‌ వ్యవస్థ మరే రాష్ట్రానికి లేదు. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌ వంటి రాష్ట్రాలు కరోనా ధాటికి విలవిలలాడుతుంటే.. ఏపీ మాత్రం విజయవంతంగా కట్టడి చేస్తోంది. ఇందుకు ఆయా రాష్ట్రాల్లో నమోదైన, నమోదవుతున్న పాజిటివ్‌ కేసులే నిదర్శనం.

వాలంటీర్ల సేవలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాత్రమే కాదు.. ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా గుర్తించి కొనియాడుతున్నారు. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు.. వాలంటీర్లు చేస్తున్న సర్వీస్‌కు ఐదు వేల గౌరవ వేతనం ఏ మాత్రం సరిపోదని, వారికి పది వేల రూపాయలు ఇవ్వాలని ఇటీవల డిమాండ్‌ చేయడం ఇక్కడ గమనార్హం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి