iDreamPost

పరీక్షల నిర్వహణపై విమర్శలకు సీఎం జగన్‌ చెక్‌

పరీక్షల నిర్వహణపై విమర్శలకు సీఎం జగన్‌ చెక్‌

కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఇప్పటి వరకు వచ్చిన విమర్శలు, పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్లకు ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చెక్‌ పెట్టారు. పరీక్షలు ఎందుకు నిర్వహించాలనుకుంటున్నాం..? వాటి ఆవశ్యకత ఏమిటో సవివరంగా చెప్పారు. జగనన్న వసతి దీవెన పథకం తొలి విడతను ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా విద్యకు తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను గురించి వివరించారు. ఈ సమయంలోనే పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై క్లారిటీ ఇచ్చారు.

దేశంలో భిన్న విధానాలు..

‘‘దేశంలో విద్యావిధానం ఒకే మాదిరిగా లేదు. పరీక్షల నిర్వహణ అంశం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పజెప్పింది. కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించాయి.. నిర్వహిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు రద్దు చేశాయి. దేశంలో ఒకే పాలసీ లేనప్పుడు.. కొన్ని రాష్ట్రాలో పరీక్షలు జరిగి. మరికొన్ని రాష్ట్రాలో రద్దు చేస్తే.. విద్యార్థులకు అపార నష్టం జరుగుతుంది. పరీక్షలు జరిగిన రాష్ట్రాల పిల్లలకు మార్కులు, గ్రేడులు, పర్సెంటేజ్‌లతో సర్టిఫికెట్లు వస్తాయి. పరీక్షలు నిర్వహించని రాష్ట్రాల పిల్లలకు పాస్‌ అంటూ సర్టిఫికెట్‌ వస్తుంది. ఉన్నత చదువులకు దరఖాస్తు చేసుకున్నప్పుడు.. మార్కులు, పర్సంటేజీ ఉన్న పిల్లలకు మంచి కాలేజీలలో సీట్లు వస్తాయా..? లేక పాస్‌ సర్టిఫికెట్‌ ఉన్న పిల్లలకు సీట్లు వస్తాయా..? ’’ అనేది విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించాలని జగన్‌ కోరారు.

నా కన్నా ఎక్కువ ఎవరూ ఆలోచించరు..

ప్రస్తుత కోవిడ్‌ సమయంలోనూ కొంత మంది రాజకీయాలకు పాల్పడుతున్నారు. అగ్గి రాజేయాలని చూస్తున్నారంటూ సీఎం వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. ‘‘ పరీక్షలు రద్దు చేయమని చెప్పడం చాలా సులువు. కానీ నిర్వహించడం చాలా కష్టం. కానీ అలా చేయకుండా.. పరీక్ష నిర్వహించడం ఒక బాధ్యతగా తీసుకోవడం, పిల్లలను చేయిపట్టుకుని నడిపించడం అనేది చాలా కష్టతరమైన పని. అయినా అన్ని జాగ్రత్తుల తీసుకుని పరీక్షలు నిర్వహిస్తాం. మంచి చేయాలనే తప్పా.. ఎవరికీ నష్టం చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉండదు. పిల్లలకు మంచి చేయాలని నా కన్నా ఎవరూ ఎక్కువ ఆలోచించరు..’’ అని సీఎం వైఎస్‌జగన్‌ స్పష్టం చేశారు.

ఇక ప్రిపరేషన్‌ బాట..

కోవిడ్‌ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పినా.. రద్దు అవుతాయని ఎక్కడో చిన్న అనుమానం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఉంది. దీనికి తోడు ప్రతిపక్ష పార్టీల నేతలు పరీక్షలు రద్దు చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు డైలమాలో పడ్డారు. పరీక్షలకు సన్నద్ధమవ్వాలా..? లేదా..? అనే శంచయంలో ఇప్పటి వరకు ఉన్నారు. అయితే పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ వైఖరిని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేయడంతో విద్యార్థులకు ఓ క్లారిటీ వచ్చింది. ఇకపై ఎలాంటి అనుమానాలు లేకుండా పరీక్షలకు సన్నద్ధమవుతారు.

Also Read : ఏపీ : ఆప‌త్కాలంలో అద్భుత చ‌ర్య‌లు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి